విజయవాడ: రాజకీయ కక్షసాధింపుల కోసం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగానే పేరుపోగు క్రాంతికుమార్ బలయ్యాడని, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యేనని వైయస్ఆర్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుపోగు క్రాంతికుమార్ మరణంపై సీబీఐ విచారణ జరిపి అందుకు కారకులైన పోలీసులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్టలంక సీఐ నాగరాజు వేధిపుల కారణంగా గతనెల 21న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబాన్ని ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీఅధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆద్వర్యంలో పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డి, విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఆసిఫ్, పార్టీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ తదితరులు పరామర్శించిన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. క్రాంతికుమార్ మరణంతో తండ్రిలేక దిక్కులేని వారిగా మిగిలిన ముగ్గురు బిడ్డలను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ట్యాక్సీ నడుపుకుంటూ తన బతుకు తాను బతుకుతున్న వ్యక్తిని ఇన్‌ఫార్మర్‌గా మారాలని సీఐ నాగరాజు వేధించాడని, తన మాట వినకపోతే గంజాయి కేసులో ఇరికిస్తానని బెదిరించేవాడని చెప్పారు. తన మాట వినడం లేదని స్టేషన్‌కి పిలిచి దారుణంగా కొడుతున్నాడని, ఆ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్టు సెల్ఫీ వీడియోలో రికార్డింగ్ చేశాడని వివరించారు. కూటమి ప్రభుత్వం తీసుకోచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగమే యువకులను బలితీసుకుంటోందని, ప్రజలను కాపాడాల్సిన పోలీసులే అమాయకులను చంపేసి బూడిద కూడా దొరకకుండా మృతదేహాలను మాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దారుణాలకు అడ్డుకట్ట పడాలంటే సీఐ నాగరాజు ఒక్కడి మీద చర్యలు తీసుకుంటే సరిపోదని, ఏసీపీ, సీపీ, డీజీపీ, హోంమంత్రి, సీఎంలను కూడా నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు. క్రాంతికుమార్ కుటుంబానికి సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వారు ఇంకా ఏం మాట్లాడారంటే... ● క్రాంతి కుమార్ కుటుంబానికి సీఎం క్షమాపణలు చెప్పాలి - దేవినేని అవినాశ్, ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ పోలీసులను రాజకీయ కక్షసాధింపులకు వాడుకోవడం వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. రెడ్‌బుక్ రాజ్యాంగం ఇచ్చిన ధైర్యంతోనే కొంతమంది పోలీసులు సైతం ఇష్టారాజ్యంగా రెచ్చిపోతూ సామాన్యులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్టు పేరుపోగు క్రాంతికుమార్ సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేశారు. ట్యాక్సీ నడుపుకుంటూ తన బతుకు తాను బతుకుతున్న వ్యక్తిని ఇన్‌పార్మర్‌గా మారాలని సీఐ నాగరాజు వేధించాడు. లేదంటే గంజాయి కేసు పెడతానని బెదిరించాడు. ఈ వేధింపులకు భయపడే క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తమ దందాలకు అమాయకులను వాడుకుంటున్నారు. వారు చెప్పినట్టు వినకపోతే స్టేషన్‌కి పిలిపించి విపరీతంగా కొట్టి వేధిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూనే సామాన్యులను భ్రయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యే. దీనికి సీఐతోపాటు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు, డీజీపీ, సీఎం, హోంమంత్రి బాధ్యత వహించాలి. క్రాంతికుమార్ మరణంతో ఆయన ముగ్గురు పిల్లలు తండ్రి లేనివారయ్యారు. క్రాంతికుమార్ కుటుంబాన్ని సీఎం చంద్రబాబు పరామర్శించాలి. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలి. క్రాంతికుమార్ కుటుంబానికి సీఎం చంద్రబాబు, డీజీపీ క్షమాపణలు చెప్పాలి. వైయస్ జగన్ గారు ప్రశ్నించకపోతే సాయికృష్ణ, క్రాంతి కుమార్‌ల మరణాలు వెలుగులోకి వచ్చేవి కావు. సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐ విచారణ జరిపించాలి. ● క్రాంతికుమార్ కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించాలి - రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ మాజీ మేయర్ కూటమి ప్రభుత్వం వచ్చాక అమాయక యువకులను తమ స్వార్థ రాజకీయాల కోసం బలితీసుకుంటున్నారు. వెనుకబడిన కులాలకు చెందిన యువకులను ఇన్‌ఫార్మర్‌లుగా మారాలని పోలీసులు వేధిస్తున్నారు. తమ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగం ఫలితంగానే అమాయకుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. తప్పులు చేసి సెటిల్మెంట్‌లు చేసుకోవడం రివాజుగా మారిపోయింది. క్రాంతికుమార్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వారి కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించాలి. సీపీ తక్షణం క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనపై స్పందించాలి. పేరుపోగు వెంకటేశ్వరరావు కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. ● పోలీసులే అరాచకాలు చేస్తున్నారు - పూనూరి గౌతమ్ రెడ్డి, వైయస్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే యువకుల ప్రాణాలు తీసేస్తున్నారు. వారే ప్రాణాలు తీసేసి విషయం బయటకు రాకుండా సెటిల్మెంట్‌లు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వేధింపులు కారణంగా ఇప్పటికే 12 మంది చనిపోయారు. కానీ దానికి బాధ్యులైన ఏ ఒక్కరి మీదా ప్రభుత్వం చర్యలు తీసుకున్న పాపానపోలేదు. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న విజయవాడలో జరుగుతున్న దారుణాలు చూసి సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. క్రాంతికుమార్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. దళిత మహిళని అని చెప్పుకునే హోంమంత్రి అనిత, సాటి దళితుడి కుటుంబానికి జరిగిన అన్యాయంపై స్పందించి న్యాయం చేయాలి.