తాడేపల్లి: విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్యలపై వైయస్ఆర్‌సీపీపీ ఆధారాలతో సహా ప్రశ్నిస్తుంటే, తట్టుకోలేక పవన్ కళ్యాణ్ అసహనంతోనే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి అని మర్చిపోయినట్లున్నారని ఆక్షేపించారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ సాయికృష్ణ జాడ చెప్పాలని, అతను చనిపోతే తల్లికి బూడిద అయినా అప్పగించాలని, ఇందుకు కారణమైన సీఐ నాగరాజును అరెస్టు చేసి, అతనిపై అట్రాసిటీ కేసు పెట్టాలని టీజేఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్ లో టీజేఆర్ సుధాకర్ బాబు ఇంకేమన్నారంటే... వైయస్ఆర్‌సీపీపై పవన్ ఛీప్ కామెంట్స్ పవన్ కళ్యాణ్ మా అందరినీ గూండాలుగా అభివర్ణిస్తూ తొక్కి నార తీస్తా అన్న వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోమని కోరుతున్నాం. ఆయన ఉపముఖ్యమంత్రి అన్న విషయం, ప్రభుత్వాన్ని నడుపుతున్నానన్న విషయం మర్చిపోయినట్లున్నారు. మర్చిపోయి అయినా ఉండాలి, లేదా ఆయన ఏ పవర్స్ లేని పవన్ కళ్యాణ్ అయినా అయి ఉండాలి. సినిమాల్లో పవర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో పవర్ లెస్ స్టార్ గా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రక్తపు చేతులతో తడిచిపోయింది. ప్రజా ప్రతినిధులే నేరాలు చేయడం, వారిని చంద్రబాబు పిలపించుకుని రాజీ చేయడం అలవాటైంది. తెల్లారేసరికి ఏదో తేడా వచ్చింది, ప్రజల్లో చంద్రబాబు పలుచన అయ్యారని తెలియగానే పవన్ కళ్యాణ్ చొక్క మార్చుకుని, ఏదో ఒక మీటింగ్ పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఈ మధ్య చంద్రబాబుకు వయసు రీత్యా కానీ, జరుగుతున్న పరిణామాల రీత్యా కానీ బాగా బీపీ డౌన్ అవుతోంది. వెంటనే పవన్ కళ్యాణ్ కు బీపీ పెరుగుతోంది. ఆ రోజు కూడా చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టగానే పవన్ కళ్యాణ్ అడ్డదిడ్డంగా వచ్చి నిలబడ్డారు. నేరం ఏం జరిగింది, చంద్రబాబు నిజంగానే నేరం చేశారా లేదా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఐడీ అధికారులు వెళ్లి అరెస్టు చేశారు, అసలా కేసు పూర్వాపరాలు ఏంటనేది పరిశీలించకుండా పవన్ కళ్యాణ్ వెళ్లి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు అభ్యంతరం ఏంటంటే అధికారం కూటమిలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రా ? ఉత్తి మంత్రా ? ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి స్ధాయిలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు లేవు. తొక్కి నార తీస్తా అనే అర్ధం ఏంటో పవన్ చెప్పాలి. అంటే నా చర్మం వలుస్తావా ? వైయస్ఆర్‌సీపీ గూండాలు అంటే ఎవరు, ఒకరా ఇద్దరా ? ఓ బాధ్యత గత ఉప ముఖ్యమంత్రి తన సొంత కులానికి చెందిన సాయికృష్ణ విచారం వ్యక్తం చేయాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. నేరస్తుడైన సాయికృష్ణ ఇంటికి ఎందుకు వెళ్లారు ? జనసేన కార్యకర్త, కాపు కులస్తుడు కూడా అయిన సాయికృష్ణను కృష్ణలంక సీఐ నాగరాజు మార్కాపురం నుంచి తెచ్చి లాకప్ లో చంపేశాడన్నది అభియోగం. దీన్ని బయటపెట్టింది వైయస్ఆర్‌సీపీ కాదు, అతని తల్లే. ఆమె బోరున విలపిస్తూ నా కొడుకుని ఏం చేశారో సమాధానం చెప్పండి, మీరు పై అంతస్తులో కొడుతుంటే మా అబ్బాయి ఏడుపులు వినిపించాయని గగ్లోలు పెట్టింది. ఇంకా దీనంగా అయ్యా కనీసం బూడిద అయినా ఇమ్మని అడిగింది. అది వైయస్ఆర్‌సీపీ శ్రేణుల్ని, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కదిలించింది. జనసేన పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్లి వైయస్ఆర్‌సీపీ అధినేత పరామర్శించాల్సిన దుస్దితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మీ పార్టీ కార్యకర్త చనిపోతే, మీ పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్లోనే చంపేస్తే, ఆ తల్లికి జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడ్డారు.ఏ కులం పెట్టి నువ్వు రాజకీయాలు చేస్తున్నావో, ఆ కులానికి చెందిన నవ యువకుడు లాకప్ డెత్ లో చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదన్నట్టు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలున్నాయి. నేర ప్రవృత్తి కలిగిన వారు తమ పార్టీ అయినా వదలడానికి వీల్లేదని పవన్ కళ్యాణ్ నిన్న ఉపన్యాసం ఇచ్చారు. అటువంటప్పుడు చంద్రబాబు ఆ కుటుంబాన్ని ఎందుకు ఇంటికి పిలిపించుకుని మాట్లాడారో చెప్పాలి. చిన్న పాపను రేప్ చేసి చింపేసిన నేరస్తుడి కుటుంబాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పిలిపించుకుని మాట్లాడారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. మీ పార్టీ నేత సామినేని ఉదయభానును కూడా సాయికృష్ణ ఇంటికి పంపారు. పవన్ కళ్యాణ్ చెప్తే వచ్చానని కూడా చెప్పుకున్నారు. ఉదయం మీరు నేరస్తులు అన్న వారి ఇంటికి మీ పార్టీ నాయకుడిని ఎందుకు పంపారు?, అంతకు ముందే జనసేన పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వాసు వెళ్లారు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా వెళ్లారు, ఆ తర్వాత మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను వెళ్లారు, ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు. పవన్ కళ్యాణే ఓ క్రిమినల్, అట్రాసిటీ కేసు పెట్టాలి ఇప్పుడు పవన్ చెబుతున్న భాష్యం ప్రకారం వైయస్ఆర్‌సీపీ క్రిమినల్స్ కు సపోర్ట్ చేస్తుంది, క్రిమినల్స్ ఉండటం వైయస్ఆర్‌సీపీ బలం అంట. మేం క్రిమినల్స్ తో ఉండటం బలం అని పవన్ అంటున్నారు. కానీ ఆయనే ఒక క్రిమినల్, గతంలో తుపాకులు తీసుకుని రోడ్ల మీద తిరగలేదా ?, ఓ గూండాలాగా దక్కన్ క్రానికల్ ఆఫీసు మీదకు ర్యాలీ చేసుకుని వెళ్లలేదా ? మీరు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని మేం అంటే మీకు బాధేస్తుంది. కానీ మమ్మని మాత్రం గూండాలని అంటావు, తొక్కి నారతీస్తా అంటున్నావు. దానికి టైం, ప్లేస్ ఫిక్స్ చేస్తే మేం నార తీయించుకుంటాం. అంతకు ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పు. సాయికృష్ణ బూడిద ఎక్కడ ?, ఆత్మహత్య చేసుకున్నాడా ? లాకప్ లో చంపేశారా ? నాగరాజు చంపాడా ?, కానిస్టేబుళ్లు చంపారా ? ఎస్బీ పార్టీ చంపిందా ? మార్కాపురం నుంచి తెచ్చిన కానిస్టేబుళ్లు ఎవరు ? ఎంత సేపు ప్రయాణం చేశారు ? మధ్యలో ఎక్కడైనా ఆగారా ?, భోజనం చేశారా, టీలు తాగారా ? సీపీ పరిధిలోకి సాయికృష్ణను ఎప్పుడు తెచ్చారు, విజయవాడ సీపీకి సమాచారం ఎప్పుడు ఇచ్చారు, ఈ కేసులో ఆయన పాత్ర ఏంటని అడుగుతున్నాం. వైయస్ఆర్‌సీపీలో అన్ని కులాలు, మతాల వారు ఉన్నారు. ఎస్సీలు కూడా ఉన్నారు. ఇందులో ఎవరిని తొక్కి నార తీస్తారో చెప్పాలి. మీ కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ వ్యక్తి మీద గూండాయిజం చేస్తూ వీడియోలో దొరికితే అతనిపై ఏం చర్య తీసుకున్నారు, ఇప్పటివరకూ కేసు ఫైల్ చేశారా, ఇప్పుడు సీఐ నాగరాజును ఇప్పటివరకూ ఎందుకు అరెస్టు చేయలేదు, పీఎస్ లో చనిపోయిన కుర్రాడికి ఇప్పటివరకూ న్యాయం చేయకపోగా నేరస్తుడని ముద్ర వేస్తున్నారు. నేరస్తుడు అయితే చంపేస్తారా ? ఇంకా భారత శిక్షాస్మృతి ఎందుకు, చట్టాలు ఎందుకు ? కర్నూలు జిల్లాలో ఓ దళిత మహిళను లాకప్ డెత్ చేశారు, దుర్గప్ప అనే మరో వ్యక్తి చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో ఉన్నారు. మందా సాల్మన్ అనే వ్యక్తిని పల్నాడు జిల్లాలో నడిరోడ్డు మీద నరికి చంపారు. మీ నియోజకవర్గంలో దళితుల్ని వెలేశారు. అయినా పవన్ కళ్యాణ్ వీటిలో ఏ ఒక్క దానికీ సమాధానం చెప్పరు. పవన్, చంద్రబాబువే కుల రాజకీయాలు కులాల గురించి మాట్లాడొద్దు అంటున్న పవన్ కళ్యాణ్ .. ఈ రాష్ట్రంలో కులాల ప్రస్తావన మొదలుపెట్టిన వ్యక్తి చంద్రబాబు అన్నది తెలుసుకోవాలి. జనసేన సభల్లో కాపు కులం గురించి మాట్లాడింది ఎవరు ?, సినిమారంగంలో ఉండగా కులాల గురించి మాట్లాడని పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లోకి వచ్చాక కాపుల మద్దతు కోసం కులం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఇది సెటిల్మెంట్ ల ప్రభుత్వంగా మారిపోయింది. ఎప్పుడైనా మీరు ప్రజాపక్షంగా ఉన్నారా అని చెప్పండి. అదే కృష్ణలంక పోలీసు స్టేషన్ లో పోలీసుల వేధింపులతో క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు మాట్లడలేదు? పవన్ కళ్యాణ్ ది దళిత వ్యతిరేక భావజాలం. నేనే హోంమంత్రిని అయితే అంటున్న పవన్ కు ఆ శాఖ మీద ఎందుకో అంత ప్రేమ. సినిమాల తరహాలో పోలీసుల మధ్యలో తొపాకుల మధ్యలో నిలబడాలని కోరుకుంటున్నట్లున్నారు. ఉన్న హోంమంత్రి దళిత మహిళ. ఆమె విఫలమైందని పవన్ కళ్యాణ్ పదే పదే ఎందుకు చెప్తున్నారు, అనిత కూడా చూసుకోవాలి. మీ చుట్టూ దయ్యాలు, రాక్షసులు ఉన్నారు. మీ పదవికి ఎసరు పెట్టే కార్యక్రమం జరుగుతున్నట్లుంది. దీనిపై అనిత మాట్లాడరు. పవన్ కళ్యాణ్ నేను హోంమంత్రి అయితే అని పదే పదే ఎందుకు అంటున్నారు. అంటే అనిత సరిగ్గా పనిచేయట్లేదనా ?, లేదా మీరు చెప్పినట్లు ఆడటం లేదని కోపం వస్తుందా ?, లేకపోతే దళిత హోంమంత్రిని అలా ప్రతిసారీ కించపరచరు కదా. తాను హోంమంత్రి కాకపోవడం క్రిమినల్ అదృష్టం అంటున్నారు. అంటే అనిత హయాంలో క్రిమినల్స్ ను రక్షిస్తున్నట్లు చెప్తున్నట్లేగా. మిమ్నల్ని వైయస్ఆర్‌సీపీ ప్రతీ వ్యవహారంలో లాగుతుందని అంటున్నారు, కానీ ఆయన్ను ఎవరూ లాగట్లేదు. ఆయన్ను లాగుతోంది చంద్రబాబే. మీ సినిమాలు సైతం యావరేజ్ గా ఆడుతున్నాయి, దీనికి కారణం ఆయన ఫ్యాన్ బేస్ ను ఎడమకాలితో తన్ని పారేశారు. రాజశేఖర్ రెడ్డి గారి స్నేహితులు, అభిమానులు, నిర్మాతలుగా టాలీవుడ్ లో సినిమాలు తీయకపోతే మీకు, మీ అన్నయ్య గారెకి ఈ భోగాలు ఉండేవి కాదు. కానీ మీరు గద్దెనెక్కాక రాజశేఖర్ రెడ్డి కుమారుడిని టార్గెట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడమే నా లక్ష్యం అని చెప్పిన రోజే పవన్ కళ్యాణ్ ఓ కుల నాయకుడిగా మారిపోయారు. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ తన ప్రసంగంలో కులాల గురించి మాట్లాడుతూ దిగజారిపోతున్నారు. చంద్రబాబు నీలా ఎప్పుడూ కులం కార్డులు మొహం మీద పూసుకోలేదు. నీకు ఆ తెలివి తేటలు లేవు. చంద్రబాబు ఇచ్చిన వల వేసుకుని, పిచ్చోడిలా అందరికీ దొరికిపోతున్నారు. పవన్ కు మతి చలించింది రాష్ట్ర ఉపముఖ్యమంత్రికి మతి చలించింది. ఆయన వేషానికీ, భాషకూ, ప్రవర్తనకూ ఏమాత్రం సంబంధం ఉండటం లేదు. ఆయన ఆరోగ్యం బాగుండటం లేదని ఈ మధ్యే పేపర్లలో చూశాం. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలి. కాబట్టి సాయికృష్ణ హత్య ఎవరు చేశారు, ఆయన మృతదేహం ఎక్కడుంది, చనిపోతే ఆయన డెడ్ బాడీని తల్లికి అప్పగించాలి. అలాగే దళిత సోదరుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు, ఇందుకు కారణమైన సీఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు ఒకే స్టేషన్ పరిధిలో జరిగాయి. ఈ రెండు మరణాలపై సమగ్రమైన విచారణ జరిపించాల్సిందే. మీరు మిమ్మల్ని గూండాలు, రౌడీ అన్నా, ఈ మరణాలకు మాత్రం న్యాయం జరగాల్సిందే. మీ బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు మాత్రం బెదిరేది లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేశారో, మీరు ఎందుకు చేయలేకపోతున్నారో పవన్ కళ్యాణ్ అంతరాత్మకు తెలుసు. డీఎస్సీ స్కాం నుంచి బయటపడేందుకు దీన్ని బయటపెట్టిన చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై దాడులకు వెళ్తున్న మీరా, మేమా క్రిమినల్స్ పవన్ కళ్యాణ్ చెప్పాలి. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కోసం, యాక్షన్ కోసం పారితోషికం తీసుకుని నటించే అలవాటు ఉన్న పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లోనూ అదే చేస్తున్నట్లు అనిపిస్తోంది. మీ పొగరు అణచేదాకా, ప్రజలతో మీకు బుద్ధి చెప్పించే వరకూ వైయస్ఆర్‌సీపీ చివరి కార్యకర్త కూడా పోరాడుతూనే ఉంటాడని టీజేఆర్ సుధాకర్ బాబు తేల్చిచెప్పారు.