తాడేపల్లి: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని, చట్టాన్ని రక్షించాల్సిన వారే సివిల్ దుస్తుల్లో వచ్చి కిడ్నాప్ తరహాలో అక్రమ అరెస్టులకు పాల్పడటం దారుణమని వైయస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరిని ఎటువంటి నోటీసు ఇవ్వకుండా, సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజధానిపై జగన్‌గారు ప్రతిపాదించిన ‘మావిగన్’కు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనను పక్క దారి పట్టించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ తరహా డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర లేపిందని ధ్వజమెత్తారు. అధికారం శాశ్వతం కాదని గుర్తు చేశారు. చంద్రబాబు మెప్పు కోసమే అక్రమ అరెస్టులు చేస్తున్న ప్రతి అధికారి పేరు నోట్ చేస్తున్నామని, భవిష్యత్తులో వారి సర్వీస్ రికార్డుల్లో ఈ అక్రమాలు మచ్చగా మిగిలి పోయేలా చట్టపరంగా బుద్ధి చెబుతామని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ప్రెస్‌మీట్‌లో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే..: చంద్రబాబు కుట్ర. అక్రమ అరెస్టులు: వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరి అక్రమ అరెస్టుతో మా పార్టీ శ్రేణులకు భయపెట్టాలని చూస్తే అది మీ భ్రమ. పూడి శ్రీహరి ఒక సీనియర్ జర్నలిస్టు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి. ఆయనపై నిన్న (మంగళవారం) రాత్రి నుంచే రెక్కీ నిర్వహించి, ఇవాళ (బుధవారం) ఉదయం నడిరోడ్డు మీద అడ్డగించి, బలవంతంగా తీసుకెళ్లడం అమానుషం. సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇలా అరెస్టు చేసేప్పుడు పోలీసులు యూనిఫాంలో రావాలి. అరెస్టుకు కారణం చూపిస్తూ నోటీసులు ఇవ్వాలి. కానీ, శ్రీహరి విషయంలో పోలీసులు ఒక ఉగ్రవాది తరహాలో ప్రవర్తించారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? దీనిపై డీజీపీని ప్రశ్నిస్తున్నాం. వైయస్సార్సీపీ శ్రేణులను భయబ్రాంతులకు గురి చేసి జగన్‌గారికి ఎవరూ అండగా ఉండకూడదనేది చంద్రబాబు కుట్ర. అందులో భాగంగానే ఈ అక్రమ అరెస్టులకు తెగబడుతున్నారు. వారికి గుణపాఠం తప్పదు: రాజకీయంగా ఉన్నత స్ధానంలో ఉన్న వారి మెప్పు కోసం అక్రమ మార్గంలో పయనిస్తున్న పోలీసు అధికారులను కచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం. చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు ‘రెడ్ బుక్’ అమలు చేస్తూ చట్టాన్ని అతిక్రమిస్తున్న ప్రతి అధికారి పేరును మేము రాసుకుంటున్నాం. పైస్థాయి ఒత్తిళ్లకు లొంగి అక్రమ అరెస్టులు చేసే వారు భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదు. మీ సర్వీస్ రికార్డుల్లో ఈ అక్రమాలు మచ్చగా మిగిలిపోయేలా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, రెండేళ్ల తర్వాత ప్రతి అధికారి తన చర్యలకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. తప్పుడు ఫిర్యాదులు చేసిన నాయకులు, అక్రమ అరెస్టులు చేస్తున్న వారు తప్పించుకోలేరు. ‘మావిగన్’ నుంచి డైవర్షన్ కోసమే..: రాష్ట్ర రాజధానిగా ప్లాన్–బీ కింద జగన్‌గారు సూచించిన మచిలీపట్నం–విజయవాడ–గుంటూరుతో కూడిన రాజధాని ‘మావిగన్’కు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందన చూసి చంద్రబాబు ప్రభుత్వం గంగవెర్రులెత్తుతోంది. అతి తక్కువ ఖర్చుతో అద్భుత రాజధాని సాధ్యమని శ్రీ వైయస్ జగన్ చెబితే, సమాధానం చెప్పలేక ఇలాంటి అక్రమ అరెస్టులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. గతంలో జగన్‌గారు గొడ్డలి పట్టుకున్నట్లు మార్ఫింగ్ ఫోటోలు సర్క్యులేట్ చేసిన నీచ సంస్కృతి టీడీపీది. ఇప్పుడు ఒక జర్నలిస్టుపై తప్పుడు కేసులు పెట్టి వేధించాలని చూడటం వారి పిరికితనానికి నిదర్శనం. మత్స్యకారుల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన బాబు: ఈరోజు జగన్‌గారు జువ్వలదిన్నె పర్యటనలో మత్స్యకారుల గోడు విన్నారు. గత వైయస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన ఫిషింగ్ హార్బర్లను చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు. తమిళనాడు బోట్లు అక్రమంగా మన జలాల్లోకి వస్తున్నా పోలీసులు అడ్డుకోవడం లేదు. మత్స్యకారులు పట్టుకుంటే అధికార పార్టీ నేతలు వారితో కుమ్మక్కై బోట్లను విడిచి పెట్టిస్తున్నారు. ఈ అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకే తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను స్వాగతిస్తున్నామని మీడియా ప్రశ్నకు సమాధానంగా శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. కేంద్రం ఈ ప్రక్రియను సరైన పద్ధతిలోనే చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.