రాష్ట్రంలో పెట్రో డీజిల్‌ సంక్షోభం

వ్యవసాయం, ఆక్వాకల్చర్‌పై తీవ్ర ప్రభావం

ప‌త్రికా ప్రకటనలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం, రైతు సంక్షేమం) ఎంవీఎస్‌ నాగిరెడ్డి 
 ధ్వజం

తాడేపల్లి: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ కొరత లేదని, ప్రజలు భయంతో అధికంగా కొనుగోలు చేయడం వల్ల కొన్నిచోట్ల తాత్కాలిక కొరత కనిపిస్తోందని ప్రభుత్వం చెబుతోంది. పెట్రోల్, డీజిల్‌ సరిపడా నిల్వలు ఉన్నాయని, వాటిని సరఫరాను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో వ్యవసాయం, రవాణా, చేపల పెంపకం వంటి కీలక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

క్షేత్రస్థాయిలో పూర్తి భిన్న పరిస్థితి:
    అయితే క్షేత్రస్థాయిలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో డీజిల్‌ అందుబాటు గణనీయంగా తగ్గింది. అనేక పెట్రోల్‌ బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రైతులు గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా రేషన్‌ తరహాలో పరిమితంగా అందిస్తున్న దుస్థితి. కొన్ని చోట్ల సాధారణ సరఫరా కంటే సగం మాత్రమే డీజిల్‌ అందుతోంది. 

వ్యవసాయం, ఆక్వా రంగాలపై తీవ్ర ప్రభావం:
    డీజిల్‌ లేక ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పనిచేయక పోవడంతో పంట కోతలు ఆలస్యమవుతున్నాయి. సాగు పనులు నిలిచిపోవడం వల్ల రైతులకు అదనపు ఖర్చులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వరి పంట కోతలు ప్రభావితమవుతున్నాయి. కోతలు ఆలస్యం అయితే దిగుబడి నష్టం జరుగుతుంది. రవాణాపైనా అది ప్రభావం చూపుతుంది.
    మరోవైపు రొయ్యలు, చేపల పెంపకంలో కూడా డీజిల్‌ చాలా అవసరం. రొయ్యల చెరువుల్లో ఏరియేటర్లు, నీటి పంపులు నడపడానికి డీజిల్‌ అవసరం. రొయ్యల చెరువుల వద్ద 1, 2 గంటలు ఏరియేషన్‌ ఆగితే, ఆ రొయ్యల పాండ్‌కు చాలా నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది.  ఇంకా డీజిల్‌ కొరత వల్ల జనరేటర్లు నడవక ఆక్సిజన్‌ సరఫరా తగ్గితే,  చేపలు మరియు రొయ్యల మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఈ రంగం చాలా నష్టపోతుంది.
    రాష్ట్రం నుంచి రోజూ దాదాపు 4 వేల టన్నుల చేపలు ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉత్తర భారత్‌తో పాటు, ఈశాన్య భారత్‌లోని మార్కెట్లకు వెళ్తాయి. ఈ రవాణాపై ఇప్పుడు డీజిల్‌ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంకా ఉత్తర భారతానికి ఎగుమతి అయ్యే పండ్ల రవాణా కూడా డీజిల్‌ కొరత వల్ల సమస్య ఎదుర్కొంటోంది. అందుకే రాష్ట్రంలో తక్షణమే పెట్రోల్, డీజిల్‌ సరఫరా సాధారణ స్థాయికి చేరేలా చర్యలు చేపట్టాలి.

Back to Top