డబుల్ ఇంజన్ సర్కార్‌లో డీజిల్ క‌రువు

మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం 

కృష్ణాజిల్లా: రాష్ట్రంలో కొనసాగుతున్న డీజిల్ కొరత, అప్రకటిత విద్యుత్ కోతలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. “డబుల్ ఇంజన్ సర్కార్” అని చెప్పుకునే ప్రభుత్వం కేంద్రం నుంచి రాష్ట్ర అవసరాలకు సరిపడా డీజిల్, పెట్రోల్ తెప్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షలు జరిపి డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయంటున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర క్యూల్లో నిలబడటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. ఐఏఎస్ అధికారుల ద్వారా తప్పుడు ప్రచారాలు చేయించి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

ఇక కృష్ణాజిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతలు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఒకవైపు డీజిల్ కొరత, మరోవైపు విద్యుత్ కోతల కారణంగా ఆక్వా రంగం భారీ నష్టాలను చవిచూస్తోందన్నారు. ఈ పరిస్థితి కొనసాగితే ఆక్వా రైతులు ఆర్థికంగా పూర్తిగా దెబ్బతింటారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని ఉపయోగించి కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి అవసరమైన డీజిల్, పెట్రోల్, విద్యుత్ సరఫరా తక్షణమే మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. 

Back to Top