రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ కొరత కృతిమ సృష్టి

పెట్రోల్‌ డీలర్లతో కూటమి నాయకుల కుమ్మక్కు

మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపణ

ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయనే ఊహాగానాలు

అలా వినియోగదారులను దోచుకునే కుట్రకు వ్యూహ రచన

మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపణ

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌.

నెల్లూరులో ఒక పెట్రోల్‌ బంకును సందర్శించి వివరాలు ఆరా తీసి, అక్కడే మీడియాతో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. 
 
డీజిల్‌ దొరక్క మత్స్యకారులు, ఆటో కార్మికులకు ఉపాధి కరువు 

రాష్ట్రంలో 70 శాతం పెట్రోల్‌ బంకులకు నో స్టాక్‌ బోర్డులు 

రైతులనూ ఇబ్బందికి గురి చేస్తున్న డీజిల్‌ కొరత

దేశంలో ఏపీలో తప్ప ఏ రాష్ట్రంలోనూ లేని ఇంధన కొరత  

సీఎం చంద్రబాబు వినియోగదారులు సమాధానం చెప్పాలి

మాజీ మంత్రులు వెల్లంపల్లి, కాకాణి డిమాండ్‌.

తాడేపల్లి: రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇంధన కొరత కూటమి ప్రభుత్వ కృతిమ సృష్టి మాత్రమే అని, పెట్రోల్‌ బంకుల డీలర్లతో కూటమి నాయకులు కుమ్మక్కై ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇంధన ధరలు పెంచితే వినియోగదారులను దోచుకునేందుకు కాచుకుని కూర్చున్నారని మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు రోజులుగా 70 శాతం పెట్రోల్‌ బంకులకు నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నా, ముఖ్యమంత్రి సమీక్ష చేసి సమస్యను పరిష్కరించకుండా అధికారులపై ఆగ్రహం, ఆవేశం అంటూ మీడియలో లీకులిస్తున్నాడని వారు ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఇంధన కొరత ఏపీలో మాత్రమే ఉందని గుర్తు చేశారు. తానే ఉండి ఉంటే, కరోనా వచ్చేదా? అని డాంభికాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని వెల్లంపల్లి శ్రీనివాస్, కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రశ్నించారు.
వేర్వేరు ప్రెస్‌మీట్స్‌లో వెల్లంపల్లి శ్రీనివాస్, కాకాణి గోవర్థన్‌రెడ్డి ఏం మాట్లాడారంటే..:

కూటమి ప్రభుత్వంలో క్యూలైన్లు:
    రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజలకు క్యూలైన్‌ కష్టాలు తప్పడం లేదు. రైతులు విత్తనాలు, ఎరువుల కోసం.. జనం వంట గ్యాస్‌ కోసం క్యూలైన్లలో వేచి ఉండే దుస్థితి రాగా, ఇప్పుడు వాహనదారులకు ఆ కష్టాలు మొదలయ్యాయి. వరి కోతల సమయంలో డీజిల్‌ కొరత కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లే పరిస్థితి కనిపించక జనజీవనం స్తంభించిపోతోంది. కేంద్రంలో భాగస్వామ్యం లేకపోయినా తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో ఇంధనం పుష్కలంగా దొరుకుతున్నా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అని చెప్పుకుంటూ కొరత ఎందుకొచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పాలి.

చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌ ఏమయ్యారు?:
    గడిచిన మూడు రోజులుగా రాష్ట్రంలో పెట్రోలు కోసం వినియోగదారులు కిలోమీటర్ల పొడవునా పెట్రోలు బంకుల వద్ద బారులు తీరుతున్న పరిస్థితులున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా ఉండటం లేదు. చీమ చిటుక్కుమంటే పబ్లిసిటీ కోసం మీడియా ముందుకొచ్చే చంద్రబాబు, పవన్‌ కళ్యాన్, లోకేష్‌లు ఎక్కడ చూసినా పెట్రోల్‌ బంకులు దగ్గర నోస్టాక్‌ బోర్డులు దర్శనమిస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు?  వైయస్సార్సీపీ ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసి పెట్రోల్‌ కొరతపై ప్రశ్నిస్తే మేం ఎక్కడా లోటు చేయడం లేదని సమాధానం చెప్పారు. పైగా దేశంలో ఏపీలో తప్ప ఎక్కడా పెట్రోల్‌ కొరత కనిపించడం లేదు. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వాములుగా ఉండి, డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అని చెప్పుకునే చంద్రబాబు ఇంధన కొరతకు ఏం సమాధానం చెబుతారు?  రాష్ట్రంలో 4500 పెట్రోల్‌ బంకులుంటే కనీసం 70 శాతం బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయి.
    విజయవాడ నగరంలోనే సగం బొంకులు మూసేశారు. కార్లకు రూ.1000, బైకులకు రూ.200కు మించి పెట్రోలో పోయడం లేదు. ఇంధన కొరతతో జన జీవనం స్తంభించిపోయింది. ప్రజలు ఇంట్లో కూర్చుని జయము జయము చంద్రన్న పాట పాడుకోవాలా?  ఇండిగో విమానాలు ఆగిపోతే తనకే మాత్రం సంబంధం లేకపోయినా మంత్రి నారా లోకేష్‌ సమీక్ష చేశాడని ఎల్లో మీడియా ఊదరగొట్టింది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇంధన కొరత గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు?. 

ఇంధన కొరతపై చంద్రబాబుకి ఏఐ చెప్పలేదా?:
    స్ట్రీట్‌ లైట్‌ వెలగకపోతే ఆర్టీజీఎస్‌ ద్వారా తెలుసుకుంటానని చెప్పే చంద్రబాబు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ద్వారా ఇంధన కొరత గురించి తెలుసుకోలేదా?   హుద్‌హుద్‌ తుపాన్‌ను తప్పించానని చెప్పిన చంద్రబాబు పక్కనే ఉన్న హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్‌ నుంచి పెట్రోల్, డీజిల్‌ తెప్పించలేకపోతున్నారా? వరి కోతల యంత్రాల కోసం రైతులకు డీజిల్‌ కావాలి. దాని కోసం రైతులు క్యూలైన్లలో నిల్చోవాల్సిన దుస్థితి. పంటలు సాగు చేసేటప్పుడు రైతులను యూరియా కోసం క్యూలైన్లలో నిల్చోబెట్టారు. మత్స్యకారులు డీజిల్‌ కొరతతో వేటకు వెళ్లలేని పరిస్థితి. ఆటో డ్రైవర్లదీ అదే పరిస్థితి. బుడమేరు వరదలొచ్చినప్పుడు, హుద్‌ హుద్‌ తుపాన్‌ సందర్భంగా బస్సులో పడుకుని సమస్యను పరిష్కరించానని గప్పాలు కొట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏమైపోయాడు?  కూటమి నాయకులు, అధికారులు ప్రజలను గాలికొదిలేశారు. 

కూటమి నాయకుల కుట్ర. రైతులకూ ఇక్కట్లు:
    రాష్ట్రంలో ఇంధన కొరత ఇంత తీవ్రంగా ఉంటే ఎల్లో మీడియా మాత్రం సమస్యే లేదన్నట్టు చెబుతోంది. పెట్రో డీలర్లతో కూటమి నాయకులు కుమ్మక్కై కృతిమ ఇంధన కొరతను సృష్టించారు. ఎన్నికలయ్యాక పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచుతారనే ఆశతో ఆ విధంగా జేబులు నింపుకోడమే లక్ష్యంగా కూటమి నాయకులు ఈ దిక్కుమాలిన ఆలోచన చేశారు. ప్రజలను దోచుకోవడానికి పెట్రోల్, డీజిల్‌ను బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తున్నారు.
    మరోవైపు రైతుల ఇబ్బందులు వర్ణనాతీతం. వరి కోతల యంత్రాలకు, ఇంజిన్లతో పొలాలకు నీళ్లు పెట్టుకోవడానికి డీజిల్‌ దొరకడం లేదని చెబుతున్నారు. చేతిలో క్యాన్లు పట్టుకుని ప్రతి పెట్రోల్‌ బంకులకు తిరుగుతున్నారు. పొలం పనులు చేసే ట్రాక్టర్లు కూడా నిల్చిపోయాయి. ఆక్వా సాగులో ఎవియేటర్లు నడపడానికి కూడా డీజిల్‌ కావాలి. అవి కూడా నిల్చిపోవడంతో, ఆక్వా రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కాకాణి గోవర్థన్‌రెడ్డి చెప్పారు.

Back to Top