తాడేపల్లి: ఉపాధి హామీ బకాయిలు విడుదల చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పెమ్మసాని, ఆ డబ్బును రాష్ట్రంలోని ఒక్క ఉపాధి కూలీ అకౌంట్లో అయినా జమ చేశారా? అని వైయస్ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయిల గురించి ఈనెల 21న జగన్‌గారు ట్వీట్ చేసే వరకు ఆ విషయం ఈ ప్రభుత్వానికి గుర్తు లేదని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం విజయవంతమైందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించి విజ్ఞాపన పత్రాలు అందించామని చెప్పారు. ఈ సందర్భంగా వెన్నపూస రవీంద్రారెడ్డి ఇంకా ఏమన్నారంటే..: కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ నిర్వీర్యం: వైయస్ జగన్ గారు ప్రశ్నిస్తుంటే తప్ప, వైయస్ఆర్‌సీపీ నాయకులు ఉద్యమిస్తే కానీ కూటమి ప్రభుత్వానికి ప్రజల కష్టాలు గుర్తుకు రావడం లేదు. కార్పొరేట్ల అవసరాలు తప్ప పేదల సమస్యలు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదు. జగన్‌గారు తన ఐదేళ్ల పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థను కాపాడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిట్టనిలువునా కూల్చేసింది. దీంతో శ్రమ జీవులు స్థానికంగా పనులు దొరక్క వలస బాట పడుతున్నారు. కేవలం పెట్టుబడిదారుల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు పనిచేస్తూ పేదలను గాలికొదిలేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపాధి హామీ పథకానికి చెద పట్టింది. నాడు కూలీల కడుపు నింపాం. మరి ఇప్పుడు..: వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2020– 2021లో కరోనా సమయంలో కూడా 47.52 లక్షల కుటుంబాలకు 21,85,84,000 పని దినాలు కల్పించారు. 2021–22లో 24.14 కోట్ల పని దినాలు కల్పించారు. 2023–24 లో సైతం 25.54 కోట్ల పని దినాలు కల్పించి ఆదుకోవడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదల కడుపులు కొట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల జేబులు నింపడానికి ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. 2025–26లో 42.85 లక్షల కుటుంబాలకు కేవలం 18.59 కోట్ల పనిదినాలు మాత్రమే కల్పించారు. ఈ లెక్కలన్నీ ఉపాధి హామీ పథకం వెబ్‌సైట్‌లో ఇచ్చినవే. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం ప్రకారం పని చేసిన 15 రోజుల్లోనే కూలీలకు వేతనాలు చెల్లించాలి. కానీ గత ఏడాది డిసెంబరు నుంచి వేతనాలు చెల్లించడం లేదు. చివరకు టీడీపీ కరపత్రికలో కూడా దీన్ని ప్రస్తావిస్తూ.. ఉపాధి హామీ వేతన బకాయిలు రూ.1,805 కోట్లు అని తెలిపారు. నిధులు విడుదల చేసినందుకు కేంద్రానికి మంత్రి పెమ్మసాని కృతజ్ఞతలు తెలియజేసినట్లు ప్రచారం చేస్తున్నారు. మరి ఆ నిధులు ఎవరి అకౌంట్లలో జమ చేశారో చెప్పాలని వెన్నపూస రవీంద్రారెడ్డి డిమాండ్ చేశారు.