రాష్ట్రంలో ఇంధన కరువు

అన్నదాతపై అప్పుల బరువు.

చంద్రబాబు అప్పుల్లోనూ, అవినీతి లోనూ ఆల్ టైమ్ రికార్డ్

కూటమి పాలనపై  ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. 

కాకినాడ లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు.

రాష్ట్రంలో ఇంధన కరువు 

నడక ఆరోగ్యానికి మంచిదని డీజిల్ కొరతను సమర్థించుకుంటారా?

సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి కన్నబాబు

డీజిల్, పెట్రోల్ కటకట – కుదేలైన వ్యవసాయం

రాష్ట్రంలో పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు, 

నో స్టాక్' బోర్డులు కనిపిస్తున్నా పట్టని ప్రభుత్వం

నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న మంత్రులు 

ప్రభుత్వ తీరుపై కన్నబాబు తీవ్ర ఆక్షేపణ

కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో వెనక్కి వెళ్ళిపోయిందని వైయ‌స్ఆర్‌సీపీ  సీనియర్ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. సోమవారం కాకినాడ లోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంధన కొరత కారణంగా పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనదారుల కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో లేని కొరత కేవలం ఏపీలోనే ఎందుకుందని ప్రశ్నించిన ఆయన, కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రానికి సరిపడా పెట్రోల్, డీజిల్ ఎందుకు తెప్పించలేకపోతున్నారని నిలదీశారు.

ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో రెండో పంట వరికోతలు, ఆక్వా సాగు కీలక దశలో ఉన్న తరుణంలో డీజిల్ దొరక్క రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైయస్ జగన్ హయాంలో మార్క్ ఫెడ్ ద్వారా రైతులను ఆదుకున్నామని, నేడు రూ. 3500 కోట్ల మేర మొక్కజొన్న రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం దారుణమన్నారు. రూ. 3.52 లక్షల కోట్ల అప్పు చేసిన కూటమి సర్కార్, ఆ నిధులను ప్రజా సంక్షేమానికి వాడకుండా కేవలం అస్మదీయులకు, కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేని దుస్థితి, డీఎస్సీలో అక్రమ నియామకాలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. ఇప్పటికైనా అమరావతి మోజు వీడి వ్యవసాయం, విద్య, వైద్య రంగాలను చక్కదిద్దాలని కన్నబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... 

- రైతుల ఆందోళన: 

మన రాష్ట్రంలో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తుంటే.. ఇతర రాష్ట్రాల్లో మాత్రం పుష్కలంగా డీజిల్ పెట్రోల్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కేంద్రాన్ని నడిపిస్తుంటే... వీళ్ల ఆధర్వంలో పెట్రోల్, డీజిల్ రాదు. అడిగితే సమాధానం చెప్పేవాడే లేడు. పక్కనున్న తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం, తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఉంది.. వాళ్లకి మాత్రం పెట్రోల్, డీజిల్ ఎలాంటి కొరతా రాదు. ఎన్టీయే ప్రభుత్వాన్ని నడిపిస్తున్న  తెలుగుదేశం పార్టీ పాలనలో పెట్రోలు, డీజిల్ కూడా కొరతే. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న నిర్వాకానికి వ్యవసాయ రంగం ఆకస్మాత్తుగా సంక్షోభంలో పడింది. గోదావరి జిల్లాల్లో రెండో పంట వరికోతల సమయం కావడంతో  వరికోతల మిషన్ కి డీజిల్ లేకుండా పోయింది. ఏం చేయాలో తెలియక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

రైతులు డీజీల్, పెట్రోల్ కోసం వెళ్తే ఎమ్మార్వో దగ్గర నుంచి స్లిప్పులు తెచ్చుకొమ్మంటున్నారు. ట్రాక్టర్ కి డీజిల్ లేకుండా పోయింది. గోదావరి జిల్లాల్లో ఆక్వా కల్చర్ పరిస్ధితి దారుణంగా ఉంది. ఇది సీజన్ కావడంతో పవర్ కట్స్ లేకుండా ఇవ్వలేని పరిస్ధితి. దీంతో డీజిల్ అనివార్యం అయింది.  ఏరియేటర్స్ 
నిర్వహణకు డీజిల్ కావాలి. డీజిల్ కోసం వెల్తే దొరక్క పోవడంతో ఆక్వారంగం కుదేలైంది. 
కానీ ఉదయం లేస్తే చాలు పేపర్లో ఇవన్నీ కనిపించవు. చంద్రబాబునాయుడు సీరియస్.. అధికారుల మీద మండిపడ్డ సీఎం అంటూ లీకులిస్తారు. అంటే చంద్రబాబు చాలా సానుకూలంగా ఉన్నట్టు... అధికారులదే తప్పన్నట్టు వార్తలు రాస్తున్నారు.  ఇంకోపక్క కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు డీజిల్ పెట్రోల్ కొరత లేదని ప్రకటనలిస్తున్నారు. అలా కొరత లేకపోతే... పెట్రోల్, డీజిల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఎందుకు కనిపిస్తున్నాయి?

- విఫలమైన ఎన్టీయే భాగస్వామి: 

కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని చెప్పుకునే చంద్రబాబు, రాష్ట్రానికి ఇంధనం ఎందుకు తెప్పించలేక పోతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడులో లేని కొరత ఏపీలోనే ఎందుకుంది. 

- మొక్కజొన్న రైతులకు రూ. 3500 కోట్ల నష్టం..

గడిచిన పదేళ్లలో మొక్కజొన్న రైతు ఇంత దారుణమైన స్థితిని ఎప్పుడూ చూడలేదు. ఎంఎస్పీ రూ. 2400 ఉంటే, మార్కెట్‌లో రైతులకు రూ. 1500 కూడా దక్కడం లేదు. ఒక్క కొనుగోలు కేంద్రం కూడా తెరవకపోవడం వల్ల ఈ సీజన్‌లో రైతులు రూ. 3500 కోట్లు నష్టపోయారు.

- వైయస్సార్సీపీ మార్క్ సంక్షేమం:

గతంలో వైయస్ జగన్ హయాంలో మార్క్ ఫెడ్ ద్వారా లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసి రైతును ఆదుకున్నాం. ఇప్పుడు మంత్రి విదేశాల్లో ఉంటే, అధికారులు కేంద్రానికి లేఖ రాశామని చేతులు దులుపుకుంటున్నారు. 

- ఆక్వా రంగంపై నిర్లక్ష్యం – పెరిగిన రైతు ఆత్మహత్యలు..

ఆక్వా రైతులకు పవర్ కట్స్ వల్ల ఏరియేటర్లు నడపడానికి డీజిల్ అనివార్యమైంది, కానీ అది దొరకక రంగం కుదేలైంది.  ఎగుమతిదారులు, ఫీడ్ కంపెనీలు రైతును దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 400 మందికి పైగా రైతులు, 2700 మందికి పైగా కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నా.. ఏ ఒక్కరికీ సాయం అందలేదు. 

- అమరావతి మోజులో ఏపీ నాశనం..

అమరావతి మీద ప్రేమతో ఆంధ్రప్రదేశ్‌ను నాశనం చేయవద్దు. వైయస్. జగన్ హయాంలో తీసుకొచ్చిన డేటా సెంటర్లకు ఇప్పుడు బాబు టెంకాయలు కొడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.3.52 లక్షల కోట్లు అప్పు చేసినా ఆసుపత్రుల్లో సూది, దారం లేదు. పీహెచ్‌సీల నిర్వహణకు నిధులు లేవు. పరీక్షలు రాయని వాడికి కూడా ఉద్యోగం ఇచ్చిన రికార్డు చంద్రబాబుకే దక్కుతుందని, డియస్సీలో దొంగ సర్టిఫికేట్లపై ఇంతవరకు చర్యలు లేవని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇప్పటికైనా తన పబ్లిసిటీ బిల్డప్‌లు ఆపి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులపై దృష్టి పెట్టాలని కురసాల కన్నబాబు హితవు పలికారు. పెట్రోల్, డీజిల్ కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులను 48 గంటల్లో పరిష్కరించకపోతే అన్నదాతల నుంచి తీవ్ర నిరసన తప్పదని హెచ్చరించారు. అప్పుల్లోనూ, అవినీతిలోనూ ఆల్ టైమ్ రికార్డులు సృష్టించడం కాదు.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో, ఆసుపత్రుల్లో మందులు సరఫరా చేయడంలో మీ మార్కు చూపాలని డిమాండ్ చేశారు. ఎల్లో మీడియా భజనతో కాలం గడుపుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేస్తే, రానున్న రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కురసాల కన్నబాబు హెచ్చరించారు.

Back to Top