తిరుపతి జిల్లా: రాష్ట్ర ప్రయోజనాల కోసం విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. రాయలసీమ ప్రాంతంలో సాగునీటి సమస్యలు, ప్రాజెక్టుల విషయంలో ప్రస్తుత ప్రభుత్వంపై మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం తిరుపతిలో వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఏ.రవిచంద్రా, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, వై.ప్రణయ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ..రాయలసీమలో గతంలో తీవ్ర కరువులు ఎదుర్కొన్నామని, ప్రజలు గంజి తాగుతూ జీవించిన పరిస్థితులు కూడా చూశామని గుర్తుచేశారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే గొలుసుకట్టు చెరువుల ద్వారా నీటి వనరులు అభివృద్ధి చెందాయని తెలిపారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషితో అనేక ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తూ, హంద్రీ నీవా వంటి ప్రాజెక్టులకు పలుమార్లు శంకుస్థాపనలు చేసినా పూర్తి చేయలేదని ఆరోపించారు. కృష్ణా నదిపై ఆధారపడిన హంద్రీ నీవా, వెలుగోడు వంటి ప్రాజెక్టులు రాయలసీమకు ప్రాణాధారమని పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత వైయస్ఆర్‌కు దక్కుతుందని, అలాగే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచినది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని అన్నారు. కర్ణాటకలో జరుగుతున్న అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి నీటి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమకు ద్రోహం జరుగుతోందని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అమరావతి నిర్మాణంపై కూడా ఆయన విమర్శలు చేస్తూ, ఇది ప్రజల అవసరాల కంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రాజెక్ట్‌గా మారిందన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు కూడా చేశారు. గోదావరి నుంచి నీటిని తీసుకొస్తామంటూ చేస్తున్న ప్రకటనలు వాస్తవానికి సాధ్యం కాని వాగ్దానాలేనని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల కూడా రాష్ట్రానికి నష్టం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ముందుకు వచ్చి ఇరిగేషన్ అంశంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్ధి కోసం అవసరమైన నిధులు కేటాయిస్తే ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చని, లేకపోతే ప్రాంతం మరలా వెనుకబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని, ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.