ప్రభుత్వ భవనాలను కూల్చి పార్టీ కార్యాలయం ఎలా ఏర్పాటు చేస్తారు?

క‌ర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఆగ్ర‌హం

కర్నూలు: కర్నూలులో ప్రభుత్వ స్థలంలో టిడిపి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
ఆర్ అండ్ బి ప్రభుత్వ అతిథి గృహానికి చెందిన సుమారు రూ.100 కోట్ల విలువైన 2 ఎకరాల స్థలంలో టిడిపి నాయకులు శంకుస్థాపన చేయడం దారుణమని ఆయన విమర్శించారు. ఇప్పటికే టిడిపి పార్టీ కార్యాలయం ఉన్నప్పటికీ, మరో కార్యాలయం ఏర్పాటుకు సిద్ధమవుతున్నారని ధ్వ‌జ‌మెత్తారు. అక్కడ నివసిస్తున్న వారిని తరిమికొట్టి పార్టీ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలను కూల్చి పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు.

వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం నిర్మాణ సమయంలో టిడిపి నేతలు అడ్డంకులు సృష్టించారని, 90 శాతం పూర్తయిన కార్యాలయాన్ని కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అడ్డుకున్నారని ఆక్షేపించారు. అదే విధంగా, ఆర్ అండ్ బి స్థలంలో షాపులు నిర్మించి అద్దెకు ఇవ్వాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజ‌ల ఆస్తిని పార్టీ అవసరాలకు వినియోగించడం సరికాదని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా, ఆ ప్రాంతంలో ఉన్న శతాబ్దాల నాటి వృక్షాలను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది పర్యావరణానికి హానికరమని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం విధ్వంసకర విధానాలతో ముందుకు సాగుతోందని ఆయన విమర్శించారు.
 

Back to Top