తూర్పుగోదావరి: పొగాకు రైతులను ఆదుకోవాలంటూ వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ‘చలో దేవరపల్లి’ పేరిట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తానేటి వనిత, నాయకులు వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ హయాంలో ఏ పంటకూ సరైన మద్దతు ధర దక్కడం లేదని విమర్శించారు. గతంలో రూ.450గా ఉన్న ధర ఇప్పుడు రూ.265కు పడిపోవడం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని అన్నారు. గోపాలపురం నియోజకవర్గంలో వేలాది మంది రైతులు పొగాకు సాగు చేస్తున్నారని, వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ, గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఒక కిలో పొగాకు సాగు చేయడానికి రూ.300 వరకు ఖర్చవుతుండగా, ధర మాత్రం రూ.265 మాత్రమే పలకడం రైతులను నష్టాల్లోకి నెట్టేస్తోందని అన్నారు. రైతులను ఆదుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వైయస్ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జున్నూరి బాబి మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క పంటకూ మద్దతు ధర స్థిరంగా లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో విత్తనం నుంచి మార్కెటింగ్ వరకు ప్రభుత్వం పూర్తి మద్దతు అందించేదని, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని వైయస్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.