తీవ్ర సంక్షోభంలో పొగాకు రైతులు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి  ఎంవీఎస్ నాగిరెడ్డి ఆందోళ‌న 

తాడేప‌ల్లి: రాష్ట్రంలో పొగాకు రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి  ఎంవీఎస్ నాగిరెడ్డి ఆందోళ‌నవ్యక్తం చేశారు. వేలంలో పెద్ద ఎత్తున బేళ్లు ‘నో బిడ్’ కింద తిరస్కరణకు గురవుతుండటం రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని అన్నారు. బుధ‌వారం ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల ప్రకారం 30 నుంచి 52 శాతం వరకు బేళ్లు కొనుగోలు దారులు బిడ్ చేయకుండా తిరస్కరిస్తున్నారని తెలిపారు. గరిష్ట ధర కిలోకు రూ.250 మాత్రమే ఉండగా, కనిష్ఠ ధర రూ.200 వరకు పడిపోతోందని చెప్పారు. సరాసరి ధర రూ.224గా నమోదవుతున్నప్పటికీ, పెరిగిన ఉత్పత్తి వ్యయంతో పోలిస్తే ఈ ధరలు రైతులకు గిట్టుబాటు కావడం లేదని పేర్కొన్నారు.

విత్తనాలు, ఎరువులు, కార్మిక వ్యయాలు భారీగా పెరిగిన నేపథ్యంలో రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కొనసాగితే రైతులు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పొగాకు ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, రైతులకు మద్దతు ధర కల్పించాలని యం.వి.ఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. మార్కెట్‌లో కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుని రైతుల ఆర్థిక స్థితిని కాపాడాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Back to Top