నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్, ఇసుక, మట్టి తవ్వకాలను అరికట్టి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కాకాణ గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయా గ్రామాల ప్రజలతో కలిసి నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి ప్రాంతంలో ఉన్న జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ డైరెక్టర్ (డీడీ మైన్స్)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. కందలపాడులో తవ్వి తరలిస్తున్న గ్రావెల్ క్వారీకి సంబంధించిన అనుమతుల గడువు 2026 ఏప్రిల్ 30తో ముగిసిపోయిందని మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ తన ముందే అంగీకరించారని తెలిపారు. గడువు ముగిసినా అక్రమంగా మైనింగ్ కొనసాగుతుండటం దారుణమన్నారు. మైనింగ్ అనుమతులు లేకుండా ఏఎంఆర్ సంస్థ అక్రమంగా రాయల్టీ వసూళ్లకు పాల్పడుతోందని మండిపడ్డారు. “ఏఎంఆర్ సంస్థకు అక్రమంగా రాయల్టీ వసూలు చేసే హక్కు ఎక్కడిది? ఎవరు అధికారం ఇచ్చారు?” అంటూ అధికారులను నిలదీశారు. దీనిపై మైనింగ్ శాఖ అధికారులు కూడా అనుమతి లేని ప్రాంతాల్లో రాయల్టీ వసూలు చేసే అధికారం ఏఎంఆర్ సంస్థకు లేదని స్పష్టం చేశారని చెప్పారు. అక్రమ మైనింగ్‌ను అడ్డుకునే గ్రామస్తులను భయపెట్టేందుకు ఏఎంఆర్ ప్రతినిధులు పోలీసుల్లా వ్యవహరిస్తున్నారని, వారి వాహనాలకు “పోలీస్” స్టిక్కర్లు అతికించి రోడ్లపై తిరుగుతున్నారని ఆరోపించారు. సామాన్యులను బెదిరిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోందని, కందలపాడులో తరతరాలుగా సాగు చేసుకుంటున్న పేద రైతుల భూములను గ్రావెల్ మాఫియా కొల్లగొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల జీవనాధారాన్ని దెబ్బతీస్తూ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారని విమర్శించారు. ఈ అక్రమ మైనింగ్‌లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి 40 శాతం వాటా ఉందా? లేదో సమాధానం చెప్పాలని కాకాణి సవాల్ విసిరారు. నెలకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. తాను అక్రమాలకు పాల్పడలేదని దేవుని ముందు ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సోమిరెడ్డిని ప్రశ్నించారు. జిల్లాలో అనంతసాగరం, బుచ్చి, సంగం, తెలుగురాయపురం, రాజుపాలెం, విరువూరు, సూరాయపాలెం వంటి ఇసుక రీచ్‌ల వద్ద భారీ అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విరువూరు ఇసుక రీచ్‌లో ఫోన్‌పే క్యూ ఆర్ కోడ్‌ల ద్వారా అక్రమ వసూళ్లు చేస్తున్నారని, వాటికి సంబంధించిన ఆధారాలను మీడియా ముందు ఉంచామని తెలిపారు. అక్రమ మైనింగ్ వల్ల తాటి చెట్టు లోతు గుంతల్లో పడి మనుషులు, జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సూరాయపాలెం ఇసుక రీచ్‌లో జరిగిన మరణాలను కూడా పోలీసులు సాధారణ ప్రమాదాలుగా చూపించి కేసులు నమోదు చేశారని ఆరోపించారు. “సహజ సంపదను పట్టపగలే దోచుకుపోతుంటే అధికారులు కళ్లు మూసుకుని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే పేదల భూములు కూడా కొల్లగొట్టబడుతున్నాయి” అని కాకాణి మండిపడ్డారు. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన పూర్తి ఆధారాలను గూగుల్ మ్యాప్స్ సహా సేకరిస్తున్నామని, రాబోయే రోజుల్లో లోకాయుక్త, National Green Tribunal, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ మైనింగ్‌పై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. కందలపాడులో పేద రైతుల భూములను లాక్కునే ప్రయత్నాలను సహించబోమని, పేదలకు ఎప్పుడూ అండగా ఉంటామని కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.