శ్రీవాణి కాదు అది 'చంద్రవాణి'.

కలియుగ వైకుంఠంలో రూ. 400 కోట్ల దేవుడి సొమ్ము లూటీ: 

కూటమి సర్కారుపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం.

తిరుపతి లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ 
భూమన కరుణాకరరెడ్డి.

శ్రీవాణి టికెట్లను 'చంద్రవాణి'గా మార్చిన కూటమి ప్రభుత్వం.

ఆన్‌లైన్ మాయాజాలంతో ఒక్క నిమిషంలో 800 టికెట్లు మాయం

ఆటో ఫిల్లింగ్ దందాతో రూ. 48 కోట్ల భక్తుల సొమ్ము లూటీ.

బీటెక్ లేని తాబేదారుకు టీటీడీ ఐటీ విభాగం బాధ్యతలు.

టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపణ.

వీఐపీ బ్రేక్, ప్రత్యేక దర్శనాలతో రూ. 400 కోట్ల దేవుడి సొమ్ము దోపిడీ.

వైయస్. జగన్ హయాంలో కట్టిన 4,500 గుడుల నిర్మాణాన్ని నిలిపివేసిన బాబు.

శ్రీవాణి టికెట్ల స్కామ్‌పై సీబీఐ విచారణకు సిద్దమా?  

సూటిగా ప్రభుత్వాన్ని నిలదీసిన  భూమన కరుణాకరరెడ్డి.

తిరుపతి: కలియుగ వైకుంఠమైన తిరుమలను కూటమి ప్రభుత్వం దళారులు, తమ తాబేదార్లకు వందల కోట్ల దందా కేంద్రంగా మార్చేసిందని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.శనివారం తిరుపతిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన టీటీడీ ఆన్‌లైన్ ఐటీ వ్యవస్థ లోపాలను, విఐపీ బ్రేక్ దర్శనాల వెనుక జరుగుతున్న వందల కోట్ల బ్లాక్ మార్కెట్ దందాను ఆధారాలతో సహా ఎండగట్టారు. వైయస్ జగన్ హయాంలో హైందవ ధర్మ రక్షణ కోసం తెచ్చిన 'శ్రీవాణి ట్రస్ట్' ఆన్‌లైన్ టికెట్లను కేవలం ఒక్క నిమిషంలోనే మాయం చేస్తూ కూటమి నేతలు రూ. 48 కోట్ల పచ్చిదోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. తిరుమలలో ఉచిత దర్శనం దగ్గర నుండి వీఐపీ బ్రేక్ టికెట్ల వరకు బ్లాక్ మార్కెట్‌గా మార్చి, ఇప్పటివరకు రూ. 400 కోట్లకు పైగా స్వామివారి సొమ్మును లూటీ చేశారని.. దీనిపై డీఆర్ డీ ఓ, సెర్ట్ -ఇన్  సంస్థల పర్యవేక్షణలో సీబీఐ ఆధ్వర్యంలో  విచారణ జరిపించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని భూమన సవాల్ విసిరారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..

- శ్రీవాణి టికెట్ల దందా – కేవలం ఒక్క నిమిషంలో 800 టికెట్లు మాయం:

జనవరి 9, 2026 నుంచి రోజువారీ కోటా కింద ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న 800 శ్రీవాణి టికెట్ల కేటాయింపులో భారీ ఐటీ కుంభకోణం సాగుతోంది. ఉదయం సరిగ్గా 9:00 గంటలకు విడుదలయ్యే ఈ 800 టికెట్లు 9:01 నిమిషాలకల్లా 'పూర్తయ్యాయి' అని వెబ్‌సైట్‌లో చూపిస్తోంది. ఈ దోపిడీని నిరూపించడానికి టీటీడీ మాజీ చైర్మన్‌గా నేనే స్వయంగా ఉదయం 8:57 గంటలకు లాగిన్ అయ్యాను. నా వివరాలన్నీ ఇచ్చి 9:00 గంటలకు పేమెంట్ గేట్‌వే క్లిక్ చేయగా 'పేమెంట్ ఎర్రర్' అని వచ్చింది. 9:01 గంటలకు చూస్తే మొత్తం 800 టికెట్లు అయిపోయినట్లు చూపించింది. సామాన్య భక్తులకు దక్కకుండా 'ఆటో ఫిల్లింగ్' టెక్నిక్ ఉపయోగించి దళారులు, ప్రైవేట్ ట్రావెల్ ఏజెంట్లు టీటీడీ పెద్దల ఆశీస్సులతో ఈ టికెట్లను కొల్లగొడుతున్నారు. ఒక్కో టికెట్‌పై రూ. 5 వేలు అదనంగా వసూలు చేస్తూ ఇప్పటివరకు రూ. 48 కోట్లు లూటీ చేశారు. శ్రీవాణి ఆదాయంలో సగం దళారుల పాలువుతోంది కాబట్టి ఈ పథకానికి 'చంద్రవాణి' అని పేరు మార్చుకుంటే బాగుంటుంది.

- ఐటీ విభాగానికి బీటెక్ లేని ఇన్ఛార్జ్ – అవినీతి పరుడికి పెద్దపీట:

టెక్నాలజీ, గూగుల్ డేటా సెంటర్లను తానే తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు.. తిరుమల ఐటీ విభాగానికి కనీసం ఒక నిష్ణాతుడైన జనరల్ మేనేజర్‌ను కూడా నియమించలేకపోయారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్‌గా ఉన్న వేంకటేశ్వరనాయుడు అనే ఏఈఓకి కనీసం బీటెక్ అర్హత కూడా లేదు. ఈయన టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుకి తాబేదారుగా వ్యవహరిస్తూ దోపిడీకి సహకరిస్తున్నారు. గత ప్రభుత్వంలో విదేశాల్లో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించినప్పుడు అవినీతికి పాల్పడి, డబ్బులు కూడా రికవరీ చేయించుకున్న అపకీర్తి ఈ ఇన్ఛార్జ్ సొంతం. ఈ రకమైన లాలూచీ వల్లే సెక్యూరిటీ ఆడిట్ లేని పాత సాఫ్ట్‌వేర్‌ను కొనసాగిస్తూ దొంగ దోపిడీకి తలుపులు తెరిచారు. 

- విఐపీ బ్రేక్, రూ.300 టికెట్ల బ్లాక్ మార్కెట్ – రూ. 400 కోట్ల కుంభకోణం:

శ్రీవాణిలోనే కాకుండా తిరుమలలో అన్ని రకాల దర్శనాల్లోనూ మాఫియా రాజ్యమేలుతోంది.
రోజుకు ఇస్తున్న 5 వేల నుండి 7 వేల విఐపీ బ్రేక్ టికెట్లలో.. దాదాపు 2 వేల నుండి 3 వేల టికెట్లను రూ. 3 వేల నుండి రూ. 5 వేల వరకు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. ఈ దందాలో కూటమికి అనుకూలమైన 'టీవీ5' వ్యక్తులు, తిరుపతిలోని ఆకు రౌడీలు, గూండాలు అగ్రభాగాన ఉన్నారు. అర్హత లేని వారికి సైతం రోజుకు 20-30 విఐపీ టికెట్లు ఇస్తున్నారు. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బయట రూ. 3 వేలకు బ్లాక్‌లో అమ్ముతున్నారు. చివరికి ఉచిత దర్శనం టోకెన్లను కూడా అమ్ముకునేలా విజిలెన్స్ విభాగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. 
మొత్తంగా శ్రీవాణి, విఐపీ బ్రేక్, రూ. 300 టికెట్ల దందాతో కలిపి స్వామివారిని అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 400 కోట్లకు పైగా దేవుడి సొమ్మును తమ అనుయాయులకు కట్టబెట్టింది.

- చంద్రబాబు హయాంలో గుడుల నిలిపివేత:

వైయస్ జగన్ గారి హయాంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఐదేళ్లలో 4,500కు పైగా ఆలయాల నిర్మాణాన్ని భగీరథ ప్రయత్నంతో చేపట్టాం. చాలా వరకు పూర్తి కాగా, మిగిలినవి పూర్తయ్యే దశలో ఉండగా.. సెప్టెంబరు 2024లో చంద్రబాబు ఒకే ఒక్క ఆర్డర్‌తో ఆ హిందూ దేవాలయాల నిర్మాణాలను నిలిపివేశారు. గతంలో శ్రీవాణి ఒక దోపిడీ పథకం అని అభాండాలు వేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు.. అధికారంలోకి వచ్చాక ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు. తాము వస్తే 10 వేల గుడులు కడతామని చెప్పి, ఉన్న గుడులను ఆపేయడమే కాకుండా.. గతంలో ఉన్న వెయ్యి శ్రీవాణి టికెట్లను రెండు వేలకు పెంచి దందాకు లైసెన్స్ ఇచ్చారు.

- ఆపచారాల నిలయంగా తిరుమల – అనుకూల మీడియా మౌనం:

కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలలో అపచారాలు ఎక్కువయ్యాయి. గోవిందరాజస్వామి ఆలయంలో ఒక వ్యక్తి గంజాయి తాగి హల్‌చల్ చేస్తున్నా టీటీడీ పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. లడ్డూలు, పరకామణి వ్యవహారాల్లో మమ్మల్ని జైల్లో పెడతామని గప్పాలు కొట్టిన కూటమి నేతలు.. ఇప్పుడు గప్‌చుప్‌గా ఎందుకు ఉన్నారు? ఇంత పెద్ద కుంభకోణం బయటపడినా 'ఈనాడు', 'ఆంధ్రజ్యోతి', 'టీవీ5', 'మహా టీవీ'లు ఎందుకు వార్తలు రాయడం లేదు? మాపై తప్పుడు కేసులు పెట్టి నోళ్లు మూయించాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదు. ప్రైవేట్ ట్రావెల్ ఏజెంట్ల సిండికేట్‌ను రద్దు చేసి, 'ఆటో ఫిల్లింగ్' దోపిడీ విధానాన్ని తక్షణమే నిలిపివేయాలి. మరోవైపు విఐపీ బ్రేక్ దర్శనాల బ్లాక్ దందాపై టీటీడీ బోర్డు తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.  టీటీడీలో జరగుుతున్న అక్రమాలపై  తాను టీటీడీ ఈవో తో ప్రత్యక్ష చర్చకు సిద్ధంగా ఉన్నానని బదులిచ్చారు. 
కలియుగ దైవమైన వేంకటేశ్వరస్వామికే పంగనామాలు పెడుతూ భక్తులను ముంచుతున్న ఈ దోపిడీపై హిందూ సమాజం, హైందవ పెద్దలు వెంటనే స్పందించి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని భూమన పిలుపునిచ్చారు.

Back to Top