తాడేపల్లి : ప్రముఖ దర్శకుడు, నటుడు, తమిళ సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ సినీ వ్యక్తిత్వం భారతీరాజా గారి మరణవార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ తెలిపారు. భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ జీవన విధానాన్ని, మానవ సంబంధాలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు పొందిన భారతీరాజా గారు దర్శకుడిగా, నటుడిగా అనేక తరాల సినీ అభిమానులను ప్రభావితం చేశారని ఆయన పేర్కొన్నారు. తమిళ సినీ రంగంలో కొత్త ఒరవడికి నాంది పలికి, తన ప్రత్యేక కథన శైలితో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తనదైన ముద్ర వేసిన భారతీరాజా గారు పలు చిత్రాల్లో విశిష్ట పాత్రలు పోషించి ప్రేక్షకుల ఆదరణ పొందారని వైయస్ జగన్ గుర్తు చేశారు. సినీ కళారంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. భారతీరాజా గారి మరణం దక్షిణ భారత సినీ పరిశ్రమకు, కళారంగానికి తీరని లోటని వైయస్ జగన్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ పరిశ్రమకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పరమపదించిన భారతీరాజా గారి ఆత్మకు శాంతి చేకూరాలని వైయస్ జగన్ ప్రార్థించారు.