నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించనున్న వైయస్ జగన్

 తాడేపల్లి : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ బుధవారం విశాఖపట్నం పర్యటన చేపట్టనున్నారు.

ఉదయం 10.30 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరనున్న ఆయన విశాఖపట్నం చేరుకున్న అనంతరం ముందుగా మధ్యాహ్నం 12 గంటలకు సెవెన్‌హిల్స్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కిమ్స్ ఆసుపత్రికి చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్న గాయపడిన కార్మికులను, బాధితులను పరామర్శిస్తారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని వైద్యులను కోరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన బాధితులకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
 

Back to Top