విశాఖపట్నం: వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మికుల పరిస్థితిపై అందరూ ఆలోచించాల్సిన తరుణం వచ్చిందని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇక్కడి కార్మికులకు తొలి నుంచి అండగా నిలిచింది వైయస్ఆర్‌సీపీనేనని.. ఇప్పుడు కూటమి పాలనలో వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అన్నారాయన. బుధవారం సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాకరం. ప్రమాదంలో 9 మంది చనిపోయారు. గాయపడ్డ ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 95 శాతం కాలిన గాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు అని ఆయన అన్నారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది?.. కూటమి హయాంలో ఎలా ఉందో గమనించాలి. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వైయస్ఆర్‌సీపీ అడ్డుకుంది. ఈ విషయంలో గట్టిగా పోరాటం చేశాం. ప్రైవేటీకరణ వద్దని ప్రధాని మోదీకి రెండు లేఖలు రాశాం.(2021 ఫిబ్రవరి 6, మార్చి 9న రాసిన నాటి లేఖలను ఆయన చదివి వినిపించారు). ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం అని గుర్తు చేశారాయన. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 28 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కానీ, ఈ రెండేళ్లలో 10,500 మందిని తొలగించారు. 6,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. వీఆర్‌ఎస్ పేరుతో 1,800 మందిపై ఒత్తిడి చేశారు. మొత్తంగా.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సంఖ్యను 16 వేలకు కుదించారు. కూటమి హయాంలో.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. నాలుగు నెలల జీతాలు బకాయిలు పెట్టారు. ఉద్యోగుల జీతాలకు ప్రొడక్షన్‌కు లింకు పెట్టారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో ఉద్యోగుల క్వార్టర్స్‌లో యూనిట్ విద్యుత్‌కు 50 పైసలే చార్జ్ చేసేవాళ్లం. కూటమి వచ్చాక యూనిట్‌కు రూ.8.50పైసలకు పెంచారు. ఉద్యోగుల్ని క్వార్టర్స్‌ను వదిలిపోయేలా చేశారు. బోనస్, మెడికల్ ఫెసిలిటీస్ ఏం లేవు. ప్యాకేజీ ఇచ్చామని కూటమి పెద్దలు చెబుతున్నారు. అది మెయింటెనెన్స్ కోసం కాదు.. బలవంతంగా బయటకు పంపేందుకు ఇచ్చిన ప్యాకేజీ. ఉద్యోగుల బాగోగుల కోసం ఏ ప్యాకేజీ ఇవ్వలేదు అని వైఎస్ జగన్ అన్నారు. ఇంత దారుణమా? స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి ఉద్యోగులు కారణం కాదు. లిక్విడ్ మెటల్ బ్లాస్ట్ అవ్వడంతోనే జరిగింది. కానీ, కేంద్ర, రాష్ట్రాలు స్పందిస్తున్న తీరు దారుణం. 14 నెలల కిందట ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. పెంటయ్య అనే కార్మికుడు మరణించాడు. నెలలోపే ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పటి వరకు పరిహారం కూడా ఇవ్వలేదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని జగన్ గుర్తు చేశారు. అధికారుల్ని అడిగితే ఫైల్ పోయిందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తోంది. లోకేశ్ అసలు మనిషేనా? ఇంత ప్రమాదం జరిగితే.. ఇలాంటి సమయంలో మానవత్వం చూపించాలి. చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి లోకేశ్ దారుణంగా మాట్లాడారు. నిన్న ఆయన మాటలు చూస్తే ఆశ్చర్యం వేసింది. లోకేశ్ లాంటి మనుషులు కూడా ఉంటారా? అనిపించింది. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం పరిహారం ఇస్తారో చెప్పమంటే కూడా స్పందించలేదు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. - అదనంగా మరో కోటి రూపాయలు ఇవ్వాలి ఈ రోజు ఈ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు ఎంత అన్యాయంగా ఉందో మీ మనసాక్షినే అడగండి. కార్మికులకు రావాల్సినది ఇస్తున్నారు. ఇందులో చంద్రబాబు గొప్పతనం ఏమాత్రం లేదు. కంపెనీ నుంచి కేవలం రూ.25 లక్షలు మాత్రమే వస్తున్నాయి. కానీ మా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి విషాద ఘటనలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోటి రూపాయల పరిహారం ఇచ్చి బాధిత కుటుంబాలకు అండగా నిలిచాం. మేం ఏదైతే చేసి చూపించామో, ఈ రోజు అదే చేయాలని మాత్రమే అడుగుతున్నాం. ఇందులో ఎలాంటి అన్యాయం లేదు. కంపెనీ నుంచి, ఇతర మార్గాల ద్వారా వచ్చే పరిహారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనంగా మరో కోటి రూపాయలు ఇవ్వాలి. అలాగే బాధిత కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలి. భాగ్యశ్రీ కుటుంబానికి కూడా ఇదే తరహాలో న్యాయం చేయాలి. ఆ కుటుంబానికి తగిన పరిహారం అందించడంతో పాటు ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు కూడా అసెంబ్లీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా మానవత్వం లేకుండా అన్యాయం జరిగితే, ప్రతి బాధిత కుటుంబానికి నేను ఒక మాట చెబుతున్నాను. బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడి దయతో మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోటి రూపాయల పరిహారం అందించి ఆ కుటుంబాలకు అండగా నిలుస్తాం. అయితే ఈ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో వ్యవహరించి, బాధిత కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని, మానవత్వం చూపించాలని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి డిమాండ్ చేశారు.