తాడేపల్లి: రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అడుగడుగునా భారీ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రశ్నాపత్రాల లీకేజీ అనుమానాలు, నార్మలైజేషన్ పేరిట మార్కుల అక్రమ కలయిక, హారిజాంటల్ రిజర్వేషన్ల అమలులో జరిగిన తీవ్ర లోపాల వల్ల దాదాపు 3.50 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఘోరంగా నష్టపోయారని ఆయన మండిపడ్డారు. బాధ్యతగల ప్రతిపక్షంగా ఈ నియామకాల్లోని లొసుగులను ప్రజాక్షేత్రంలో ఉంచుతున్నామని, తక్షణమే ఈ మహా కుంభకోణంపై సీబీఐ (CBI) ద్వారా సమగ్ర విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రుల దాటవేత – కేవలం అధికారులతోనే ప్రెస్ మీట్లు. డీఎస్సీ బాధితుల తరపున, నిరుద్యోగుల పక్షాన వైయస్ఆర్‌సీపీ గత కొద్దిరోజులుగా రాజీలేని పోరాటం చేస్తోంది. అయితే, అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత గల మంత్రులు, ప్రభుత్వం కనీసం నోరు మెదపడం లేదు. ప్రజాప్రతినిధులు దాక్కుని, కేవలం అధికారులను ముందుకు నెట్టి పాత్రికేయ సమావేశాలు పెట్టించడం కూటమి ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారింది. గడిచిన రెండేళ్లలో ఇటువంటి ధోరణి ఎప్పుడూ చూడలేదు. అధికారుల మాటల్లో కనీస స్పష్టత లేదు. అక్రమాలపై ప్రశ్నిస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ "కోర్టులో ఉంది, చెప్పలేం" అంటూ దాటవేస్తున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ అనుమానాలు – ఎస్సీఈఆర్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఘనత. ఎస్సీఈఆర్టీ (SCERT) లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి సోషల్ స్టడీస్ లో రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు, టీజీటీ తెలుగులో 6వ ర్యాంకు వచ్చాయి. ఈ విషయం వెలుగులోకి రాగానే ప్రభుత్వం అతడిని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టింది. ప్రశ్నాపత్రాల తయారీ విభాగంలో సదరు వ్యక్తి ఉండడం, అతని ద్వారానే పేపర్ లీక్ అయి అనేకమందికి చేరిందన్నది స్పష్టమవుతోంది. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు. నార్మలైజేషన్ పేరిట అభ్యర్థుల పొట్టకొట్టారు. జాతీయ స్థాయి పరీక్షల్లోనే తీవ్ర ఇబ్బందికరంగా మారి పక్కన పెడుతున్న 'నార్మలైజేషన్' ప్రక్రియను జిల్లా స్థాయి పోస్టులైన డీఎస్సీ పరీక్షల్లోకి రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా తీసుకువచ్చింది. అభ్యర్థులకు నచ్చిన సెషన్లలో ఏకంగా 7 నుంచి 8 మార్కులు కలపడం వల్ల కష్టపడి చదివిన ఎంతోమంది అర్హులు నష్టపోయారు. డీఎస్సీలో కేవలం 0.1 మార్కు తేడాతో ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉంటుంది, అలాంటిది ఇంత భారీగా మార్కులు కలపడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. అలాగే సీబీఎస్ఈ, నవోదయ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివి టెట్ రాసిన అభ్యర్ధులను నిబంధనల సాకుతో డీఎస్సీకి దూరం పెట్టారు. వర్టికల్ రిజర్వేషన్ విధానాన్ని (OC, BC, SC, STల మధ్య) సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల మెరిట్ అభ్యర్థులు రోడ్డున పడ్డారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో సాక్ష్యాధారాలతో సహా దొరికిన అక్రమాలు (కేస్ స్టడీస్): స్పోర్ట్స్ కోటా నియామకాల్లో హయ్యెస్ట్ అచీవ్ మెంట్ సర్టిఫికేట్ తో పాటు, దాన్ని ధృవీకరిస్తూ వెరిఫికేషన్ కోసం బ్యాకప్ సర్టిఫికేట్ (Back-up Certificate) కచ్చితంగా పెట్టాలి. జూనియర్, సబ్ జూనియర్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) సర్టిఫికేట్లను పరిగణనలోకి తీసుకోకూడదని నోటిఫికేషన్ లోనే ఉంది. కానీ అప్లికేషన్ నెంబర్ల వారీగా చూస్తే అనేక దారుణాలు జరిగాయి. ఇవీ డియస్సీలో అక్రమాలు.. (సాక్ష్యాలతో సహా వివరించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి) ఐడీ నెంబర్ 20485: ఒకే గేమ్ కు సంబంధించి రెండు సర్టిఫికేట్లు (స్టేట్ లెవెల్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్ మరియు పార్టిసిపేషన్) పెట్టారు. నిబంధనల ప్రకారం ఒకే గేమ్ లో రెండు సర్టిఫికేట్లు ఇవ్వడం, దాన్ని అధికారులు అంగీకరించడం తప్పు. ఐడీ నెంబర్ 0002615 (బయోలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ - సీరియల్ నెం 137): ఈ అభ్యర్థి హయ్యెస్ట్ అచీవ్ మెంట్ సర్టిఫికేట్ వాలీబాల్ లో పెడితే, బ్యాకప్ సర్టిఫికేట్ కబడ్డీలో పెట్టారు! డిగ్రీ ఎంపీసీ చదివి, ఇంటర్ బైపీసీ సర్టిఫికేట్ పెడితే ఆ డిగ్రీ ఎంత ఫేకో... ఈ అభ్యర్థి ఉద్యోగం అంత ఫేక్. ఒక ఈవెంట్ కు మరో ఈవెంట్ కు సంబంధం లేకపోయినా ఉద్యోగం ఇచ్చారు. ఐడీ నెంబర్ 13069 (పెద్ద అప్పలరాజు): ఇది అత్యంత విచిత్రమైన కేసు. హయ్యెస్ట్ అచీవ్ మెంట్ సర్టిఫికేట్ 'పెద్ద అప్పలరాజు' పేరు మీద ఉంటే, బ్యాకప్ సర్టిఫికేట్ 'పెద్ద వెంకటేశ్వరరావు' పేరు మీద ఉంది. జూన్ 4వ తేదీన వైయస్ జగన్ గారు అభ్యర్థులతో మాట్లాడిన తర్వాత అధికారులు విడుదల చేసిన డేటాలో కూడా ఈ వేర్వేరు పేర్ల జాబితానే ఉంది. కనీసం పేర్లు కూడా వెరిఫై చేయకుండా ఉద్యోగాలు ఇచ్చారంటే అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఐడీ నెంబర్ 3660 (స్కూల్ అసిస్టెంట్ హిందీ): ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పార్టిసిపేషన్ కు బ్యాకప్ గా 'ఇంట్రా మ్యూరల్' (సొంత కాలేజీలో సెక్షన్ల మధ్య ఆడే ఆట) సర్టిఫికేట్ పెడితే ఉద్యోగం ఇచ్చేశారు. ఐడీ నెంబర్ 02836 (కబడ్డీ): బ్యాకప్ కింద స్పోర్ట్స్ సర్టిఫికేట్ కాకుండా 1997-98 నాటి ఒక సాధారణ లేఖను టాంపరింగ్ చేసి 2005-06గా మార్చి పెట్టారు. ఫామ్-3 సర్టిఫికేట్ లో యూనివర్సిటీ పీడీ సంతకాలు చాలా తేడాగా ఉన్నాయి. కనీసం 'Participation' అని, 'Director of Physical Education' అని రాయడం కూడా రాని అభ్యర్థికి టీచర్ ఉద్యోగం ఇచ్చారు. ఐడీ నెంబర్ 18673 (హ్యాండ్ బాల్ - SGT పోస్టు): 2012 నాటి సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ హయ్యెస్ట్ సర్టిఫికేట్ కు బ్యాకప్ గా 2013 నాటి సర్టిఫికేట్ పెట్టారు. సాధించిన మెరిట్ కంటే ముందు బ్యాకప్ సర్టిఫికేట్ ఉండాలి కానీ, తర్వాత వచ్చిన దాన్ని బ్యాకప్ గా పెట్టడం నిబంధనలకు విరుద్ధం. అర్హుల తిరస్కరణ – అనర్హులకు రెడ్ కార్పెట్.. తమ్మిన శంకర గోపాల్ (సంతోష్ ట్రోఫీ ఫుట్ బాల్ ప్లేయర్): జాతీయ స్థాయిలో ఎన్నో మెరిట్ సర్టిఫికేట్లు ఉన్న అభ్యర్థి. 2014 రాష్ట్ర విభజన సమయంలో రికార్డుల నిర్వహణ సరిగ్గా లేనందున బ్యాకప్ సర్టిఫికేట్ లేదని ఆంధ్రప్రదేశ్ ఫుట్ బాల్ అసోసియేషన్ లేఖ ఇచ్చినా అధికారులు ఇతని ఉద్యోగాన్ని తిరస్కరించారు. అలాంటిది ఐడీ నెంబర్ 13238 తో ఉన్న అభ్యర్థికి కనీసం బ్యాకప్ సర్టిఫికేట్ లేకపోయినా శాప్ (SAAP) ఒక కన్ఫర్మేషన్ లేఖ ఇవ్వగానే అధికారులు ఉద్యోగం కట్టబెట్టారు. శంకర్ గోపాల్ కు ఒక న్యాయం, ఈ అభ్యర్థికి ఒక న్యాయమా? ఐడీ నెంబర్ 3951 (స్కూల్ అసిస్టెంట్ పీఈటీ): ట్రయాథ్లాన్ గేమ్ లో బ్యాకప్ సర్టిఫికేట్ లేదు. కేవలం అసోసియేషన్ ఇచ్చిన ఒక లేఖ ఆధారంగా నిబంధనలు అతిక్రమించి ఉద్యోగం ఇచ్చారు. ఐడీ నెంబర్ 9901 & 3998: 2002 నాటి జాతీయ క్రీడల సర్టిఫికేట్ పెట్టిన అభ్యర్థికి బ్యాకప్ లేకపోయినా ఉద్యోగం ఇచ్చారు. జూన్ 4న వైయస్ జగన్ ప్రెస్ మీట్ తర్వాత అధికారులు డేటాను టాంపరింగ్ చేసి బ్యాకప్ ఉన్నట్టు చూపించారు. ఆర్టీఐ (RTI) సమాచారమే సాక్ష్యం: బాధితులు కోర్టును కూడా ఆశ్రయిచారు. మరోవైపు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకోగా, రికార్డులను పునఃపరిశీలించిన అనంతరం "అర్హులైన మరికొందరు ఉన్నారు, మేము కొన్ని సరిగ్గా చేయలేకపోవడం వల్ల ఉద్యోగాలు ఇవ్వలేకపోయాం" అని శాప్ అధికారులే లిఖితపూర్వకంగా అంగీకరించారు. రిజర్వేషన్ల అమలులో వైఫల్యం – ఏకాంబరం, దుర్గా మల్లికల కేసులే ఉదాహరణ.. ఏకాంబరం కేసు (చిత్తూరు జిల్లా సోషల్ స్టడీస్): చిత్తూరు జిల్లాలో మొత్తం 113 పోస్టులు ఉంటే, బీసీ-డీ కి 7 పోస్టులు ఉన్నాయి. అందులో ఏకాంబరం మెరిట్ 6వ ర్యాంకు. అయితే పీహెచ్ సీ, స్పోర్ట్స్ కోటా 8 మందిని తీసుకువచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాలోనే డంప్ చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయడం అధికారులకు చేతకాలేదు. మహిళా రిజర్వేషన్ లాగే స్పెషల్ కేటగిరీలను కూడా అన్ని కమ్యూనిటీల్లో హారిజాంటల్ గా పంచాలి కానీ, మెరిట్ లో ఉన్న బీసీ అభ్యర్థులను తొలగించి ఒకే చోట డంప్ చేయడం వల్ల ఏకాంబరం లాంటి ఎంతోమంది నష్టపోయారు. శ్రీదుర్గా మల్లిక కేసు (తూర్పుగోదావరి జిల్లా): ఈడబ్ల్యూఎస్ (EWS) మహిళా కోటాలో 6వ స్థానంలో ఉన్న జే.శాంతి అనే అభ్యర్థికి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నందున నియామకం రద్దయింది. తదుపరి 7వ స్థానంలో అర్హురాలైన దుర్గా మల్లికకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉండగా.. అధికారులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. విజయనగరం జిల్లాలో పీజీటీ హిందీ పోస్టులో 798 ర్యాంకు వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత అభ్యంతరం తెలపగానే అక్టోబర్ 8న పొరపాటు సరిదిద్దుకుని 617 ర్యాంకు అభ్యర్థికి పోస్టింగ్ ఇచ్చారు. విజయనగరంలో సాధ్యమైన మార్పు దుర్గా మల్లిక విషయంలో ఎందుకు చేయడం లేదు? ఇక జగదీష్ నాయక్ విషయానికొస్తే... ఎంత ఘోరమంటే.. ఎస్జీటీ ఉర్దూకు సంబంధించి నాలుగు పోస్టులుకు గానూ.. మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక పోస్టు, ప్రభుత్వ విభాగంలో మూడు పోస్టులున్నాయి. ఈ మూడింటిలో ఒక మహిళా రిజర్వేషన్, రెండు జనరల్ పోస్టులు ఇవ్వాలి. కోన శశిధర్ ఏమంటారంటే... మహిళా ఎవ్వరూ రాలేదు. ఈ పోస్టు ఖాలీగా పెట్టాం. మిగిలిన రెండుపోస్టులు భర్తీ చేశామని చెబుతున్నారు. ఈ ఖాళీగా ఉన్న పోస్టు వేరొకరికి ఇవ్వడం సాధ్యం కాదని చెబుతున్నారు. కానీ మీరు చెప్పిన ఆర్టీసీ బస్సు సిద్దాంతం ప్రకారం చూసుకుంటే.. మీరు మహిళా రాలేదు కాబట్టి.. ఆ పోస్టు ఖాలీగా ఉంచి, మిగిలిన రెండు పోస్టులు భర్తీ చేసామని చెబుతున్నారు. అలా భర్తీ చేసిన రెండు పోస్టుల్లో ఒక పోస్టులో మహిళా అభ్యర్ధి ఉన్నారు. మీరు మరొక్కసారి వెరిపై చేసుకొండి. జగదీష్ నాయక్ ర్యాంకు 363 అయితే దానికి మందు 197, 125 ర్యాంకులున్న వారికి పోస్టింగ్ లు ఇచ్చారు. ఈ ఇద్దరిలో ఒక మహిళా ఉంది. కాబట్టి హారిజాంటల్ లో ఒక మహిళ ఉంది కాబట్టి.. మరో పోస్టును పురుష అభ్యర్ధితో నింపాలి. ఈ నేపధ్యంలో జగదీష్ నాయక్ కి ఆ పోస్టు ఇవ్వాల్సిన అవసరం ఉంది. జోన్ మార్పిడి అక్రమాలు: జోన్ మార్పిడిలోనూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్డ్డారు. జోన్-1 లో పరీక్ష రాసి ర్యాంకు తెచ్చుకున్న ఇద్దరు అభ్యర్థులను (నెంబర్లు: 326895, 305736) జోన్-3 లోకల్ కింద స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చేశారు. ఇదే విషయాన్ని వైయస్.జగన్ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఆ తర్వాత మొన్న ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో వీరి పేర్లు లేవు. సున్నా ర్యాంకు ఉన్న వీరికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? క్రీడాకారులపై కూటమి నేతల వెటకారాలు – వైయస్ఆర్‌సీపీ డిమాండ్.. నేషనల్ గేమ్స్ లో 16 గోల్డ్ మెడల్స్ సాధించి, తినడానికి తిండి లేక గ్రీవెన్స్ పెట్టుకున్న దుర్గయ్య అనే ఎస్టీ నిరుపేద అభ్యర్థిని చేర్చుకోవాల్సింది పోయి.. "24 ఏళ్ల క్రితం మెడల్ వస్తే ఇప్పుడు ఉద్యోగం ఇవ్వాలా" అంటూ తిరుపతిలో ఒక టీడీపి నేత వెటకారంగా మాట్లాడడం అత్యంత బాధాకరం. రాష్ట్రంలో క్రికెట్ కు ఒకే ఒక్క పోస్టు ఇస్తూ, బాల్ బ్యాడ్మింటన్ కు ఏకంగా 48 ఉద్యోగాలు ఇవ్వడం వెనుక ఉన్న లొసుగులేంటో అందరికీ తెలుసు. నిరుద్యోగులు తమ ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తుంటే, కూటమి ప్రభుత్వ సోషల్ మీడియా వింగ్ వారిపై రకరకాల ముద్రలు వేస్తూ మానసికంగా వేధిస్తోంది. కష్టపడి చదివిన వారికి ఉద్యోగాలు ఇవ్వకపోగా, మరింత మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కప్పిపుచ్చే ధోరణిని వీడి, కేవలం అధికారులను అడ్డం పెట్టుకుని తప్పించుకోవడం ఆపాలి. లక్షలాది మంది నిరుద్యోగుల ఆవేదనను, నష్టపోయిన అభ్యర్థుల సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకుని.. ఈ డీఎస్సీ నియామకాలపై తక్షణమే సీబీఐ (CBI) ద్వారా నిష్పక్షపాత విచారణ జరిపించాలని.. తద్వారా మాత్రమే అర్హులైన, నిజాయితీగా కష్టపడి చదువుకున్న అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.