శ్రీశైలం కాటేజీ వివాదం కూటమి సర్కార్‌ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే

 రెండేళ్ల పాలనపై ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం

 నాకు ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు:  ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి

దర్శి : శ్రీ‌శైలం దేవస్థానంలోని కాటేజీ వివాదాన్ని కూటమి ప్రభుత్వం కావాలనే రాజకీయంగా రచ్చ చేస్తోందని ప్రకాశం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. ఆదివారం దర్శిలోని తన నివాసం నుంచి విడుదల చేసిన వీడియో ప్రకటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బూచేపల్లి సుబ్బారెడ్డి–వెంకాయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన కాటేజీ తాళాలు ఎప్పటికప్పుడు దేవస్థానం అధికారుల వద్దే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. మరమ్మతుల పనుల కోసం మాత్రమే కొద్ది రోజుల పాటు తమ కుటుంబం తాళాలు తీసుకుందని, గత రెండేళ్లలో తమ కుటుంబ సభ్యులు ఒక్కసారి మాత్రమే ఆ కాటేజీని వినియోగించుకున్నారని తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం పర్యటన సందర్భంగా, ఇటీవల మహాశివరాత్రి ఉత్సవాల సమయంలో కూడా కాటేజీ తాళాలు దేవస్థానం అధికారుల వద్దే ఉన్నాయని గుర్తు చేశారు. దేవస్థానం ఆస్తులను తమ కుటుంబం ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని, ఆలయ ఆస్తుల నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదని స్పష్టం చేశారు. ఇందుకు భిన్నంగా అనేక హిందూ దేవాలయాల నిర్మాణం, అభివృద్ధికి తమ కుటుంబం గణనీయంగా సహకరించిందని పేర్కొన్నారు.

కాటేజీ వ్యవహారంలో తనకు మూడు నోటీసులు జారీ చేశారని కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తనకు ఇప్పటి వరకు ఒక్క నోటీసు కూడా అందలేదని స్పష్టం చేశారు. తాను మూడు నోటీసులు అందుకున్నట్లు నిరూపిస్తే శ్రీ మల్లన్న సాక్షిగా క్షమాపణ చెబుతానని, లేదంటే అసత్య ప్రచారం చేసిన వారు తన కుటుంబానికి క్షమాపణ చెప్పేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు.

ప్రజా సమస్యలపై ఆందోళనలు, నిరసనలు పెరుగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని బూచేపల్లి ఆరోపించారు. శ్రీశైలం దేవస్థానం పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

తమ కుటుంబం ఎప్పటికప్పుడు హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ ధార్మిక కార్యక్రమాలు, అన్నదానాలు, ఆలయాల అభివృద్ధికి విరాళాలు అందిస్తోందని తెలిపారు. తమ కుటుంబం వల్ల దేవస్థానానికి ఏదైనా ఆర్థిక నష్టం జరిగినట్లు రుజువైతే, ఆ మొత్తాన్ని పూర్తిగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
 

Back to Top