ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి అండగా వైయస్ జగన్

ఆ వర్గం అభ్యున్నతికి విశేష కృషి చేసిన ఏకైక నాయకుడు

ఆర్యవైశ్యుల ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోయారు 

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ధ్వ‌జం

తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం
ముఖ్య అతిథులుగా హాజరైన పార్టీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి , ప‌లువురు ఆర్యవైశ్య ప్రముఖులు  

కూటమి ప్రభుత్వంలో వ్యాపారులు, ఆర్యవైశ్యులపై వేధింపులు పెరిగాయి 

ఆర్య‌వైశ్యులంతా ఒక‌తాటిపైకి రావాలి

టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంలో ఆర్య‌వైశ్యులు భాగ‌స్వాములు కావాలి

సజ్జల రామ‌కృష్ణారెడ్డి పిలుపు

తాడేపల్లి: ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని, ప్రస్తుతం కూటమి పాలనలో ఈ వర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని వైయస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైయస్ జగన్ పాలనలో ఆర్యవైశ్యులు ఆత్మగౌరవంతో జీవించారని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో డీబీటీ పథకాల ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచి వ్యాపారులకు ఊతమిచ్చారని చెప్పారు. ఈబీసీ నేస్తం, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ విద్య వంటి పథకాల ద్వారా అగ్రవర్ణ పేదలకు పెద్ద ఎత్తున మేలు జరిగిందని వివరించారు. తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్య‌వైశ్యుల ఆత్మీయ స‌మావేశంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఏమ‌న్నారంటే.. 

- వైయస్ జగన్ హయాంలో ఆత్మగౌరవంతో జీవించాం
 వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులు ఆత్మగౌరవంతో జీవించారు. డీబీటీ పథకాల ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో వ్యాపారాలు అభివృద్ధి చెందాయి. ఈబీసీ నేస్తం, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విదేశీ విద్య వంటి పథకాలతో ఆర్యవైశ్య కుటుంబాలకు మేలు జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలు నిలిచిపోయాయి. మహిళలకు హామీ ఇచ్చిన ఆడబిడ్డ నిధి అమలు కాకపోవడంతో పాటు, తల్లికి వందనం వంటి పథకాలూ నిర్వీర్యమయ్యాయి. దీంతో ఆర్యవైశ్యుల వ్యాపారాలు దెబ్బతిని, భయాందోళనల మధ్య జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది

- ఆర్య‌వైశ్యుల ద్రోహి చంద్ర‌బాబు
ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ పరిరక్షణకు వైయస్‌ జగన్‌ విశేష కృషి చేశారు. చింతామణి నాటకాన్ని నిషేధించి ఆ వర్గం మనోభావాలను గౌరవించిన ఘనత ఆయనకే దక్కుతుంది. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ ర‌ఘురామ‌కృష్ణం రాజు మాట్లాడితే..ఆయ‌న్ను డిప్యూటీ స్పీక‌ర్ చేసి ఆర్య‌వైశ్యుల ద్రోహిగా చంద్ర‌బాబు మిగిలారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఆర్య‌వైశ్యుల‌పై అక్ర‌మ కేసులు, వేధింపులు అధిక‌మ‌య్యాయి. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు ఇవ్వ‌కుండా అన్యాయం చేయ‌డంతో ఇవాళ వ్యాపారాలు దెబ్బ‌తింటున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంలో ఎండోమెంట్‌ పరిధిలోని ఆర్యవైశ్య సత్రాలు, ట్రస్టులను వారే నిర్వహించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. విజయవాడలో ఆంధ్ర భవనం నిర్మాణం, కర్నూలులో పేద ఆర్యవైశ్య విద్యార్థుల హాస్టల్‌ భవనం కోసం నిధులు మంజూరు చేశారు. పెనుగొండలో వాసవీ మాత ఆలయ అభివృద్ధికి రూ.1.50 కోట్లు కేటాయించారు. ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం వైయస్‌ జగన్‌ చేసినంతగా మరే నాయకుడు చేయలేదు.

- ఆర్య‌వైశ్యుల‌కు వైయ‌స్ జ‌గ‌నే అండ‌
ఆర్యవైశ్యులకు నిజమైన సామాజిక న్యాయం వైయస్‌ జగన్‌ పాలనలోనే జరిగింది. టీటీడీ, దేవాదాయ సంస్థలు, ట్రస్ట్‌ బోర్డుల్లో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యం కల్పించిన నాయకుడు వైయస్‌ జగన్‌. ఆర్యవైశ్యుల కోసం ఆలయాల్లో సత్రాలకు స్థలాలు కేటాయించి, వారి అభివృద్ధికి కృషి చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులను పక్కనపెడుతూ అన్యాయం చేస్తోంది. అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం పేరుతో ఆర్యవైశ్యుల నుంచి నిధులు సేకరించినా, వారికి ఎలాంటి హక్కులు కల్పించలేదు. రాష్ట్రంలో ఆర్యవైశ్య వ్యాపారులు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. అయినా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఆర్యవైశ్యులకు అండగా నిలిచే నాయకుడు వైయస్‌ జగన్‌ మాత్రమే. రానున్న రోజుల్లో మళ్లీ మంచి రోజులు వస్తాయి.

- ఆర్యవైశ్యులకు వైయస్సార్‌సీపీ జెండా అండ‌ : సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్‌
చంద్ర‌బాబు కూటమి ప్రభుత్వం ఏర్ప‌డిన‌ప్పటి నుంచి అన్ని వర్గాలపై వేధింపులే లక్ష్యంగా పనిచేస్తోంది. వైయస్‌ జగన్‌ హయాంలో మాత్రం కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అందరికీ సమాన న్యాయం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో వారి సమస్యలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా డిజిటల్‌ బుక్‌ను ఏర్పాటు చేశాం. ప్రత్యర్థులపై మొదలైన వేధింపులు ఇప్పుడు సామాన్య ప్రజల వరకు చేరాయి. అయినప్పటికీ వైయస్సార్‌సీపీ శ్రేణులకు ధైర్యం, భరోసా, అండగా వైయస్‌ జగన్‌ నిలుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు శాశ్వతం కావు. ప్రజలకు మళ్లీ మంచి రోజులు వస్తాయి.

ఆర్యవైశ్యులు శాంతియుత వాతావరణాన్ని కోరుకునే వర్గం. తమ కష్టంతో ఎదిగే వారికి ప్రభుత్వం భద్రత, ప్రశాంతత కల్పించాలి. కానీ గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అవినీతి, దోపిడీ పెరిగిపోగా, ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన మేలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో ఆర్యవైశ్యులు ముందుండాలి. వారి సమస్యల పరిష్కారానికి వైయస్సార్‌సీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కృషి చేస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఆర్యవైశ్యులను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తున్నాం. ఇప్పటికే వేలాది మంది ఆర్యవైశ్యులు వివిధ కమిటీల్లో బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, మహిళలు కూడా చురుకుగా పాల్గొంటున్నారు. వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించేందుకు వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారు. ఆర్యవైశ్యులు తమ బలాన్ని సంఘటితం చేసుకుని సమాజంలో, రాజకీయాల్లో మరింత ప్రభావవంతమైన పాత్ర పోషించాలి అని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

-ఆర్యవైశ్యులు వైయస్ జగన్‌కు అండగా నిలవాలి:  లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ
ఆర్యవైశ్యులు సేవాభావానికి, సామాజిక బాధ్యతకు ప్రతీకలు. నాకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినప్పుడు గుంటూరులో ఆర్యవైశ్యులు చేసిన సన్మానం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ సందర్భంగా నన్ను ‘అప్పిరెడ్డి’గా కాకుండా ‘అప్పిరెడ్డి గుప్తా’గా సంబోధించడం ఎంతో గర్వంగా అనిపించింది. సమాజ అభివృద్ధికి నిరంతరం కృషి చేసే ఆర్యవైశ్యుల పట్ల వైయస్‌ జగన్‌కు ప్రత్యేకమైన అభిమానముంది. వారి సంక్షేమం, అభ్యున్నతి కోసం ఎప్పుడూ ఆలోచించే నాయకుడు ఆయన.

వైయస్‌ జగన్‌ను దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన ఆలోచనలన్నీ ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం చుట్టూనే తిరుగుతాయని చెప్పగలను. ఆర్యవైశ్యులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నందున వారికి మరింత ప్రాధాన్యం కల్పించాలని ఆయన ఎప్పుడూ భావిస్తుంటారు. రానున్న రోజుల్లో కూడా ఆర్యవైశ్యులు వైయస్సార్‌సీపీకి అండగా నిలిచి, వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ ముందుకు సాగాలని కోరుతున్నాను" అని లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు.  

Back to Top