సూపర్ సిక్స్ కాదు.. 'సూపర్ మోసాలు':

ఆడబిడ్డల 'ఆత్మగౌరవాన్ని' తాకట్టు పెట్టిన చంద్రబాబు:

ఆడబిడ్డ నిధి పధకాన్ని తక్షణమే అమలు చేయాలి : 

చంద్రబాబు హామీల వైఫల్యంపై ధ్వజమెత్తిన  వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేతలు.

గుంటూరు, విశాఖపట్నం, తాడేపల్లి, నెల్లూరు నుంచి వేర్వేరుగా మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీగుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జి నూర్ ఫాతిమా, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి,  మాజీ మంత్రి విడదల రజిని, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి పుణ్యశీల, పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితలు.

కూటమి సభ 'రెండేళ్ల నమ్మకం కాదు, రెండేళ్ల వెన్నుపోటు, సంక్షోభం': ఎమ్మెల్సీ వరుదు కల్యాణి.

ఆడబిడ్డ నిధికి మంగళం పాడేందుకే 'పీ4' డ్రామా: మాజీ మంత్రి విడదల రజని ఆగ్రహం 

మహిళలను మోసగించిన చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలి: పార్టీ అధికార ప్రతినిధి బండి పుణ్యశీల 

రెండేళ్లు దాటినా బడ్జెట్‌లో రూపాయి లేదు- 'ఆడబిడ్డ నిధి' ఊసే లేదు: గుంటూరు తూర్పు ఇన్‌ఛార్జి నూర్ ఫాతిమా. 

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన సభ కేవలం 'నమ్మకద్రోహ సభ' అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్లి సంతకాలతో కూడిన బాండ్ పేపర్లు పంచి, ఓట్లు వేయించుకున్న చంద్రబాబు.. నేడు 'ఆడబిడ్డ నిధి' పథకానికి బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించకుండా 2 కోట్ల మంది మహిళల వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో జగనన్న అందించిన మహిళా సాధికారతను కూటమి ప్రభుత్వం పూర్తిగా చీకట్లోకి నెట్టేసిందని, 'ఆడబిడ్డ నిధి'ని ఎగ్గొట్టేందుకే 'పీ4' అనే కొత్త వంచన డ్రామాకు తెరతీశారని మాజీ మంత్రి విడదల రజని, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి పుణ్యశీల, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జి నేతలు నూర్ ఫాతిమా, పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్  కాకాణి పూజితలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంతో పాటు విశాఖ, గుంటూరు, నెల్లూరు పార్టీ కార్యాలయాల్లో మాజీ మంత్రి విడదల రజని, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, పార్టీ అధికార ప్రతినిధి బండి పుణ్యశీల, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నూర్ ఫాతిమా, మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత విడివిడిగా మీడియా సమావేశాలు నిర్వహించారు. కూటమి రెండేళ్ల చీకటి పాలనలో అత్యంత దారుణంగా మోసపోయింది, వెన్నుపోటుకు గురైంది మహిళలేనని వారు స్పష్టం చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం తిరుపతి శ్రీవారి పాదాల చెంత నిర్వహించిన సభ 'రెండేళ్ల నమ్మకం' కాదు.. అది పచ్చి 'నమ్మకద్రోహం, వెన్నుపోటు' సభ అని మండిపడ్డారు. 

ఆడబిడ్డ నిధికి నీళ్లొదిలేసి.. 'పీ4' పేరుతో చంద్రబాబు కొత్త వంచన: మాజీ మంత్రి విడదల రజని తీవ్ర ఆగ్రహం

అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఆర్థిక ఇబ్బందుల నెపంతో 'ఆడబిడ్డ నిధి' పథకాన్ని అటకెక్కించి, దానికి ప్రత్యామ్నాయంగా 'పీ4' తీసుకొచ్చామనడం మహిళలను నిలువునా వంచించడమే. కూటమి రెండేళ్ల పాలనలో అత్యంత దారుణంగా నష్టపోయింది, మోసపోయింది మహిళలే. ఎన్నికల ముందు ప్రతి ఇంటికీ వెళ్లి సంతకాలతో కూడిన బాండ్ పేపర్లు పంచి, ఇప్పుడు పథకాన్ని ఎగ్గొట్టారు. ఒక్కో మహిళకు రెండేళ్లకు రూ. 36 వేల చొప్పున, రాష్ట్రంలోని 2 కోట్ల మంది మహిళలకు కూటమి ప్రభుత్వం రూ. 72 వేల కోట్లు బాకీ పడింది. 

పీ4 పేరుతో చేతులు దులిపేసుకున్నారు: 
'ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాలి' అంటూ చంద్రబాబు చావుకబురు చల్లగా చెబుతున్నారు, పాత జన్మభూమి కమిటీల తరహాలో 'పీ4' తెచ్చి మహిళలను అడుక్కోమనేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. రజనీకాంత్‌లా హామీలు – గజనీలా నాటకాలు: ఎన్నికల ప్రచారంలో రజనీకాంత్‌లా ఎలివేషన్ డైలాగులు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక గజనీలా హామీలు మర్చిపోయి నాటకాలు ఆడుతున్నారు. నాడు 'స్వాతిముత్యం'లా నటించి, నేడు 'నాయకుడు' సినిమాలోని కన్నింగ్ పాత్రలా తయారయ్యారు.ఉచిత బస్సు, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆడబిడ్డ నిధి, మొదటి సంతకం పెట్టిన డీఎస్సీ ఇలా కూటమి ఇచ్చిన హామీలన్నీ దగాగా మిగిలాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆఖరికి అమరావతిని కూడా కూటమి దగా చేసింది. 
తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత కూటమి జరుపుకున్న 'రెండేళ్ల నమ్మకం' సభ ఒక పెద్ద నమ్మకద్రోహ సభ. కూటమి నేతలు వైయస్ జగన్ పై బురదజల్లుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఆపాలి.చంద్రబాబు చేతిలో మోసపోయిన ప్రతి మహిళా రాబోయే రోజుల్లో ఆడపులిలా మారి నారా వారికి 'నారీ శక్తి' తడాఖా చూపించి గద్దె దించడం ఖాయం. 

మహిళలను వంచించినందుకు చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలి: బండి పుణ్యశీల వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి.

మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. కూటమి నేతలది బాండ్ పేపర్ల మోసం: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలతో కూడిన బాండ్లు చూసి మహిళలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. లబ్ధిదారుల కంటతడి పెట్టించిన ఈ ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదు. 33 శాతం రిజర్వేషన్లు అని చెప్పుకునే టీడీపీ, మొన్నటి రాజ్యసభ ఎంపీ పదవుల్లో ఒక్క మహిళకైనా ఎందుకు అవకాశం ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వంలో మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. తల్లులకు ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలని ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలని హితవు పలికారు.

బాబు ష్యూరిటీ బాండ్లకు లేదు వారంటీ.
ఆడబిడ్డ నిధి'కి ఎగనామం పెట్టి మహిళలకు వెన్నుపోటు: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ధ్వజం.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన సభ 'రెండేళ్ల నమ్మకం' కాదు.. అది ప్రజలను నిలువునా వంచించిన 'రెండేళ్ల వెన్నుపోటు, సంక్షోభ సభ. ఎన్నికల ముందు 18 నుండి 60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున 'ఆడబిడ్డ నిధి' ఇస్తామని ఇంటింటికీ తిరిగి సంతకాలతో కూడిన బాండ్ పేపర్లు పంచిన చంద్రబాబు, నేడు అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని పూర్తిగా అటకెక్కించారు. 

రూ.72 వేల కోట్ల దగా:
రాష్ట్రంలో ఈ పథకానికి అర్హులైన 2 కోట్ల మంది మహిళలకు కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా పైసా ఇవ్వకుండా, ఒక్కో మహిళకు రూ.36,000 చొప్పున మొత్తం రూ.72,000 కోట్లు బకాయి పడి వెన్నుపోటు పొడిచింది. నాడు 'ఆడబిడ్డ నిధి' వేరు, 'పీ-4' వేరు అని మేనిఫెస్టోలో చెప్పి.. నేడు నిధులు ఇవ్వలేక రెండు ఒకటేనంటూ మాట మార్చడం చంద్రబాబు నైజానికి నిదర్శనం. చంద్రబాబు మోసాలకు పవన్ కళ్యాణ్, బీజేపీలు కత్తి అందిస్తూ సహకరిస్తున్నారు. ఎన్నికల ముందు రజనీకాంత్‌లా హామీలిచ్చి, ఇప్పుడు గజనీలా మర్చిపోయారు. నాడు 'స్వాతిముత్యం'లా నటించిన చంద్రబాబు.. నేడు 'నాయకుడు' సినిమాలోని కన్నింగ్ పాత్రలా ప్రవర్తిస్తున్నారు.

జగనన్న పాలనే స్వర్ణయుగం:
వైయస్ జగన్  హయాంలో నవరత్నాల ద్వారా 99.9 శాతం హామీలను డీబీటీ ద్వారా నేరుగా మహిళల ఖాతాల్లో వేశారు. 'చేయూత', 'ఆసరా', 'కాపునేస్తం', 'ఈబీసీ నేస్తం', సున్నా వడ్డీ ద్వారా వేల కోట్లు అందించి మహిళా సాధికారతను నిరూపించారు. నాడు ముసలమ్మ బటన్ నొక్కడాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబుకు.. రెండేళ్లవుతున్నా ఆ ముసలమ్మకున్న సత్తువ, సేవ ఎందుకు లేవు.  వైయస్.జగన్ ఇచ్చిన పథకాలు ఆగవని చెప్పిన పవన్ కళ్యాణ్.. నేడు రూ.10 లక్షల సున్నా వడ్డీ మాట దేవుడెరుగు, పాత రూ.3 లక్షల పథకాన్ని కూడా అమలు చేయించలేకపోతున్నారు. మిమ్మల్ని నమ్మిన కాపు మహిళలను, ఓట్లేసిన ఆడబిడ్డలను పవన్ ఘోరంగా మోసం చేశారు.

లోకేష్ పేరుకు కొత్త అర్ధాలు:
వైయస్ జగన్ పేరులో 'జే' ఉంటే గొడ్డలి అంటున్న లోకేష్ పేరుకు.. L-లూఠీ, O-ఒంటరిగా పోటీ చేయలేని, K-కక్షసాధింపు, E-ఈవీఎం మానిప్యులేషన్, S-స్కామ్స్, H- అంటే హెరాస్‌మెంట్స్ అని అర్థం వస్తుంది. ఇచ్చిన హామీలు అమలుచేయకపోతే చొక్కా పట్టుకోమని నాడు యువగళం పాదయాత్రలో చెప్పిన లోకేష్‌ను నిలదీయడానికి 2 కోట్ల మంది మహిళలు సిద్ధంగా ఉన్నారు. 
కూటమి సభకు 'రెండేళ్ల నమ్మకం, సంక్షేమం' అని పేరు పెట్టడం హాస్యాస్పదం. ప్రజలు దీనిని 'రెండేళ్ల వెన్నుపోటు, సంక్షోభం, అరాచకం' అని పిలుస్తున్నారు. జగనన్న పాలనే స్వర్ణయుగం. నాడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో 'చేయూత' ద్వారా 45 ఏళ్లు నిండిన మహిళల ఖాతాల్లో క్రమంగా డబ్బులు వేసి ఆదుకున్నారు. కానీ నేడు కూటమి నేతలు..  ఆ రోజు ఆడబిడ్డ నిధి వేరు, 'పీ-4' వేరు అని మేనిఫెస్టోలో చెప్పి, నేడు రెండు ఒక్కటేనంటూ మాట మార్చడం మహిళా లోకాన్ని మోసం చేయడమే.

బడ్జెట్‌లో ఒక్క రూపాయి లేదు.. మహిళలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు?: నూర్ ఫాతిమా, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జి.

గుంటూరు పార్టీ కార్యాలయంలో నూర్ ఫాతిమా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వరుసగా మూడు బడ్జెట్‌లలోనూ 'ఆడబిడ్డ నిధి' పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణం. 
ఒక కుటుంబంలో 50 ఏళ్లు దాటిన మహిళలకు ఇస్తామన్న రూ.4,000 పెన్షన్ ఇవ్వలేదు (ఒక్కొక్కరికీ రూ.96,000 బాకీ). 'తల్లికి వందనం' మొదటి ఏడాది తూతూమంత్రంగా ఇచ్చి, రెండో ఏడాది కోత పెట్టి, ఈ ఏడాది స్కూళ్లు తెరుచుకుంటున్నా ఊసే ఎత్తడం లేదు. ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎక్కడా సక్రమంగా అమలు కావడం లేదు.రెండేళ్లుగా 'ఆడబిడ్డ నిధి' అమలు చేయకపోవడంతో ఒక్కో మహిళకు రూ.36 వేలు కూటమి ప్రభుత్వం బకాయి పడింది. 'సూపర్ సిక్స్'లో మహిళల కోసం ఉద్దేశించిన 4 కీలక పథకాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించింది. ఉచిత బస్సు పథకాన్ని సక్రమంగా అమలు చేయకుండా మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
తల్లికి వందనం పథకాన్ని ఒక ఏడాది తూతూమంత్రంగా అమలు చేసి.. ఈ ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేలా ఉన్నారు. 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు నెలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామన్న హామీ ఏమైంది? కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది.. సాక్ష్యాధారాలున్నా అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై చర్యలు లేవు. నాడు అన్నలా జగన్ రక్షణ కల్పిస్తే.. నేడు కూటమి నేతలు మహిళల పాలిట రాక్షసుల్లా తయారయ్యారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇచ్చిన 50 వేల ఇళ్ల పట్టాలను నిలిపివేసి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. సూపర్ సిక్స్ పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధమా?.. రానున్న ఎన్నికల్లో ప్రజలు కూటమికి బుద్ధి చెప్పడం ఖాయం.

పీ4 పేరుతో ఆడబిడ్డ నిధికి మంగళం.. : కాకాణి పూజిత, వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్.

ఇన్నాళ్లూ సూప‌ర్ సిక్స్‌- సూప‌ర్ హిట్ అని ప్ర‌చారం చేసిన చంద్ర‌బాబు ఇప్పుడు ఆడ‌బిడ్డ నిధి ప‌థ‌కాన్ని మొద‌లు పెట్ట‌కుండానే ఎత్తేసే కార్య‌క్ర‌మానికి తెర‌దీశాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయ‌నే సాకుతో పీ4 పేరుతో మాఫీ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఆర్ధిక ఇబ్బందుల గురించి ఎన్నిక‌లకు ముందు ప్ర‌స్తావిస్తే సంప‌ద సృష్టించి అమ‌లు చేస్తాన‌ని చంద్ర‌బాబు చెబితే, ఏ ప‌థ‌కానికి ఎన్ని నిధులు కావాలో స్ప‌ష్ట‌త ఉంద‌ని, దానికి రోడ్ మ్యాప్ వేశామ‌ని నారా లోకేష్ చెప్పాడు. కానీ రెండేళ్లుగా ప్ర‌వేశ‌పెట్టిన మూడు బ‌డ్జెట్‌ల‌లో ఆడ‌బిడ్డ నిధి ప‌థ‌కానికి ఒక్క రూపాయి కూడా కేటాయించ‌కుండా మ‌హిళ‌ల‌కు వెన్నుపోటు పొడుస్తూ వ‌చ్చాడు. ఇప్పుడు రెండేళ్ల పాల‌న పూర్త‌యిన సంద‌ర్భంగా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో పూర్తిగా మంగ‌ళం పాడేసే కుట్ర‌లు చేస్తున్నాడు. ఎన్నిక‌ల్లో గెల‌వడం కోసం మోస‌పు హామీలు ఇచ్చిన కూట‌మి నాయ‌కులు తీరా అధికారంలోకి వ‌చ్చాక మాయ‌మాట‌లు చెబుతున్నారు. ఆడ‌బిడ్డ నిధి ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని హ‌క్కుగా అడుగుతుంటే పీ4 పేరుతో అడ్డుక్కోమ‌నే చంద్రబాబు స‌ల‌హా ఇస్తున్నాడు. ఇది మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీయ‌డ‌మే. ఇది మ‌హిళా సాధికార‌త ప‌ట్ల చంద్రబాబు కూట‌మి ప్ర‌భుత్వానికి ఉన్న చిత్త‌శుద్ధి. ఆడ‌బిడ్డ నిధి ప‌థ‌కాన్ని అటకెక్కించ‌డంలో భాగంగానే మ‌హిళ‌ల‌ను మాన‌సికంగా సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. త‌ల్లికి వంద‌నం, 3 ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల ప‌థ‌కం, ఫ్రీ బస్ ప‌థ‌కాలు అమ‌లైన తీరు చూసిన మ‌హిళ‌లు ఈ పాల‌న మాకొద్దు బాబోయ్ అని గ‌గ్గోలు పెడుతున్నారు. కూట‌మి పాల‌న‌లో మ‌హిళ‌లెవ‌రూ సంతోషంగా లేరు.

నాడు వైయస్ జగన్  99.9 శాతం నవరత్నాల హామీలను పారదర్శకంగా అమలు చేసి చూపిస్తే, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ఒక్క పథకాన్ని సరిగ్గా అమలు చేయలేకపోయింది. కూటమి ఎమ్మెల్యేలు ధైర్యం ఉంటే ప్రజల వద్దకు వెళ్లి 'సూపర్ సిక్స్' అమలు చేశామని చెప్పాలని సవాల్ విసిరారు. కూటమి నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎంతటి డ్రామాలాడినా, పేరడీ డైలాగులు పేల్చినా ఏపీ మహిళా లోకం ఇక నమ్మే పరిస్థితిలో లేదు. అబద్ధపు ప్రచారాలు, బోగస్ హామీలతో కాలం వెళ్లదీస్తున్న ఈ చేతకాని ప్రభుత్వంపై తిరుగుబాటుకు మహిళలంతా 'ఆడపులులు'గా మారే రోజులు దగ్గరపడ్డాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ఇప్పటికైనా తమ మాయమాటలు కట్టిపెట్టి 'ఆడబిడ్డ నిధి' సహా సూపర్ సిక్స్ హామీలన్నింటినీ అక్షరాలా అమలు చేయాలి. మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ఈ కూటమి ప్రభుత్వం మెడలు వంచి, హక్కులను సాధించుకునే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, మహిళల అండగా రాజీలేని పోరాటం కొనసాగిస్తుంది" అని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేతలు హెచ్చరించారు.

Back to Top