అనంతపురం: వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వేదికలు కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు, ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకువెళ్తుండటంతోనే వాటిపై కుట్రపూరిత చర్యలు చేపడుతున్నారని వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేయడంతో పాటు వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి వైయస్ఆర్‌సీపీకి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను భారతదేశంలో అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నాలు జరగడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవకతవకలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో జరిగిన లోపాలను సాక్ష్యాధారాలతో ప్రజల ముందుకు తీసుకురావడంలో వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం ముందంజలో ఉందని తెలిపారు. ప్రజల్లో చైతన్యం పెంచుతూ ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్నందుకే ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భావ ప్రకటన స్వేచ్ఛకు, రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వైయస్ఆర్‌సీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను తక్షణమే పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రజల గొంతుకను అణిచివేసే ప్రయత్నాలు ఎంత చేసినా నిజాలను దాచలేరని, ప్రజా సమస్యలపై వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని షేక్ బాబా సలామ్ స్పష్టం చేశారు.