అనంతపురం : విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తెరుచుకున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇప్పటికీ విద్యా కానుక అందకపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తక్షణమే విద్యా సామగ్రి అందించాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కరువు జిల్లాగా పేరొందిన అనంతపురంలో పేద విద్యార్థులు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, యూనిఫాంలు, షూస్, సాక్స్, బెల్టులు, ఇంగ్లీష్–తెలుగు నిఘంటువులు, వర్క్‌బుక్స్ వంటి కనీస విద్యా సామగ్రి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న విద్యా కానుక ద్వారా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు అవసరమైన అన్ని వస్తువులు అందించి పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి ప్రభుత్వ విద్యను బలహీనపరిచే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉన్న మంత్రి నారా లోకేష్ విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన సమయంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు పరోక్షంగా ప్రోత్సాహం అందిస్తూ పేద విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్యాబ్‌లు అందించి, నాణ్యమైన ఐబీ సిలబస్ ఆధారిత విద్యను కొనసాగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యను హక్కుగా కాకుండా భారంగా మార్చే విధానాలను విరమించి, ప్రభుత్వ విద్య పరిరక్షణకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. అనంతపురం వంటి వెనుకబడిన జిల్లాల్లో విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయ ప్రయోగాలు చేయకుండా, వెంటనే విద్యా సామగ్రిని పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు శ్రీనివాస్ దత్త, ఉపాధ్యక్షులు ఉదయ్, వినీత్, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇండ్ల విజయ్ కుమార్ రెడ్డి, నగర అధ్యక్షుడు కైలాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌తో పాటు నంద కిషోర్, సాయి, పులి కార్తికేయ, గౌరీశంకర్, లోకేష్, రాహుల్ రెడ్డి, శివ, రఫీ, ఫయాజ్, గంగ శివుడు, రాఘవ తదితరులు పాల్గొన్నారు.