పెనుకొండ: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడితే వైయస్ఆర్‌సీపీ సహించదని, ఓటర్ల హక్కులను కాపాడటం ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ (BLA) బాధ్యత అని వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ స్పష్టం చేశారు. పెనుకొండ మండలంలో వైయస్ఆర్‌సీపీ బీఎల్‌ఏలకు నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. ఎన్నికల వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా క్షేత్రస్థాయిలో అడ్డుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. ప్రత్యేక సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించడం, అనర్హులను చేర్చడం, మ్యాపింగ్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించి, ఎలాంటి అక్రమాలు జరిగినా వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని బీఎల్‌ఏలకు సూచించారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నికల వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించామని గుర్తు చేస్తూ, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలను కూడా బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని, ఆ హక్కును హరించే ఏ కుట్రనైనా వైయస్ఆర్‌సీపీ ప్రజలతో కలిసి తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీఎల్‌ఏలకు ERMS, NVSP, ఫారం-6, ఫారం-7, ఫారం-8, సెల్ఫ్ మ్యాపింగ్, ప్రాక్సీ మ్యాపింగ్, ఓటర్ల ధృవీకరణ, అభ్యంతరాల నమోదు తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ప్రతి గ్రామంలో, ప్రతి బూత్‌లో ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం అప్రమత్తంగా పనిచేయాలని, ఒక్క అర్హత కలిగిన ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వైయస్ఆర్‌సీపీ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తుందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీ శ్రేణులు మరింత చురుకుగా వ్యవహరిస్తాయని ఉషశ్రీ చరణ్ తెలిపారు.