సీఆర్డీఏ రైతుల హక్కుల పరిరక్షణకు వైయ‌స్ఆర్‌సీపీ కట్టుబడి ఉంది

రాజధాని ప్రాంత రైతులకు దామాషా ప్రకారం ప్లాట్లు ఇవ్వాలి

రైతులపై బలవంతపు భూ సమీకరణ చర్యలు వెంటనే నిలిపివేయాలి

రైతులను భయభ్రాంతులకు గురిచేసే విధానాలను ప్రభుత్వం మానుకోవాలి

సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. రాజధాని ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రైతుల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యులు మాట్లాడుతూ, రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల హక్కులు, ప్రయోజనాలు పూర్తిగా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. రైతులు ఎంతో నమ్మకంతో తమ భూములను అప్పగించారని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ కర్తవ్యమని పేర్కొన్నారు.

దామాషా ప్రకారం ప్లాట్లు ఇవ్వాలి

రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం దామాషా ప్రకారం అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాల్సి ఉందని సమావేశం అభిప్రాయపడింది. రైతులకు న్యాయం జరిగేలా ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలు, ఒప్పందాల ప్రకారమే ప్లాట్ల కేటాయింపు జరగాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కులను దెబ్బతీసేలా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించారు.

మళ్లీ భూ సమీకరణ చేయరాదు

రాజధాని కోసం ఇప్పటికే భూములు ఇచ్చిన రైతుల నుంచి మరోసారి భూ సమీకరణ పేరుతో భూములు తీసుకోవడం అన్యాయమని సమావేశం స్పష్టం చేసింది. ఒకసారి భూములు సమీకరించిన తర్వాత మళ్లీ రైతులపై అదనపు భారం మోపడం సరికాదని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా జరిగే ఎటువంటి చర్యలనైనా వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు.

ఈ అంశం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉంది

రాజధాని ప్రాంతంలో అదనపు భూ సమీకరణకు సంబంధించిన అంశంపై ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందని కమిటీ సభ్యులు గుర్తు చేశారు. కోర్టులో విచారణలో ఉన్న అంశాల విషయంలో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని సూచించారు. న్యాయ ప్రక్రియను గౌరవిస్తూ రైతుల హక్కులను కాపాడాలని కోరారు.

రైతులను భయభ్రాంతులకు గురిచేయొద్దు

రాజధాని ప్రాంత రైతులపై ఒత్తిళ్లు, బెదిరింపులు, భయాందోళనలు సృష్టించే విధానాలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని సమావేశం డిమాండ్ చేసింది. రైతులతో చర్చలు జరపకుండా, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళ్లడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. రైతుల ఆందోళనలను అర్థం చేసుకుని వారి సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు.

నిడమర్రు, పెనుమాక గ్రామాల్లో లీగల్ టీం పర్యటన

రైతుల అభ్యర్థన మేరకు సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీకి చెందిన లీగల్ టీం నిడమర్రు, పెనుమాక గ్రామాల్లో పర్యటించిన విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. ఆ గ్రామాల రైతులను ప్రత్యక్షంగా కలిసి వారి అభిప్రాయాలు, సమస్యలు, ఆందోళనలను తెలుసుకున్నట్లు తెలిపారు. రైతులు వ్యక్తం చేసిన అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి తదుపరి కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించారు.

మరోసారి సమావేశం

రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై మరింత విస్తృత చర్చ జరిపేందుకు ఈ నెలలోనే మరోసారి సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రైతుల అభిప్రాయాలను సేకరించి, వారి హక్కుల పరిరక్షణ కోసం అవసరమైన న్యాయ, రాజకీయ, ప్రజా పోరాట కార్యక్రమాలను చేపట్టాలని సమావేశం నిర్ణయించింది.

రాజధాని ప్రాంత రైతుల హక్కులను కాపాడడం కోసం వైయ‌స్ఆర్‌సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని, రైతులకు అన్యాయం జరిగే ప్రతి అంశంపై పోరాటం కొనసాగిస్తామని సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ స్పష్టం చేసింది.

ఈ సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు అంబటి రాంబాబు, లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌ కుమార్‌, నందిగం సురేష్‌, దేవినేని అవినాష్‌, దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్రబాబు, ఎం. మనోహర్‌ రెడ్డి, కొమ్మసాని శ్రీనివాస రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.

Back to Top