పంతం నానాజీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్‌

వైయ‌స్ఆర్ జిల్లా: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన నాయకుడు పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలను వైయ‌స్ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్టీ నాయకులపై వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని, వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం ప్రొద్దుటూరులో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులపై మాట్లాడేటప్పుడు హుందాతనం పాటిస్తారని, వ్యక్తిగతంగా అవమానించే పదజాలం ఉపయోగించరని పేర్కొన్నారు. అలాంటి నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమన్నారు. వైయ‌స్ జగన్ ధైర్యసాహసాల గురించి మాట్లాడే ముందు దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకోవాలని నానాజీకి సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా రాజకీయంగా పోరాడిన నాయకుడు వైయ‌స్ జగన్ అని పేర్కొన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై ఉపయోగించిన పదజాలాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు. ఇతరులను విమర్శించే ముందు తమ నాయకుల వ్యాఖ్యలను కూడా పరిశీలించుకోవాలని హితవు పలికారు. వైయ‌స్ఆర్‌సీపీలో కొనసాగుతున్న కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలను కించపరిచేలా మాట్లాడటం బాధాకరమన్నారు. కాపు సమాజాన్ని అవమానించేలా ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు. రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగత దూషణలు, సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. జగన్‌పై చేసిన వ్యాఖ్యలను పంతం నానాజీ వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
 

Back to Top