తాడేపల్లి: గాదె సాయికృష్ణ కేసు విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అనుసరిస్తున్న వైఖరి అత్యంత దారుణంగా ఉందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆక్షేపించారు. ఈ కేసులో తొలి నుంచి సాక్ష్యాధారాలను పక్కా ప్రణాళికతో మాయం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. తాజాగా కృష్ణలంక పీఎస్‌లో సీసీ ఫుటేజ్ మాయం అందుకు నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని స్పష్టం చేశారు. ఈ కేసులో బాధితులకు న్యాయం జరగాలంటే సీబీఐకి అప్పగించాల్సిందే అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వంగవీటి నరేంద్ర తేల్చి చెప్పారు. ప్రెస్‌మీట్‌లో వంగవీటి నరేంద్ర ఇంకా ఏం మాట్లాడారంటే..: - సీసీ ఫుటేజ్ మాయం!. పెద్దల హస్తం?: సాయికృష్ణ కేసు వెలుగులోకి వచ్చాక పోలీసుఅధికారులు స్వయంగా రంగంలోకి దిగి, ఒక కానిస్టేబుల్‌ను భయపెట్టి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని డిలీట్ చేయించారు. కృష్ణలంక పీఎస్ నుంచి స్వర్ణపురి వరకు దాదాపు 30కి పైగా హైరిసొల్యూషన్ సీసీ కెమెరాలు ఉన్నాయి. అంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఎక్కడా ఫుటేజీ లభ్యం కాకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. సాక్ష్యాలను చెరిపేయడానికి పోలీసు అధికారులు ముందస్తు ప్లాన్ వేసుకున్నారని స్పష్టమవుతోంది. - అన్ని ఆధారాల ధ్వంసం: ఈ కేసులో కనీస చట్టపరమైన నిబంధనలను కూడా పాటించలేదు. నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు ఉండాల్సిన ’అరెస్ట్ మెమో’ గానీ, అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు చేయించిన మెడికల్ చెకప్ రిపోర్టులు గానీ, సీసీటీవీ ఫుటేజీల బ్యాకప్ గానీ ఏ ఒక్క డాక్యుమెంట్‌నూ పోలీసులు ప్రొడ్యూస్ చేయకపోవడం అనేక అనుమానాలకు తావునిస్తోంది. ఒక వ్యక్తిని చంపేసి, కాల్చి బూడిద చేసిన తర్వాత.. సాక్ష్యాధారాలు లేకుండా కేసును క్లోజ్ చేయాలని చూస్తున్నారు. - ఉన్నతాధికారుల పాత్రపై దర్యాప్తు జరగాలి: సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇప్పుడు ఏమయ్యారు? విజయవాడ పోలీస్ కమిషనర్ (సీపీ) ప్రమేయం లేకుండా, ఆయనకు సమాచారం లేకుండానే టాస్క్ ఫోర్స్ పోలీసులు అంత దూరం వెళ్లి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారా? కేవలం సీఐ నాగరాజును మాత్రమే అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఆ రోజు కృష్ణలంక స్టేషన్‌లో ఉన్న మొత్తం సిబ్బందిని నిందితులుగా చేర్చాలి. విజయవాడ సీపీ, రాష్ట్ర డీజీపీని కూడా ఈ కేసులో బాధ్యులను చేయాలి. వారిని కూడా దర్యాప్తు పరిధిలోకి తీసుకురావాలి. - పవన్‌కళ్యాణ్ బాధ్యతా రాహిత్య మాటలు: ఇంతటి దారుణమైన ఘటన జరిగినా సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, డీజీపీ కానీ, ఎందుకు ఒక్క ప్రెస్‌మీట్ కూడా పెట్టలేదు? మరోవైపు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఒక సమావేశంలో మాట్లాడుతూ, ఒక రౌడీషీటర్ విషయంలో స్పందించాలా? అనడం ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. ఇంకా గతంలో చిత్తూరులో రాము అనే బీసీ వ్యక్తిపై దాడి జరిగినా, విజయనగరంలో కళావతి, కర్నూలు జిల్లాలో గంగమ్మ, శ్రీకాకుళంలో తిరుపతమ్మపై దాడి జరిగినా పవన్ ఇప్పటి వరకు నోరు మెదపలేదు. ఎన్నికల ముందు సుగాలీ ప్రీతి కేసులో న్యాయం చేస్తానని హామీ ఇచ్చి, గెలిచిన తర్వాత, అది తన శాఖ పరిధిలో లేదని చెప్పడం అనైతికం. ఇంకా ఆ కేసులో గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేశారని చెప్పడం అత్యంత హేయం. అంత కంటే పచ్చి అబద్ధం, దిగజారుడుతనం మరొకటి ఉండదు. సుగాలిప్రీతి ఘటన జరిగింది.. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో. ఆ కేసులో సాక్ష్యాధారాలన్నీ మార్చేసింది కూడా ఆ ప్రభుత్వ హయాంలోనే. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి పవన్‌కళ్యాణ్ మద్దతునిచ్చారు. వాస్తవాలన్నీ అలా ఉన్నా, పవన్‌కళ్యాణ్ కూడా అచ్చం సీఎం చంద్రబాబు మాదిరిగా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. - తన పార్టీకి చెందిన వ్యక్తి అయినా..: పోలీసుల కస్టోడియల్ డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ జనసేన పార్టీకి చెందిన వ్యక్తి అని చెబుతున్నారు. ఆ పార్టీ కార్యకర్తగా కూడా ప్రచారం జరుగుతోంది. సాయికృష్ణ కుటుంబంలో దాదాపు 22 మంది సభ్యులు కూటమి అధికారంలోకి రావాలని జనసేనకు ఓటు వేశారు. ఆ కుటుంబంలోని ఒక వ్యక్తిని పోలీసులు చంపేసినా పవన్‌కళ్యాణ్, ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగా మాట్లాడకపోవడం దారుణం. పైగా చనిపోయిన వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడడం అత్యంత హేయం. - వారిపైనా చర్యలుండాలి. కేసు సీబీఐకి ఇవ్వాలి: ఈరోజు ఆ కన్నతల్లి రోదన, ఆవేదన ఈ ప్రభుత్వానికి కానీ, పవన్‌కళ్యాణ్‌కు కానీ వినిపించడం లేదా? ఇప్పటికైనా పవన్‌కళ్యాణ్ ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయడానికి చొరవ చూపాలి. లాకప్‌డెత్, ఆ తర్వాత పరిణామాలన్నీ కేవలం సీఐ స్థాయిలో జరిగినవి కానేకావు. ఇందులో కచ్చితంగా పోలీస్ బాస్‌లు.. విజయవాడ నగర సీపీ, డీజీపీ ప్రమేయం ఉంది. కాబట్టి వారిపైనా తగిన చర్యలు తీసుకోవాలి. ముందుగా వారిద్దరినీ సస్పెండ్ చేయాలి. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదు కాబట్టి, కచ్చితంగా కేసును సీబీఐకి అప్పగించాలి. అలాగే గాదె సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ తరపున పోరాడుతూనే ఉంటామని వంగవీటి నరేంద్ర చెప్పారు.