ప్రజలతో మమేకమైన వైయస్ జగన్‌

క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ 

 జై జగన్‌ నినాదాలతో మార్మోగిన పులివెందుల

వైయ‌స్ఆర్ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మంగళవారం పులివెందులలో ప్రజలతో మమేకమయ్యారు. సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయన భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి అభిమానులు, పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలు, బాధితులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. క్యాంపు కార్యాలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు, మహిళలు, యువత, వృద్ధులు, దివ్యాంగులు, అభిమానులను వైయస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. తెలిసిన ప్రతి కార్యకర్తను పేరు పేరునా పలకరిస్తూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నేతల వేధింపులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల సమస్యలను విని వారికి ధైర్యం చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పార్టీ అండగా ఉంటుందని, తాను అండగా నిలుస్తానని భరోసా కల్పించారు.

ప్రజాదర్బార్ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అభిమానుల కోరిక మేరకు పలువురితో సెల్ఫీలు దిగుతూ, ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు.

జై జగన్ నినాదాలతో హోరెత్తిన క్యాంపు కార్యాలయం

వైయస్ జగన్ పులివెందులకు వస్తున్నారనే సమాచారంతో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు, యువత, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు భారీగా హాజరయ్యారు. క్యాంపు కార్యాలయ ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసిపోయింది. వైయస్ జగన్‌ను చూడగానే అభిమానులు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. క్యాంపు కార్యాలయం మొత్తం పార్టీ శ్రేణుల సందడితో మార్మోగింది.

ఆయేషాను పరామర్శించిన వైయస్ జగన్

పులివెందుల హెలీప్యాడ్ నుంచి భాకరాపురంలోని క్యాంపు కార్యాలయానికి వెళ్తున్న సమయంలో భాకరాపురానికి చెందిన ఆయేషాను వైయస్ జగన్ పరామర్శించారు. బ్రెయిన్ టీబీతో బాధపడుతున్న ఆయేషాకు మూడేళ్ల క్రితం వైద్య సహాయం అందించిన వైయస్ జగన్, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని తెలుసుకుని కాన్వాయ్‌ను ఆపి స్వయంగా దిగివచ్చి ఆమెను పరామర్శించారు.

ఆయేషా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వైయస్ జగన్, అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయేషా భర్త బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ, “వైయస్ జగన్ దయ వల్లే గతంలో మెరుగైన వైద్యం అందింది. ఆయన చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేం” అని కృతజ్ఞతలు తెలిపారు.

పలువురు ప్రజాప్రతినిధుల భేటీ

పులివెందుల పర్యటన సందర్భంగా వైయస్ జగన్‌ను ఎంపీ వైయస్‌ అవినాష్‌ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి పార్టీ కార్యక్రమాలు, స్థానిక పరిస్థితులపై చర్చించారు. ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలు తెలుసుకుంటున్న జననేతకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

Back to Top