తాడేపల్లి : వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన 'మావిగన్' (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) కారిడార్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సరైన నమూనా అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, మావిగన్ ప్రతిపాదనను ప్రజలు స్వాగతిస్తుండటంతోనే టీడీపీ కూటమి ఆందోళన చెందుతోందని విమర్శించారు. అమరావతి, మావిగన్ మధ్య తేడాను వైయస్ జగన్ ఇప్పటికే పలుమార్లు వివరించారని సజ్జల అన్నారు. ప్రభుత్వ భూములతో, ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, పోర్టు, విమానాశ్రయం, జాతీయ రహదారుల అనుసంధానంతో తక్కువ వ్యయంతో అభివృద్ధి సాధ్యమయ్యే నమూనానే మావిగన్ అని చెప్పారు. అమరావతి నిర్మాణం పేరుతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం మోపుతుందని, అదే నిధులతో పోర్టులు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, మెడికల్ కాలేజీలు, పోలవరం, వెలిగొండ నిర్వాసితుల సమస్యలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి కీలక అవసరాలను పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. రాజధాని విషయంలో స్థిరత్వం లేదని వైయస్ఆర్‌సీపీపై విమర్శలు చేసే టీడీపీ నేతలే గతంలో అమరావతి, వికేంద్రీకరణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని సజ్జల గుర్తుచేశారు. అమరావతి అంశంపై గతంలో కూటమి నాయకులు చేసిన వ్యాఖ్యల వీడియోలను కూడా మీడియా సమావేశంలో ప్రదర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ వంటి గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులను ఇప్పుడు మళ్లీ తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం క్రెడిట్ చోరీ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. అమరావతి పేరుతో ప్రజలపై అప్పుల భారం మోపుతూ, రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెడుతున్నారని ఆరోపించిన సజ్జల, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎప్పుడూ రాజీపడదని స్పష్టం చేశారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి, మట్టి మాఫియా, ప్రజాధన దుర్వినియోగంపై ప్రశ్నిస్తూనే ఉంటామని, రైతుల హక్కులు, రాష్ట్ర సమతుల్య అభివృద్ధి కోసం పార్టీ పోరాటం కొనసాగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.