రోజురోజుకీ ముదురుతున్న పొగాకు రైతుల సంక్షోభం 

ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రైతులను ఆదుకోవాలి

వైయ‌స్ఆర్‌సీపీ నేత యం.వి.ఎస్. నాగిరెడ్డి డిమాండ్‌

తాడేప‌ల్లి: రాష్ట్రంలో పొగాకు రైతుల సంక్షోభం రోజురోజుకీ మరింత తీవ్రరూపం దాల్చుతోందని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్  యం.వి.ఎస్. నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సమక్షంలో పొగాకు బోర్డు అధికారులు, కొనుగోలు కంపెనీలతో సమీక్ష నిర్వహించి తక్కువ ధరలు, "నో బిడ్" పరిస్థితులు ఉండకూడదని సూచించినప్పటికీ, పొగాకు ధరలు మరింత పతనమవుతున్నాయని విమర్శించారు.

2023-24 మార్కెటింగ్ సీజన్‌తో పోలిస్తే ప్రస్తుతం కిలోకు సగటున రూ.67 వరకు రైతులు నష్టపోతున్నారని, పెరిగిన సాగు వ్యయాన్ని కలుపుకుంటే నష్టం మరింత ఎక్కువగా ఉందన్నారు. 2023-24లో సగటు ధర కిలోకు రూ.288.65 ఉండగా, ప్రస్తుతం అది రూ.221.30కు పడిపోయిందని పేర్కొన్నారు. ఒంగోలు, వెల్లంపల్లి, కందుకూరు, కనిగిరి వంటి పలు వేలం కేంద్రాల్లో సగటు ధర రూ.180–200 మధ్యకు పడిపోవడం రైతులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందన్నారు.

రైతులు ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించలేదని నాగిరెడ్డి విమర్శించారు. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లు నిర్వహించి మార్కెట్‌లో పోటీ వాతావరణం కల్పించామని గుర్తు చేశారు. ప్రస్తుతం రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నా అలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. మంచి దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తి ఉన్నప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, ధరలు రోజురోజుకీ కుప్పకూలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేయాలని, పొగాకు రైతులను ఆదుకునేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలని యం.వి.ఎస్. నాగిరెడ్డి డిమాండ్ చేశారు.
 

Back to Top