"స‌ర్" గ‌డువు మ‌రో నెల రోజులు పొడిగించాలి

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ 

వైయ‌స్ఆర్​ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి 

నిర్ల‌క్ష్యం, లోప‌భూయిష్టంగా రాష్ట్రంలో స‌ర్ ప్ర‌క్రియ‌

21 రోజులైనా 48 శాత‌మే పూర్త‌యిన డిజిట‌లైజేష‌న్‌

9 రోజుల్లో మ‌రో 52 శాతం పూర్తి చేయ‌డం అసాధ్యం

చాలా ప్రాంతాల్లో ఎన్యుమ‌రేష‌న్ ఫారాలు అంద‌నేలేదు

ఓట‌ర్ల‌కు ఎక్‌నాలెజ్డ్ మెంట్ స్లిప్‌లు ఇవ్వడం లేదు

లోపాల‌ను ఎత్తి చూపిన లేళ్ల అప్పిరెడ్డి 

వైయ‌స్ఆర్‌సీపీ ఓట్ల తొల‌గింపే ల‌క్ష్యంగా కూట‌మి కుట్ర‌లు

బీఎల్ఓల‌పై టీడీపీ నాయ‌కుల ఒత్తిడి, బెదిరింపులు

బీఎల్ఓలు ఫిర్యాదు చేస్తున్నా చ‌ర్య‌లు తీసుకోని వైనం

స‌ర్ ప్ర‌క్రియ‌ను అత్యంత పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించాలి

అర్హ‌త ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ ఓటు హ‌క్కు క‌ల్పించాలి

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ 

తాడేప‌ల్లి:  రాష్ట్రంలో స‌ర్ ప్ర‌క్రియ కోసం కేటాయించిన గడువును మ‌రో నెలపాటు పొడిగించాల‌ని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఎన్నిక‌ల క‌మిష‌న్ చెప్పిన లెక్క‌ల ప్ర‌కార‌మే 21 రోజులైనా డిజిట‌లైజేష‌న్ ప్ర‌క్రియ 48 శాత‌మే పూర్త‌యింద‌ని, మిగిలిన 9 రోజుల్లో 52 శాతం పూర్తి చేయ‌డం సాధ్య‌మ‌య్యే ప‌నికాదన్నారు. అంతేకాకుండా స‌ర్ ప్రక్రియ‌లో అడుగడుగునా జ‌రుగుతున్న నిర్ల‌క్ష్యం, ప‌క్షపాత ధోర‌ణిని ఆయ‌న ప్ర‌శ్నించారు. అధికార టీడీపీ నాయ‌కులు, వైయ‌స్ఆర్‌సీపీ ఓట్ల‌ను తొల‌గించేలా బీఎల్ఓల‌పై ఒత్తిడి తెస్తున్నార‌ని ఆరోపించారు. న‌ర‌స‌రావుపేట‌లో ఒక బీఎల్ఓ.. టీడీపీ బీఎల్ఏపై ఫిర్యాదు చేసినా చ‌ర్య‌లు తీసుకోకుండా అధికారులు రాజీ చేసుకోవాల‌ని ఒత్తిడి చేస్తున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. దీంతోపాటు టీడీపీ బీఎల్ఏల‌తో మంత్రి నారాయ‌ణ టెలీ కాన్ఫ‌రెన్స్ ఏర్పాటు చేసుకుంటే అందులో మున్సిప‌ల్ క‌మిష‌న్ పాల్గొని మైటీడీపీ యాప్ బాగుంద‌ని, దాన్ని వినియోగించుకోవాల‌ని సూచించ‌డం అధికారుల టీడీపీ అనుకూల వైఖ‌రికి నిద‌ర్శ‌న‌మ‌ని మండిప‌డ్డారు. స‌ర్ ప్రక్రియ‌లో క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న త‌ప్పులు, లోపాలు, బెదింపులు, చ‌ట్టాల ఉల్లంఘ‌న‌ల‌పై ఎప్పటికప్పుడూ ఎన్నిక‌ల క‌మిష‌న్‌కి ఫిర్యాదు చేస్తున్నామ‌ని, దీంతోపాటు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి కూడా ఫిర్యాదులు పంపిస్తున్నాని అప్పిరెడ్డి చెప్పారు. ఇప్ప‌టికైనా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ త‌క్ష‌ణం స్పందించి స‌ర్ ప్ర‌క్రియ పాద‌ర్శ‌కంగా జ‌రిగేలా లోపాల‌ను స‌రిదిద్దాల‌ని కోరారు. వారు స్పందించ‌కుంటే వైయ‌స్ఆర్‌సీపీ న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యిస్తుంద‌ని ఎమ్మెల్యే  లేళ్ల అప్పిరెడ్డి స్ప‌ష్టం చేశారు. 

ఆయ‌న ఇంకా ఏం మాట్లాడారంటే...

- లోప‌భూయిష్టంగా స‌ర్ ప్రక్రియ‌

స‌ర్ ప్ర‌క్రియ కార‌ణంగా ల‌క్ష‌లాది మంది త‌మ ఓటు హ‌క్కును కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తోంది. అడుగ‌డుగునా నిర్ల‌క్ష్యం, ప‌క్ష‌పాత ధోర‌ణితోవైయ‌స్ఆర్‌సీపీ ఓట్ల‌ను ఎలా తొల‌గించాల‌నే కుట్ర జ‌రుగుతోంది. ఫారాల పంపిణీ బాధ్య‌త‌ల‌ను టీడీపీ బీఎల్ఏలకు అప్ప‌గిస్తున్నారు. 
అధికారులే టీడీపీ ఆఫీసుల‌కు వెళ్లి అక్క‌డే కూర్చుని ప‌నిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌కు అనుకూలంగా అధికారులు ప‌నిచేస్తున్నార‌ని ప‌లు ఆధారాలను ఎన్నిక‌ల క‌మిష‌న్‌కి ఇవ్వ‌డం జ‌రిగింది. అధికార కూట‌మి నాయ‌కులు స‌ర్ ప్రక్రియ‌ను ఏ విధంగా త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌ని క‌లిసి ఎప్ప‌టిక‌ప్పుడు ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. రాష్ట్ర ఎన్నిక‌ల కమిష‌న్‌కి ఇచ్చిన ప్ర‌తి ఫిర్యాదును కూడా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపించ‌డం జ‌రిగింది. అవ‌స‌ర‌మైతే న్యాయ‌స్థానం త‌లుపు త‌ట్ట‌డానికి కూడా వైయ‌స్ఆర్‌సీపీవెనుకాడ‌దు. బాధ్య‌తా రాహిత్యంతో వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌భుత్వ ఉద్యోగుల తీరును కూడా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్ల‌డం జ‌రిగింది.

- టీడీపీతో అధికారులు చెట్ట‌ప‌ట్టాలు 

మంత్రి నారాయ‌ణ‌తో టీడీపీ బీఎల్ఏలు టెలీకాన్ప‌రెన్స్ నిర్వ‌హించుకోవడం  దానిలో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పాల్గొని మైటీడీపీ యాప్ బాగుంద‌ని చెప్ప‌డం, అంద‌రూ దాన్నే వాడుకోవాల‌ని సూచించ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఇవ‌న్నీ చూస్తుంటే ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం వైయ‌స్ఆర్‌సీపీ ఓట్ల‌ను తొలగించ‌డ‌మే ల‌క్ష్యంగా అధికారుల‌ను వాడుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. పూర్తి చేసిన ఫారాల‌ను టీడీపీ బీఎల్ఏలకి ఇస్తే వారు సంత‌కం పెడితే డిజిట‌లైజ్ చేయాల్సిందిగా పైనుంచి ఆదేశాలు వ‌స్తున్నాయ‌ని బీఎల్ఓలు చెబుతున్నారు. తెలుగుదేశం ఆఫీసుల‌కు చేరి వారు యాప్‌లో రిజిస్ట‌ర్ చేసుకున్న త‌ర్వాత ప్ర‌భుత్వ ఆఫీసుల‌కు వ‌స్తున్నాయి. న‌ర‌స‌రావుపేట‌లో 118 పోలింగ్ స్టేష‌న్ ప‌రిధిలో తెలుగుదేశం బీఎల్ఏ బెదిరిస్తున్నాడ‌ని ఒక బీఎల్ఓ వెళ్లి కేసు పెడితే అధికారులు రాజీ చేయ‌డానికి ఆయ‌న‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇంకెంతమంది బీఎల్ఓలు, టీడీపీ నాయ‌కుల బెదిరింపుల‌కు భ‌య‌ప‌డి ఒత్తిడితో ప‌నిచేస్తున్నారో అర్థం అవుతుంది. 

- డిజిట‌లైజేష‌న్ ప్ర‌క్రియ 48 శాత‌మే పూర్తి 

రాష్ట్రంలో జూన్ 15న ప్రారంభ‌మైన స‌ర్ ప్ర‌క్రియ జూలై 14 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ చెబుతోంది. రాష్ట్రంలో 99.11 శాతం ఎన్యుమ‌రేష‌న్ ఫారాలు ఇంటింటికీ పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని ఎన్నిక‌ల కమిష‌న్ స్వ‌యంగా వెల్ల‌డించింది. కానీ వాస్త‌వం చూస్తే ఇప్ప‌టికీ త‌మ ఇళ్ల‌కు ఎన్యుమ‌రేష‌న్ ఫారాలు రాలేద‌ని చాలా మంది చెబుతున్నారు. 2002 ఓట‌ర్ లిస్టుతో 2025 ఓట‌ర్ లిస్ట్ మ్యాపింగ్ చేయ‌బోతుంటే ఓట్లు గ‌ల్లంత‌య్యాయ‌న్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నా స‌మ‌స్య‌ల పరిష్కారం దిశ‌గా అధికారులు దృష్టి పెట్ట‌డం లేదు. స‌ర్ ప్ర‌క్రియ‌లో ఇప్ప‌టికే 21 రోజులు పూర్త‌యింది. 4,12,57,989 ఎన్యుమ‌రేష‌న్‌ ఫారాలు పంపిణీ చేస్తే డిజిట‌లైజ్ ప్ర‌క్రియ 48.86 శాతం మాత్ర‌మే పూర్త‌యింది. మిగ‌తా 9 రోజుల్లో 52 శాతం డిజిట‌లైజేష‌న్ చేయ‌డం సాధ్య‌మేనా అనే అనుమానం క‌లుగుతోంది. ఎన్యుమ‌రేష‌న్ ఫారాలు నింపే విష‌యంలో ఓట‌ర్లు ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నా, అధికారులు అవగాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం లేదు. ఎన్నిక‌ల క‌మిష‌న్ తీసుకొచ్చిన యాప్ స‌రిగా ప‌నిచేయ‌క ఓట‌ర్లు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. మ‌రోవైపు గ్రామీణ‌, కొండ ప్రాంతాల్లో ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం అందుబాటులో లేని ప‌రిస్థితులు స‌ర్ ప్రక్రియ‌కు అవ‌రోధంగా క‌నిపిస్తున్నాయి. ఎన్యుమ‌రేష‌న్ ఫారాలు తీసుకున్న త‌ర్వాత బీఎల్ఓలు సంత‌కం చేసిన ఎక్‌నాలెడ్జ్‌మెంట్ రిసిప్ట్‌లు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వ‌డం లేదు. 

- మ‌రో నెల రోజులు పొడిగించాలి
 
స‌ర్ ప్రక్రియ‌ను నిష్పక్ష‌పాతంగా నిర్వ‌హించాలి. అర్హ‌త ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ  ఓటు హ‌క్కు క‌ల్పించాలి. వైయ‌స్సార్సీపీ ఓట్ల‌ను తొలగించాల‌న్న 
టీడీపీ కుట్ర‌ల‌ను అడ్డుకోవాలి. ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించిన నెల రోజుల స‌మ‌యం స‌రిపోదు. కాబ‌ట్టి స‌ర్ ప్ర‌క్రియ‌ను మ‌రో నెల రోజులు పొడిగించాలని వైయ‌స్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తెచ్చే విధంగా ఇప్ప‌టికైనా ఎన్నిక‌ల క‌మిష‌న్ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను  
నిర్వ‌హించాలి. హ‌డావుడిగా స‌ర్ ప్ర‌క్రియ‌ను ముగించాల‌ని ఒక పక్క ఎన్నిక‌ల క‌మిష‌న్‌, మ‌రో ప్ర‌క్ర ప్ర‌భుత్వం ఉంది. కాబ‌ట్టి ఆంధ్ర‌రాష్ట్రంలో ఓటు ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి. మ‌న ఓటును మ‌న‌మే కాపాడుకునేలా స‌ర్ ప్ర‌క్రియ‌లో భాగం కావాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

Back to Top