రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి కడప ఉక్కు పరిశ్రమ మైలురాయి

ఎన్నో ఏళ్ల నిబద్ధత, నిరంతర శ్రమ వల్లే ఇలాంటి భారీ పరిశ్రమలు సాకారం 

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వెల్లడి 

మా ప్రభుత్వ హయాంలోనే జేఎస్‌డబ్ల్యూను ప్రాజెక్ట్‌ డెవలపర్‌గా ఖరారు చేశాం 

భూ కేటాయింపులు, పర్యావరణ అనుమతి సాధన, నీటి కేటాయింపులు, రోడ్ల సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించాం 

అన్ని రకాల అనుమతులు వేగంగా ఇచ్చాం 

దాంతో మా హయాంలో పరిశ్రమ పనులు అత్యంత వేగంగా ముందుకు సాగాయి 

ఆ తర్వాత రెండేళ్లుగా ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోవడం అత్యంత విచారకరం 

ఎట్టకేలకు ఇప్పుడు పనులు పునఃప్రారంభం కావడం శుభ పరిణామం.. జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌కు, ఆ సంస్థ బృందానికి అభినందనలు  

అమరావతి: వైఎస్సార్‌ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ (స్టీల్‌ ప్లాంట్‌) నిర్మాణ పనులు పునఃప్రారంభం కావడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌  హర్షం వ్యక్తం చేశారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌కు, ఆ సంస్థ బృందానికి ఆయన తన హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు. రాయలసీమ పారిశ్రామికాభి­వృద్ధిలో ఇది ఒక చరిత్రాత్మక మైలురాయని.. స్థానిక యువతకు ఉపాధి, ఆర్థిక వృద్ధిని అందించే ఒక గొప్ప ఆశాకిరణం అంటూ శుక్రవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉక్కుపరిశ్రమ పనులు ప్రారంభించిన ఫొటోను ఆ పోస్టుకు జత చేశారు. అందులో ఏమన్నారంటే..  

మా ప్రభుత్వ హయాంలోనే బలమైన పునాదులు 
‘ఇలాంటి భారీ ప్రణాళికలు ఎన్నో ఏళ్ల నిబద్ధతతో కూడిన నిరంతర శ్రమ వల్ల మాత్రమే సాకారం అవుతాయి. మా ప్రభుత్వ హయాంలోనే జేఎస్‌డబ్ల్యూ సంస్థను ప్రాజెక్ట్‌ డెవలపర్‌గా ఖరారు చేసి, పరిశ్రమకు అవసరమైన కీలకమైన పునాదులన్నీ వేశాం. పర్యావరణ అనుమతుల సాధన, అవసరమైన నీటి కేటాయింపులు, భూమి కేటాయింపులతో పాటు రహదారి సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలకు అవసరమైన స్థలాలను సమకూర్చి అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు, ఆమోదాలను వేగంగా ఇచ్చాం. ఈ బలమైన పునాదుల కారణంగానే మా ప్రభుత్వ హయాంలో పనులు అత్యంత వేగంగా ముందుకు సాగాయి.  

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో స్టీల్‌ ప్లాంట్‌ పనుల ప్రారంభం సందర్భంగా సజ్జన్‌ జిందాల్‌ను సత్కరిస్తున్న అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ (ఫైల్‌) 

రెండేళ్ల జాప్యం దురదృష్టకరం  
గడిచిన రెండేళ్ల కాలంలో ఈ కీలక ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచి పోవడం అత్యంత విచారకరం. దీనివల్ల రాయలసీమ ప్రజలు ఆశించిన పెట్టుబడులు మరింత ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు ఇప్పుడు పనులు పునఃప్రారంభం కావడం శుభ పరిణామం. ఇప్పటికే వైఎస్సార్‌ కడప జిల్లా ప్రజలు ఉక్కు పరిశ్రమ కోసం ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నారు. ఇకపై ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ ఉక్కు కర్మాగారాన్ని సత్వరమే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వైఎస్సార్‌ కడప నా సొంత జిల్లా కావడంతో నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి యువతకు స్థిరమైన ఉపాధి, పారిశ్రామిక ప్రగతి దక్కాలన్నదే నా నిరంతర ఆకాంక్ష.  

    స్టీల్‌ ప్లాంట్‌ పనుల ప్రారంభం సందర్భంగా పూజలో పాల్గొన్న నాటి సీఎం వైఎస్‌ జగన్‌ (ఫైల్‌) 

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి 
అభివృద్ధి అనేది రాజకీయ సరిహద్దులు, విభేదాల­కు అతీతంగా సాగాల్సిన ఒక నిరంతర ప్రక్రి­య. ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా గత ప్రభుత్వాలు చేపట్టిన పనులను ముందుకు తీసుకెళ్తూ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఈ ఉక్కు పరిశ్రమ పనులను అత్యంత వేగంగా పూర్తి చేసి, వైఎస్సార్‌ కడప జిల్లాతో పాటు సమగ్ర రాయలసీమ ప్రాంతానికి పారిశ్రామిక విప్లవాన్ని, అందరికీ సమ్మిళిత అభివృద్ధిని అందించాలని ఆకాంక్షిస్తున్నా’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.  

              స్టీల్‌ ప్లాంట్‌ నమూనాను పరిశీలిస్తున్న నాటి సీఎం వైఎస్‌ జగన్‌ (ఫైల్‌) 

Back to Top