ఎస్‌ఐఆర్ ప్రక్రియలో జాప్యాన్ని వెంటనే నివారించాలి 

 డీఆర్వోకు వినతిపత్రం అందజేసిన కాకాణి, ప్రసన్నకుమార్ రెడ్డి 

 నెల్లూరు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ అమలులో జరుగుతున్న జాప్యాన్ని వెంటనే నివారించాలని కోరుతూ మాజీ మంత్రులు, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు  కాకాణి గోవర్ధన్ రెడ్డి , పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో  ఎన్. విజయకుమార్ కు వినతిపత్రం అందజేశారు.

కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జూన్ 15 నుంచి ఎస్‌ఐఆర్ కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ, బీఎల్‌ఓల కొరత, డిప్యూటేషన్‌లు, సాంకేతిక సమస్యలు, కంప్యూటర్‌పై అవగాహన లేకపోవడం వంటి కారణాలతో ఎన్యూమరేషన్ ఫారాల అప్‌లోడ్ ప్రక్రియ మందగించిందని వివరించారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో కేవలం 31 శాతం ఫారాలే అప్‌లోడ్ అయ్యాయని, రెండు గ్రామాల పరిధిలో ఉన్న హామ్లెట్లను సంబంధిత గ్రామాల ఓటరు జాబితాలకు అనుసంధానం చేయాలని కోరారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలంటే అదనపు సిబ్బందిని నియమించి, సాంకేతిక సహాయాన్ని అందించాలని వారు డీఆర్వోను కోరారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి  వీరి చలపతిరావు , జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు  పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
 

Back to Top