‘మావిగన్‌’ పేరెత్తితే టీడీపీ కూటమిలో వణుకు 

:శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్‌

అవినీతి సంపాదనకు గండి పడుతుందని చంద్రబాబుకి భయం 

:శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి 

రాజధానిపై ఎప్పుడైనా శ్రీ వైయస్‌ జగన్‌ది ఒకేమాట

ప్రభుత్వ భూముల్లో నిర్మాణంతో ఖర్చు తగ్గుతుంది

అమరావతిపై వైఖరి మార్చుకుంది కూటమి నాయకులే 

చంద్రబాబు సైతం అమరావతిని మున్సిపాలిటీ అంటున్నాడు  

:గుర్తు చేసిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి

‘మావిగన్‌’కు పెరిగిన ప్రజల మద్దతు

దీంతో మాట మార్చిన సీఎం చంద్రబాబు

అది అమరావతిలోనే ఉందంటూ కబుర్లు

సీఆర్డీఏ పరిధిలోనే అంటూ భ్రమింపజేస్తున్నారు

అమరావతి అనేది భారీ రియల్‌ ఎస్టేట్‌ స్కామ్‌

:ప్రెస్‌మీట్‌లో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ

తాడేపల్లి:’మావిగన్‌’ పేరెత్తితేనే చంద్రబాబు కూటమిలో వణుకు పుడుతోందని, అవినీతి సంపాదనకు గండి పడుతుందనే భయం వారికి పట్టుకుందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. అమరావతిపై శ్రీ వైయస్‌ జగన్‌ది ఎప్పుడూ ఒకే మాట అన్న ఆయన, దానిపై పూటకో స్టాండ్‌ మార్చుకున్నది కూటమి నాయకులేనని స్పష్టం చేశారు. మావిగన్‌కు ప్రజా మద్దతు పెరగడంతో మాట మార్చిన సీఎం చంద్రబాబు, అది కూడా అమరావతి పరిధిలోనే ఉందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆక్షేపించారు.
    ఒకప్పుడు ప్రపంచ స్థాయి నగరం అన్న చంద్రబాబు, ఇప్పుడు రెండో విడత ల్యాండ్‌ పూలింగ్‌ కోసం అమరావతిని ఒక ’చిన్న మున్సిపాలిటీ’ అనడం చంద్రబాబు ద్వంద్వ విధానానికి నిదర్శనమని చెప్పారు. నిజానికి పుణ్యక్షేత్రమైన అమరావతి ఆ పక్కన ఎక్కడో దూరంగా ఉండగా, అదే పేరుతో రాజధాని నిర్మాణం అంటూ, కేవలం సీఆర్డీఏ పరిధి పేరుతో భ్రమలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేలా రూ.2 లక్షల కోట్ల భారీ రియల్‌ ఎస్టేట్‌ కుంభకోణానికి తెర లేపారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
ప్రెస్‌మీట్‌లో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

అదే చంద్రబాబు విధానం. సూత్రం:
    వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతంలో రాజధాని నిర్మాణం పేరుతో చదరపు అడుగుకి రూ.20 వేల చొప్పున ఖర్చు చేస్తూ, అడ్డగోలుగా అంచనాలు పెంచుతూ, కాంట్రాక్టర్లకు ముందే మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు ఇచ్చుకుంటూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. ఆ దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, చాలా తక్కువ ఖర్చుతో పూర్తయ్యే రాజధాని ‘మావిగన్‌’ ప్రతిపాదించారు. అమరావతిలో చేస్తున్న  ఖర్చులో కేవలం 10 శాతంతో, 10 రెట్లు వేగంగా వృద్ధి చెందేలా ’మావిగన్‌’ కాన్సెప్ట్‌ను ముందుకు తెచ్చారు. కానీ, లాభాలు వచ్చే పోర్టులు, మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌కు అప్పగించి, రాష్ట్రాన్ని ముంచే అప్పుల భారాన్ని మాత్రం జనం మీద వేయడమే చంద్రబాబు విధానం. సూత్రం. రాజధానిలో ప్రధాన స్టేక్‌హోల్డర్లయిన భూములిచ్చిన రైతులకు తీవ్ర అన్యాయం చేస్తూ, వారి లేఅవుట్ల అభివృద్ధిని చివరి ప్రాధాన్యతగా మార్చారు.

అమరావతిపై శ్రీ వైయస్‌ జగన్‌కు స్పష్టత:
    అమరావతిపై అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇచ్చినప్పటి నుంచి నేటి వరకు వైయస్‌ జగన్‌ గారి స్టాండ్‌లో పూర్తి స్పష్టత ఉంది. కానీ చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, పురందేశ్వరి సహా కూటమి నాయకులే పూటకో మాట మారుస్తున్నారు. జగన్‌గారు మావిగన్‌ను ప్రతిపాదించగానే చంద్రబాబు కూటమిలో వణుకు పుడుతోంది. వారికి పడరాని చోట గట్టి దెబ్బ పడింది. అందుకే ఉలిక్కిపడిన చంద్రబాబు.. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కూడా మావిగన్‌లో భాగమేనంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచ స్థాయి నగరం అన్న చంద్రబాబు, ఇప్పుడు 33 వేల ఎకరాల అమరావతిని ’చిన్న మున్సిపాలిటీ’ అంటూ మరో 50 వేల ఎకరాలు కావాలంటున్నారు.
    లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న కోర్‌ ఏరియా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఎక్కడుందో చెప్పడం లేదు. అమరావతికి పెట్టే ఖర్చులో కేవలం 10 శాతం ఖర్చుతోనే, రాబోయే రోజుల్లో 10 రెట్లు వృద్ధి సాధించే అద్భుతమైన, సజీవమైన రాజధానిని వెంటనే సిద్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ భూమి ఉన్న చోట రాజధాని పెడితే ఖర్చు ఉండదని, అన్ని వర్గాలకూ అందుబాటు ధరల్లో ఇళ్లు, వసతులు కల్పించి అందరి రాజధాని నిర్మించవచ్చని జగన్‌గారు ఎప్పుడో స్పష్టంగా చెప్పారు. 

కూటమి నాయకుల పూటకోమాట:
    నిజానికి టీడీపీ కూటమి నాయకులే అమరావతి రాజధానిపై పూటకో మాట మాట్లాడారు.
(అంటూ ప్రెస్‌మీట్‌లో ఆ వీడియోలు ప్రదర్శించారు)
    అమరావతి అనేది ఇన్‌క్లూజివ్‌ క్యాపిటల్‌ కాదని, రైతుల దగ్గర భూములు ఇవ్వకపోతే బలవంతంగా లాక్కోవద్దని, కర్నూలే రాజధాని అంటూ పవన్‌ కళ్యాణ్‌ గతంలో స్పష్టమైన ప్రకటన చేశారు.
    రాజధాని అనేది ఒక అరిగిపోయిన రికార్డని ఎద్దేవా చేస్తూ, అన్ని సదుపాయాలూ ఉన్న వైజాగ్‌ను అభివృద్ధి చేయాలని సోము వీర్రాజు  గతంలో చెప్పారు. రూ.1,500 కోట్లు ఇస్తే చంద్రబాబు కారిపోయే బిల్డింగులు కట్టారంటూ నాడు విమర్శించారు.
    అమరావతి అనేది ఉత్తుత్తి అమరావతిగా మిగిలిపోనుందని, ప్రభుత్వం వికేంద్రీకరణ దిశగా ఆలోచించాలని జీవీఎల్‌ నరసింహారావు నాడు హితవు పలికారు.
    ఇక చంద్రబాబునాయుడుగారు అమరావతిని కేవలం గ్రాఫిక్స్‌కు, బొమ్మలకే పరిమితం చేశారంటూ గతంలో పురందేశ్వరి విమర్శలు గుప్పించారు.

రాజధాని అమరావతి ముసుగులో అవినీతి:
    అమరావతి అనేది రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే ఒక పెద్ద రియల్‌ ఎస్టేట్‌ కుంభకోణం, దోపిడీ వ్యూహం అని వైయస్‌ జగన్‌ గారి బలమైన అభిప్రాయం. అమరావతి నేల స్వభావం రాజధాని నిర్మాణానికి పనికి రాదని, అక్కడ నేల కుంగిపోయే ప్రమాదం ఉండటంతో భారీ భవనాల కోసం పునాదులకే విపరీతమైన ఖర్చు అవుతుందని, పది రూపాయలు అయ్యే చోట వంద రూపాయలు ఖర్చవుతుందని నిపుణులు మొదటి నుంచీ మొత్తుకుని చెప్పారు. శివరామకృష్ణ కమిటీ కూడా ఇది లోతట్టు ప్రాంతం, వరద ముప్పు ఉన్న ఏరియా అని హెచ్చరించింది. అయినా సరే, చంద్రబాబు ప్రాక్టికాలిటీ లేని 50 అంతస్తుల గ్లాస్‌ భవనాలు, వింత షేపుల భవనాలు, చదరపు అడుగుకి రూ.20 వేల చొప్పున అడ్డగోలుగా అంచనాలు పెంచుతూ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారు. పవర్‌ ఫ్లక్చువేషన్స్‌ ఉన్న మన దేశంలో 52 అంతస్తుల సెక్రటేరియట్‌ మధ్యలో బోట్లు తిరిగే డిజైన్లు కట్టడం కేవలం దోచుకోవడానికే.
    ఇప్పటికే రూ.50 వేల కోట్ల పైచిలుకు కాంట్రాక్టులు ఇచ్చేసి, వారికి ముందే మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు ఇచ్చుకున్నా క్షేత్రస్థాయిలో పునాదుల నుంచి ఒక్క స్ట్రక్చర్‌ కూడా పైకి లేవలేదు. వర్షం పడగానే పునాదుల్లో నీళ్లు తోడటానికే సరిపోతోంది తప్ప రోడ్లు వేసే ప్రయత్నం లేదు.
    నాడు 2014–19 మధ్యే తెచ్చిన అప్పులకు ఏటా రూ.8 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వచ్చేది, ఇప్పుడు రేట్లు డబుల్‌ అయ్యాక ఆ వడ్డీ భారం ఊహాతీతంగా పెరిగిపోతుంది. చంద్రబాబు ఈ కొద్ది కాలంలోనే ఇప్పటికే దాదాపు రూ.3.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ముంచేస్తున్నారు. అమరావతిలో గజం భూమి ధర రూ.60 వేలు అని ప్రచారం చేస్తున్నా, ప్రభుత్వ బుక్‌ వాల్యూ రూ.5,750 మాత్రమే ఉండటం వల్ల బ్యాంకు లోన్లు రావడం లేదు. చివరకు భూములు, ప్లాట్లు కొనేవారూ లేరు.

ప్రపంచంలో ఫెయిల్డ్‌ రాజధానులు:
    ప్రపంచంలో ఎక్కడా వేల కోట్లు, లక్షల కోట్లు పెట్టి కేవలం ప్రభుత్వ భవనాలే రాజధానిగా కట్టిన దాఖలాలు లేవు. మిలిటరీ డిక్టేటర్‌షిప్‌లో మయన్మార్‌ లో కట్టిన నేపిదా రాజధానిలో విమానాలు దిగేంత పెద్ద రోడ్లున్నా మనుషులు ఉండరు. ఇదొక ’డెడ్‌ సిటీ’ లేదా ’ఘోస్ట్‌ సిటీ’. ఆఫీసుల కోసం సోమవారం కార్లు వెళ్తాయి, మళ్లీ శుక్రవారం ఖాళీ అయిపోతాయి.
    ఛత్తీస్‌గఢ్‌ లో నయా రాయ్‌పూర్‌ పేరుతో రూ.5 వేల కోట్లు పెట్టి రాజధాని కట్టినా కనెక్టివిటీ లేక బిల్డింగులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
సహజంగా డెవలప్‌ అవ్వడానికే చండీగఢ్‌కు 30 నుండి 40 ఏళ్లు పట్టింది. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ పూర్తిగా గ్రోత్‌ అవ్వడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. రాజధాని అభివృద్ధి అనేది సమయం తీసుకుంటుంది తప్ప గ్రాఫిక్స్‌తో సాధ్యం కాదు.

శ్రీ వైయస్‌ జగన్‌ ప్రాధాన్యతలు.
ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే..:

    ప్రజల శ్రేయస్సు కోసం జగన్‌గారు స్పష్టమైన ప్రాధాన్యతలను ఎంచుకున్నారు. కడప స్టీల్‌ ప్లాంట్, భోగాపురం ఎయిర్‌పోర్ట్, పోలవరం ప్రాజెక్టుల వేగవంతమైన నిర్మాణం, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తి చేయడం, రూ.8 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు థీటుగా దేవాలయాల్లా తీర్చిదిద్దడం, మరో రూ.16 వేల కోట్లతో ఆస్పత్రులను గ్రామస్థాయి నుంచి సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలకు శ్రీకారం చుట్టి, వాటిలో 5 కాలేజీల నిర్మాణం పూర్తి చేయగా, అడ్మిషన్లు కూడా జరిగాయి. మరో 5 మెడికల్‌ కాలేజీలు ఆ విద్యా సంవత్సరంలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా మత్స్యకారుల కోసం 10 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం ఆయన ప్రాధాన్యతలు. ఒకవేళ జగన్‌గారు మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే అవన్నీ పూర్తయ్యేవి. 
    అమరావతి కోసం ఇప్పుడు చంద్రబాబు తెచ్చిన రూ.47 వేల కోట్ల అప్పుతో జగన్‌గారు మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు, హంద్రీ–నీవా కాలువల వెడల్పు, వెలిగొండ ప్రాజెక్ట్‌ ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం చెల్లింపు, పోలవరం నిర్వాసితుల సమస్యలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను పూర్తిగా చెల్లించి ఉండేవారు.
    ఇప్పటికే అభివృద్ధి చెంది ఉన్న వైజాగ్‌ను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేయడం ద్వారా తక్కువ ఖర్చుతోనే రాష్ట్రానికి ఒక ’గ్రోత్‌ డ్రైవర్‌’ అందించి, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల చారిత్రక ఆకాంక్షలను నెరవేర్చేవారు.
    ఇంకా అమరావతి అసెంబ్లీ భవనాలను వాడుకుంటూనే, రాజధాని మార్పు వల్ల అమరావతి రైతులకు నష్టం జరగకుండా చూసేవారు. జగన్‌గారు ఎప్పుడైనా రైతుల పక్షపాతి కాబట్టే, తన ప్రభుత్వ హయాంలో అమరావతి రైతుల యాన్యుటీని మరో 10 ఏళ్లు పొడిగించి, పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచారు. 

ఆ ప్రశ్నలకు బదులివ్వలేకే..:
    ప్రెస్‌మీట్‌లో జగన్‌గారు అడిగిన ప్రశ్నలకు.. అమరావతికి అసలు ఎక్కడి నుంచి ఫైనాన్స్‌ వస్తుందో, వయబిలిటీ ఏంటో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. రాజధాని ప్రాంతంలో తమ భూములు ఇవ్వలేమంటూ వైయస్‌ జగన్‌ గారిని కలిసిన అసలైన బాధితులైన రైతులకు ’వైయస్సార్సీపీ కార్యకర్తలు’ అని ముద్ర వేసి వేధిస్తున్నారు. రాజధాని పరిసర ప్రాంతాల్లోని కొండలన్నీ పిండి చేస్తూ, మట్టి అమ్ముకుంటూ అక్రమ మద్యం వ్యాపారాలు చేసే ముఠాలే వైయస్సార్సీపీ నాయకులపై అడ్డంగా దాడులు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎవడి వాయిస్‌ వాడు వినిపించే హక్కును నమ్మేవాడైతే చంద్రబాబు ఇలాంటి దాడులను ఎంకరేజ్‌ చేయకూడదు. అమరావతి గురించి ప్రస్తావించడమే పాపం అన్నట్లు కూటమి నేతలు ఒక భయోత్పాత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.

బూతుల సంస్కృతి వారిదే:
    అటు సోషల్‌ మీడియాలో ప్రభుత్వ తప్పులను, అమరావతి దోపిడీని ప్రశ్నించే వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారు. వాళ్ల దృష్టిలో వారి దుర్మార్గాలు, అక్రమాలను ప్రశ్నించడమే ఒక ’అసభ్యత’, ’బూతు’. మహిళలను కించపరిచేలా, బూటు కాళ్లతో కొడతామంటూ అసభ్యంగా మాట్లాడే కల్చర్‌ ఎవరిదో పవన్‌ కళ్యాణ్‌ గారి పాత విజువల్స్‌ చూస్తే తెలుస్తుంది. టాస్క్‌ ఫోర్స్‌ పెట్టినా, ఏ ఫోర్స్‌ పెట్టినా సోషల్‌ మీడియాలో బూతులు మొదలుపెట్టిన చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్, వారి ఫేక్‌ సైన్యానికే ఆ రూల్స్‌ మొదట వర్తిస్తాయి. ఈ దాడులను, అన్యాయాలను అడ్డుకోవడానికి లీగల్‌గా కోర్టుల్లోనూ, ప్రజల్లో చైతన్యం తెస్తూ అన్ని పద్ధతుల్లోనూ వైయస్సార్సీపీ పోరాటం చేస్తుంది.

కడప స్టీల్‌ప్లాంట్‌ క్రెడిట్‌ చోరీ:
    కడప స్టీల్‌ప్లాంట్‌కు 2023లో జగన్‌గారు శంకుస్థాపన చేశారు. 12 జీవోలు ఇచ్చి, కాంపౌండ్‌ వాల్, రోడ్లు, వాటర్‌ పైప్‌లైన్‌ పనులు పూర్తి చేశాం. స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన ఇన్‌ఫ్రా పనులు వేగంగా నడిచాయి. అమరావతి పనులకంటే వేగంగా అక్కడ పనులు జరిగాయి. మేం వేసిన రోడ్ల మీదనే వాళ్లు ఇవాళ చంద్రబాబు ప్రయాణించారు. వాటిని ఒప్పుకునే నైతికత చంద్రబాబుకు లేదు. జగన్‌ గారు సీఎంగా కంటిన్యూ అయి ఉంటే ఈ పాటికి ప్రొడక్షన్‌ మొదలై బటన్‌ నొక్కేవాళ్లం. కానీ చంద్రబాబు ఆ క్రెడిట్‌ దొంగిలించడానికి వర్క్‌ నడుస్తున్న ప్లాంట్‌కు మళ్లీ రెండోసారి భూమి పూజ చేస్తూ డ్రామాలు ఆడుతున్నాడు.

చంద్రబాబుకి ఏ ప్రాంతంపైనా ప్రేమ లేదు:
    చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడం మీదనే ప్రేమ తప్ప ఏ ప్రాంతం మీదా ప్రేమ లేదు. గతంలో 1999–2004 మధ్య కూడా నిజాం షుగర్స్, స్పిన్నింగ్‌ మిల్లులను ఎడాపెడా అమ్మేసి ’వ్యవసాయం దండగ’ అన్న ఫిలాసఫీ ఆయనది. రాయలసీమకు స్టీల్‌ ప్లాంట్‌ రావడం చంద్రబాబుకు ఇష్టం లేదు. చివరికి ఆయన పుట్టిన చంద్రగిరి, కుప్పానికి కూడా ఏమీ చేయలేదు. పక్క రాష్ట్ర సీఎం ఒత్తిడికి లొంగి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను కూడా ఆపేశారు.
    అందుకే నిస్సిగ్గుగా జగన్‌గారి హయాంలో చేపట్టిన, పనులు జరిగిన, దాదాపు పూర్తయిన ఫిషింగ్‌ హార్బర్లు, పోర్టులు, భోగాపురం ఎయిర్‌పోర్ట్, స్టీల్‌ ప్లాంట్‌ అన్నింటినీ ’నేనే కట్టాను’ అంటూ క్రెడిట్‌ దొంగిలించడం తప్ప చంద్రబాబు స్వయంగా చేసిందేమీ లేదని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు.

Back to Top