తాడేపల్లి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, పింగళి వెంకయ్య వర్ధంతి, స్వామి వివేకానంద వర్ధంతి, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయా మహనీయులకు సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పించారు. అల్లూరి.. ఈ పేరే ఒక స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వైయస్ జగన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. "అల్లూరి.. ఈ పేరే ఒక స్ఫూర్తి.. ధైర్యసాహసాలకు ప్రతీక. దేశ స్వాతంత్ర్యం కోసం, గిరిజనుల హక్కుల కోసం బ్రిటీష్ పాలకుల తూటాలకు ఎదురొడ్డి పోరాటం సాగించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆయన తెగువ, పోరాట స్ఫూర్తి, అఖండ దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను" అని పేర్కొన్నారు. మన ఆంధ్రుడు పింగళి వెంకయ్య పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా.. "గుండెల నిండా దేశభక్తిని నింపుకుని.. మువ్వన్నెల జాతీయ జెండాను రూపొందించిన మన ఆంధ్రుడు పింగళి వెంకయ్య. నేడు ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు"అంటూ ఆయన సేవలను స్మరించారు. దేశభక్తిని నింపిన మహనీయుడు స్వామి వివేకానంద స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా వైయస్ జగన్ ట్వీట్ చేస్తూ.. "మీపై మీకు విశ్వాసం ఉంటేనే గొప్ప విజయాలకు పునాది పడుతుందన్న దార్శనికుడు స్వామి వివేకానంద. భారత యువతలో ఆత్మవిశ్వాసం, సేవా దృక్పథం, దేశభక్తిని నింపిన మహనీయుడు. ప్రతి యువకుడు తన సామర్థ్యాన్ని విశ్వసిస్తూ.. జ్ఞానాన్ని ఆయుధంగా, సేవను ధ్యేయంగా.. దేశాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని ఆయన ఇచ్చిన సందేశం నేటికీ స్ఫూర్తిదాయకం. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను" అని పేర్కొన్నారు. నాన్నగారితో కలిసి రోశయ్య చేసిన సేవలు మరువలేరు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా వైయస్ జగన్ నివాళులు అర్పిస్తూ.. "నిరాడంబరత, నిజాయితీ, ప్రజా జీవితంలో ఉన్నత విలువలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు రోశయ్య. నాన్నగారు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డితో కలిసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మరువలేరు. రోశయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను" అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగా ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగా 79వ జయంతి సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ ఆయనకు నివాళుతులు అర్పించారు. తన ‘ఎక్స్’ ట్వీట్‌లో ‘పేదలు, బలహీన వర్గాల పక్షాన నిలబడి, వారి అభ్యున్నతి కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగా గారు. ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తూ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ప్రజల గుండెల్లో నిలిచిన రంగా గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’అని పేర్కొన్నారు.