మాచర్లలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి..!

ప‌ల్నాడు: మాచర్ల  పట్టణం 2వ వార్డులో సోమ‌వారం రాత్రి వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడి చేసి గాయ‌ప‌రిచారు. ప‌చ్చ నేత‌ల దుశ్చ‌ర్య‌ల‌ను వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు తీవ్రంగా ఖండించారు. ఇటీవల వైయ‌స్ఆర్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమానికి హాజరయ్యారనే కారణంతో టీడీపీ గుండాలు దాడికి పాల్పడ్డారు. పార్టీ వర్గాల ప్రకారం, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అండదండలతోనే ఈ దాడి జరిగింది.  మహిళ అని కూడా చూడకుండా దాడికి దిగడం దారుణమని, ఇది రాజకీయ కక్షసాధింపుకు పరాకాష్ఠ అని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తమ్మిశెట్టి మంగమ్మ కుడి చేయి విరగగా, తమ్మిశెట్టి శ్రీహరికి ఎడమ కాలు విరగడంతో పాటు పళ్లు కూడా దెబ్బతిన్నాయని బాధితులు తెలిపారు. తీవ్ర గాయాలతో బాధితులు మొదట మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందగా, అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని సమాచారం.

బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పటికీ తక్షణ స్పందన లేకపోవడం, ఫిర్యాదు స్వీకరణలో ఆలస్యం జరగడం పట్ల వైయ‌స్ఆర్‌సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ ప్రతీకారాలతో అమాయక ప్రజలపై దాడులు జరుగుతుండడం దురదృష్టకరమని వైయ‌స్ఆర్‌సీపీ పేర్కొంటూ, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు డిమాండ్ చేశారు.

Back to Top