అక్రమ కేసులతో బ్రహ్మనాయుడిని ఆపలేరు

2029లో ఆయన మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం

తేల్చిచెప్పిన మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) 

వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును నరసరావుపేటలోని ఆయన నివాసంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నాయకులతో కలిసి పరామర్శించాక మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)

బ్రహ్మనాయుడు అరెస్టుపై టీడీపీ ఎంపీ ముందే లీకులు

ఏపీ-తెలంగాణ ప్రభుత్వాల కుమ్మక్కు కుట్రలు

కుయుక్తులతో బ్రహ్మనాయుడిని ఆపడం మీ తరం కాదు

వినుకొండ నుంచి అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోలేరు

పేర్ని నాని స్పష్టీకరణ

నానాటికీ తగ్గిపోతున్న పవన్ కళ్యాణ్ ఆదరణ

సానుభూతి కోసమే వైయ‌స్ఆర్‌సీపీపై వ్యాఖ్యలు

ఆయన మాటలకు పార్టీ శ్రేణులు స్పందించొద్దు

హోంశాఖ తర్వాత మీకిచ్చిన శాఖలు చూడండి

పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని హితవు 

నరసరాపుపేట: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టగలరు కానీ, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణను ఏమాత్రం తగ్గించలేరని, 2029లో ఆయన తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లడం ఖాయమని వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)) తేల్చిచెప్పేశారు. అక్రమ కేసులో బెయిల్ పై బయటికి వచ్చిన తర్వాత నరసరాపుపేటలోని ఆయన నివాసంలో పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇతర నేతలతో కలిసి పరామర్శించిన తర్వాత పేర్నినాని మీడియాతో మాట్లాడారు. 
ప్రెస్ మీట్లో పేర్ని నాని ఇంకేమన్నారంటే..

బొల్లా బ్రహ్మనాయుడి అరెస్టుపై టీడీపీ ఎంపీ లీకులు 

బొల్లా బ్రహ్మనాయుడు గారిని తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా ఓ కేసులో ఇరికించి అరెస్టు చేసింది. ఆయన్ను అరెస్టు చేయకముందే స్ధానిక టీడీపీ ఎంపీ బ్రహ్మనాయుడు అరెస్టు అవుతారని మీటింగ్స్ లో, ప్రెస్ మీట్లలో చెప్పారు. ఆయన్ను అరెస్టు చేయబోయేది తెలంగాణ పోలీసులే అయినా, రెవెన్యూ అధికారి ఇచ్చిన ఫిర్యాదులో కానీ పోలీసుల ఎఫ్ఐఆర్ లో కానీ బ్రహ్మనాయుడు పేరు లేకపోయినా ఈ టీడీపీ ఎంపీ మాత్రం ముందే అన్నీ చెప్పేస్తాడు. అంటే ఈ ఎంపీ గారు బ్రహ్మం గారి అంశంతో పుట్టినట్లు, ఆయన వారసుడు అయినట్లు కాలజ్ఞానం చెప్తాడు. తెలంగాణలో ఉన్నది తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది దీన్ని బట్టి మనకు అర్దమవుతోంది. ఏపీ, తెలంగాణలో ప్రభుత్వాలు నడుపుతున్న వారి మధ్య ఎలా లాలూచీ ఉందన్నది దీన్ని బట్టి తెలుస్తోంది. అక్కడైనా, ఇక్కడైనా తప్పుడు కేసు పెట్టాలనుకుంటే మాత్రం పెట్టేస్తారన్న మాట. బ్రహ్మనాయుడు 2 కోట్ల వైట్ మనీని తెలంగాణలో రైతులని చెప్పిన వ్యక్తులకు బదిలీ చేశారు. అదీ ఆయన తమ్ముడు బొల్లా రమేష్ సూచన మేరకు పంపారు. ఇది నేరమంట. 

బ్రహ్మనాయుడిని అడ్డుకోవడం మీ తరం కాదు

తెలంగాణలో ఈ లావాదేవీకి దొంగ జీవోలు తయారు చేసిన వారిపై తీవ్ర చర్యలు ఉండవు. తెలంగాణ పేరుతో దొంగ భూభూరతి అకౌంట్ తయారు చేసిన వాళ్లు ముద్దాయిలు కారు, కానీ డబ్బులు పోగొట్టుకున్న బ్రహ్మనాయుడు, ఆయన సోదరుడి కుమారుడు రమేష్ దేశాన్ని దోచుకున్నట్లుగా కేసులు నమోదు చేస్తారు. చంద్రబాబు కూడా బ్రహ్మనాయుడికి ఇక్కడ వ్యాపారాలు సరిపోలేదు, అక్కడ కూడానా అంటున్నారు. మరి బ్రహ్మనాయుడు ఇదే చంద్రబాబును హెరిటేజ్ పాల వ్యాపారం ఏపీ సరిపోలేదా, తెలంగాణ, కర్నాటకలో కూడా చేస్తారా అని ఎప్పుడైనా అడిగారా ? అంటే పాల వ్యాపారంలో మీకు పోటీ వస్తారనే ఇదంతా చేశారా ? దొంగ డబ్బు ఇచ్చారా, లేక నల్లడబ్బు తీసుకెళ్లి ఢిల్లీలో వ్యాపారాలు చేయలేదు కదా,  తన కష్టార్జితంతో సంపాదించిన 2 కోట్ల డబ్బును ఇతరులకు బదిలీ చేశారు. ఇవాళ కాకపోతే రేపు అయినా వాస్తవాలు బయటికి వస్తాయి. తెలంగాణ ప్రభుత్వంతో మీకు లాలూచీ ఉంది కాబట్టి తాత్కాలికంగా బ్రహ్మనాయుడు గారిని అరెస్టు చేయించగలరు. చంద్రబాబు జైల్లో 53 రోజులు ఉండలేదా ?, నారా లోకేష్ పెద్దమ్మ ద్వారా అమిత్ షా కాళ్లు పట్టుకుని, ఆరోగ్యం బాగోలేదని చెప్పి, వైద్యం కోసమని బెయిల్ తెచ్చుకున్నారు. కానీ బ్రహ్మనాయుడు ఇలాంటి సాకులు చెప్పి బెయిల్ తెచ్చుకోలేదు. ఈ కేసుతో చంద్రబాబు ఆయన్ను వినుకొండలో రేపు పోటీ చేయకుండా ఆపగలరా, ఇక్కడ జెండా మోసే వారిని ఆపగలరా చెప్పండి. ఈ రాష్ట్రంలో కాదు, మీ పలుకుబడితో ఏ రాష్ట్రంలో మా నాయకులపై కేసులు పెట్టించినా రేపు మీపై పోటీ చేయడంలో వెనక్కి తగ్గేది లేదు. మీ ప్రభుత్వంలో వినుకొండలో వేధింపులకు గురవుతున్న ప్రతీ వైయ‌స్ఆర్‌సీపీ బాధితుల దగ్గరకు బ్రహ్మనాయుడు వెళ్తారు, పోరాడతారు, మళ్లీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో  2029లో అడుగుపెడతారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా ఆయన్ను ఆపడం మీ తరం కాదు. తప్పుడు కేసులు, అణచివేతలతో వైయ‌స్ఆర్‌సీపీని కానీ, బ్రహ్మనాయుడిని కానీ మీరు ఆపలేరనేది గుర్తుపెట్టుకోండి.

పవన్ పిచ్చిమాటలకు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు స్పందించవద్దు

పవన్ కళ్యాణ్ ఎంత దిగజారి, ఎన్ని నీచపు మాట్లాడినా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు స్పందించవద్దు. ఎందుకంటే ఆయన ఉద్దేశపూర్వకంగా తనను తిట్టించుకుని సానుభూతి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మత్తు దిగిపోతోంది కాబట్టి తిరిగి మత్తు కోసం అకారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైయ‌స్ఆర్‌సీపీని తిట్టగానే మనం పౌరుషం కొద్దీ తిరిగి తిడతాం. అప్పుడు మళ్లీ జనసేన నాయకులు తిట్టాలనేది ఆయన ఉద్దేశం. అధికారంలో ఉంటూ బాధితుల్ని, నష్టపోతున్న వాళ్లను కాపాడాల్సిన స్ధానంలో ఉన్న పవన్ కళ్యాణ్ మాట్లాడితే హోంశాఖ తన చేతిలో లేదని చెప్తుంటారు. కానీ పంచాయతీ రాజ్ శాఖ మీ చేతిలోనే ఉంది కదా. దానికేమైనా న్యాయం చేశారా చెప్పండి, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖలకు ఏమైనా న్యాయం చేశారా, ఉన్న శాఖకు న్యాయం చేయరు కానీ పరకాంత తరహాలో పక్కన శాఖలపైనే మీ దృష్టంతా.. ముందు మీకు ఇచ్చిన శాఖకు న్యాయం చేయండి. మీ శాఖలో, మీ పార్టీలో, టీడీపీలో ఉన్న గూండాలు, రౌడీల సంగతి ఎవరు చూస్తారు, వాళ్లను తొక్కి నార ఎవరు తీస్తారు ? పంచాయతీ రాజ్ శాఖలో 15వ ఆర్ధిక సంఘం నిధులు రెండేళ్లుగా విడుదల కావడం లేదు. అన్ని అకౌంట్లూ ఫ్రీజ్ చేసి పెట్టారు. నయాపైసా డ్రా చేయడానికి లేదు. ఆగస్టు 15కి పండగ చేసుకోమని గతంలో చెప్పారు. జీవోలో మాత్రం పంచాయతీ సాధారణ నిధుల్లో నుంచి ఖర్చుపెట్టుకోమన్నారు. ఆ 10 వేలు కూడా డ్రా చేసుకోవడానికి అవకాశం లేని దుస్థితి. రోడ్లు వేశామని బోర్డులు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖలో వచ్చే డబ్బులతో ప్రతీ మంత్రీ రోడ్లు వేయిస్తారు. కానీ ఇప్పటికీ నరేగా పథకంలో చేసిన పనులకు ఇప్పటివరకూ మీ వాళ్లకే డబ్బులు పడటం లేదు. పనికి రాని కుంకీ ఏనుగుల్ని కర్నాటక నుంచి తెచ్చారు. ఇంకా ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉప్పాడలో దివీస్ ల్యాబ్ వ్యర్ధాలపై 100 రోజుల్లో పరిష్కారం చెప్తానన్నారు. ఇప్పటివరకూ అతీ గతీ లేదు. కోనసీమలో కొబ్బరిచెట్లు వాలిపోతుంటే మాపై విమర్శలు చేశారు. అయినా పరిష్కారం చూపలేదు. సుగాలి ప్రీతి కోసం రాజకీయాల్లోకి వచ్చానని మీరు చెప్పుకుంటారు. ఆమె తల్లికి అరణ్య రోదనే అవుతుంది. ముందు మీ శాఖకు న్యాయం చేయండి, ఆ తర్వాత ఇతర శాఖల గురించి ఆలోచించాలని పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని హితవు పలికారు.

Back to Top