ప్రశ్నించే గొంతు నొక్కడానికే కృష్ణ చైతన్య విద్యాసంస్థలపై దాడులు

వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఫైర్‌

నెల్లూరు: మెగా డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలను ప్రశ్నించినందుకే కృష్ణ చైతన్య విద్యాసంస్థలపై ప్రభుత్వం దాడులకు దిగిందనివైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడారు.కృష్ణ చైతన్య విద్యాసంస్థలపై జరిగిన సోదాలు రాజకీయ కక్షసాధింపు చర్యలేనని కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. జిల్లాలో అనేక విద్యాసంస్థలు ఉన్నప్పటికీ, కేవలం చంద్రశేఖర్ రెడ్డికి చెందిన సంస్థలనే లక్ష్యంగా చేసుకోవడం వెనుక ప్రభుత్వం దురుద్దేశం ఉందన్నారు. ప్రజా సమస్యలను, డీఎస్సీ అక్రమాలను ఎత్తిచూపడమే ఆయన చేసిన తప్పా అని ప్రశ్నించారు. 

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ కోరిన తర్వాతే తమ విద్యాసంస్థలపై అధికారులు గంటల తరబడి సోదాలు నిర్వహించారని చెప్పారు. విద్యార్థులు, సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. అక్రమ కేసులు పెట్టలేని పరిస్థితుల్లో విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని మానసిక, ఆర్థిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్సీలు స్వచ్ఛందంగా నెల్లూరుకు రావడం వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల ఐక్యతకు నిదర్శనమని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షానే నిలబడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నందుకే తన సోషల్ మీడియా ఖాతాలను సైతం బ్లాక్ చేయించారని ఆరోపించారు.

ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీలో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాలపై ప్రశ్నించినందుకే ప్రభుత్వం కక్షగట్టి ఈ దాడులకు పాల్పడిందన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక విద్యాసంస్థలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లు, వేధింపులు చేసినా వైయ‌స్ఆర్‌సీపీ ప్రజా సమస్యలపై పోరాటం ఆపబోదని, వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని నేతలు స్పష్టం చేశారు.
 

Back to Top