అనంతపురం: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మరోసారి ఖూనీ అయింది. యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. విపక్షానికి చెందిన నాయకులపై పట్టపగలు దాడి చేసి హత్యాయత్నం చేస్తున్నారు. తాడిపత్రిలో మా పార్టీ నాయకుడు గంగులకుంట కేశవరెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోనే టీ తాగుతుండగా, జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు దారుణంగా దాడి చేసి హత్యాయత్నం చేశారు. తీవ్రగాయాలైన కేశవరెడ్డిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగా, అక్కడా ఆయనపై జేసీ వర్గీయులు దాడికి ప్రయత్నించారు. ఏకంగా ఆస్పత్రిపైనే రాళ్లదాడి చేశారు. ఇదంతా ప్రత్యక్షంగా పోలీసుల సమక్షంలోనే జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. విపక్షానికి చెందిన నాయకులకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ప్రశ్నించే గొంతు నొక్కుతున్నారు. విపక్షానికి చెందిన నాయకులెవ్వరూ ఉండకూడదన్న ధోరణిలో ఉన్నారు. ఇక తాడిపత్రిలో జేసీ వర్గీయుల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోంది. విపక్ష నాయకులపై దాడులు, హత్యాయత్నాలు, వారి ఆస్తుల విధ్వంసం రోజువారీ కార్యక్రమాల్లా మారాయి. మా పార్టీ నాయకుడు కేశవరెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా అధికార పార్టీ తన వైఖరి మార్చుకోవాలని, పోలీసులు కూడా ప్రేక్షకపాత్ర వహించకుండా, హింసాకాండను నిరోధించాలని కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్రంలో ఒక కొత్త దుష్ట సంప్రదాయానికి బీజం వేసిన వారవుతారన్న విషయాన్ని మరవొద్దని, ఈ బీజమే రేపు మొక్క అయి, ఆ తర్వాత ఒక వృక్షం అవుతుందన్నది గుర్తుంచుకోవాలని కోరుతున్నాం. కేశవరెడ్డిపై హత్యాయత్నం చేసిన వారందరినీ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.