వైయ‌స్ఆర్‌సీపీ భూసంస్కరణలపై కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ: 

మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ధ్వజం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్.

శ్రీకాకుళం (నరసన్నపేట): వైయస్.జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, శాస్త్రీయంగా తీసుకొచ్చిన చారిత్రాత్మక భూసంస్కరణలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటూ "సిగ్గులేని క్రెడిట్ చోరీ"కి పాల్పడుతోందని మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నరసన్నపేటలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు "ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్" పై, భూసర్వేపై ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించి, తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుకున్న చంద్రబాబు నాయుడు.. నేడు అదే సర్వేను పేరు మార్చి, రంగులు మార్చి అమలు చేస్తూ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్ హామీల వైఫల్యం, శాంతిభద్రతల లోపాలను కప్పిపుచ్చుకోవడానికే కూటమి ప్రభుత్వం ఉగ్రవాద చట్టాలు, లాకప్ డెత్‌లు, మత రాజకీయాలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..
 
వైయస్.జగన్ హయాంలోనే ఆధునిక భూసర్వేకు శ్రీకారం.

దేశంలో దాదాపు 100 ఏళ్ల తర్వాత భూముల సమగ్ర సర్వే కోసం వైయస్.జగన్ హయాంలో 'డాక్టర్ వైయస్సార్ జగనన్న సమగ్ర భూ హక్కు - భూ రక్ష చట్టాన్ని' ప్రవేశపెట్టాం. నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియలో భాగస్వామి కావడం నా అదృష్టం. సీనియర్ అధికారులైన నీరబ్ కుమార్ ప్రసాద్, ఉషారాణిల పర్యవేక్షణలో ప్రతి నెలా సమీక్షలు జరుపుతూ అత్యంత పారదర్శకంగా సర్వే నిర్వహించాం.

సాంకేతిక విప్లవం:
సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుని, 70 కోర్ స్టేషన్లు, రిసీవర్లు, డ్రోన్ల సాయంతో 40 వేల మంది సిబ్బందికి 70 దఫాలుగా శిక్షణ ఇచ్చి సైంటిఫిక్ మెథడ్‌లో సర్వే చేపట్టాం. పాత పాస్ పుస్తకాల్లో లేని లాటిట్యూడ్, లాంగిట్యూడ్, క్యూ ఆర్ కోడ్, యూనిట్ నెంబర్ వంటి అత్యాధునిక అంశాలను రికార్డుల్లో చేర్చాం. ప్రతి గ్రామ పరిధిలో వీఆర్ఓ, సర్వేయర్, డిజిటల్ అసిస్టెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాం. ఎన్నికల నాటికే 6 వేలకు పైగా గ్రామాల్లో డ్రోన్ సర్వేలు పూర్తయ్యాయి.

నాడు దెయ్యం.. నేడు దేవుడు: చంద్రబాబు ద్వంద్వ వైఖరి..

వైయస్.జగన్ ఫోటో ఉందనే ఒకే ఒక్క కారణంతో, ఈ భూములన్నీ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు లాగేసుకుంటారంటూ ఎన్నికల ముందు చంద్రబాబు, కూటమి నేతలు ప్రజల్లో విపరీతమైన భయాందోళనలు సృష్టించారు. నాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను 'దెయ్యం'గా చిత్రించిన చంద్రబాబు, నేడు అధికారంలోకి వచ్చాక అదే సర్వేను 'రీసర్వే 2.0' అంటూ 'దేవుడి వరం'లా ప్రశంసించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
వైయస్. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన క్యూ ఆర్ కోడ్, జియో ట్యాగింగ్, డిజిటల్ రికార్డులనే నేడు కూటమి ప్రభుత్వం వాడుతోంది. పాస్ బుక్ లోపల ఉన్న మేటర్ అంతా వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానిదే, చంద్రబాబు కేవలం పై రంగు మాత్రమే మార్చి అంతా తానే చేసినట్లు డబ్బా కొట్టుకుంటున్నారు. మా సర్వే తప్పైతే దాన్ని రద్దు చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా?

కూటమి పాలనలో అక్రమాలకు అడ్డాగా రెవెన్యూ శాఖ..

వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో 20 ఏళ్లుగా నలుగుతున్న 22-ఏ అసైన్డ్ భూముల సమస్యలను పరిష్కరించి రైతులకు పూర్తి హక్కులు కల్పించాం.
కానీ నేడు కూటమి పాలనలో మ్యూటేషన్ల కోసం రైతులను తీవ్రంగా వేధిస్తున్నారు. రెవెన్యూ శాఖ అక్రమాలకు అడ్డాగా మారింది. ప్రజా సమస్యల్లో 70-80 శాతం రెవెన్యూ సమస్యలే ఉండటం ఈ ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది. సభల్లో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే మహిళలను సైతం చంద్రబాబు గద్దిస్తూ అవమానిస్తున్నారు.

యూట్యూబర్ రావణ్ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్..

"యూట్యూబర్ రావణ్ చేసిన వ్యాఖ్యలతో వైయ‌స్ఆర్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదు. ఎవరైనా తప్పు చేస్తే చట్టప్రకారం విచారణ జరపాలి. కానీ, ఒక యూట్యూబర్ పేరు చెప్పి వైయస్.జగన్‌ను, వైయ‌స్ఆర్‌సీపీని నిందించడం దుర్మార్గం.
సాధారణ చట్టాల కింద చర్యలు తీసుకోవలసిన అంశంపై ఉగ్రవాద చట్టాలు ప్రయోగించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. నాలుగు చోట్ల కోర్టులు బెయిల్ ఇచ్చినా, కక్షసాధింపుగా మళ్లీ మరో ఉప చట్టం కింద అరెస్ట్ చేశారు.

సాయికృష్ణ, క్రాంతికుమార్, గంగమ్మ, తిరుమతి, కళావతి ఘటనలపై సమాధానాలు చెప్పలేక, ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో వైఫల్యం చెందిన కూటమి ప్రభుత్వం కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికే లాకప్ డెత్‌లు, మత రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ సిగ్గులేని క్రెడిట్ చోరీని, అబద్ధాల రాజకీయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని తగిన టైంలో బుద్ది చెప్పడం ఖాయమని  ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు.

Back to Top