రెండేళ్లలో 17 మంది దళిత యువకుల మరణాలు

గంజాయి అమ్మకపోతే పోలీసుల వేధింపులు

క్రాంతి కుమార్ మృతిపై సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే

అంబటి రాంబాబు, మొండితోక అరుణ్ కుమార్ డిమాండ్ 

విజయవాడలో పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు  కాకుమాను రాజశేఖర్, డైమండ్ బాబు, ఇతర నాయకులతో కలిసి పరామర్శించి మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్

దళిత యువకులతో గంజాయి అమ్మకాలా?

నిరాకరిస్తే వేధించి మరీ చంపేస్తున్నారు

క్రాంతికుమార్ మృతి వెనుకా గంజాయి దందా

సీబీఐ దర్యాప్తు జరిపిస్తేనే బాధితులకు న్యాయం

తేల్చిచెప్పిన అంబటి రాంబాబు

కూటమి సర్కార్ లో దారుణంగా దళితుల పరిస్ధితి

రెండేళ్లలో 17 మంది వేధింపుల వల్లే చనిపోయారు

అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు

క్రాంతి కుమార్ ఆత్మహత్యపైనా అదే మౌనం

ఎమ్మెల్సీ మొండి తోక అరుణ్ కుమార్ ఫైర్

విజయవాడ: రాష్ట్రంలో ఈ రెండేళ్లలో ప్రభుత్వ వేధింపుల వల్ల 17 మంది దళిత యువకుల మరణాలు చోటు చేసున్నాయని, ఇప్పుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య కూడా ఇదే కోవలోకి వస్తుందని, అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడం దారుణమని వైయ‌స్ఆర్‌సీపీనేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మండిపడ్డారు. ఇవాళ కృష్ణలంకలో పోలీసుల వేధింపులతో సెల్ఫీ వీడియో తీసుకుని చనిపోయిన పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని పార్టీ నేతలు కాకుమాను రాజశేఖర్, డైమండ్ బాబు, ఇతర నాయకులతో కలిసి వారు పరామర్శించారు. గంజాయి అమ్మకపోతే వేధింపులకు గురిచేసి దళిత యువకుల్ని చంపేస్తున్నారని, కాబట్టి క్రాంతి కుమార్ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపిస్తేనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని అంబటి రాంబాబు, మొండితోక అరుణ్ కుమార్ తేల్చిచెప్పారు. 
ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు, మొండితోక అరుణ్ కుమార్ ఇంకేమన్నారంటే...    

● దళిత యువకుల ఉసురుతీస్తున్న కూటమి సర్కార్ :
మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్సీ

కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో దళితుల పరిస్ధితి ఎలా ఉందో చెప్పడానికి నిదర్శనం క్రాంతి కుమార్ ఆత్మహత్య. ఈ రెండేళ్లలో 17 మంది దళిత యువకులు ప్రభుత్వ వేధింపుల వల్ల చనిపోయారు. ఇందులో 15 మంది మాదిగ యువకులు, ఇద్దరు మాల యువకులు ఉన్నారు. మాట్లాడితే చంద్రబాబు తాను పెద్దమాదిగ అని, మాదిగలకు పెద్ద దిక్కుగా ఉంటానని చెప్పుకుంటారు. రాష్ట్ర హోంమంత్రి సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వారు. మీ టీడీపీ జెండా మోసి, మీ విజయంలో తమ వంతు పాత్ర పోషించిన దళిత నేత పేరు పోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో తీసుకుని చనిపోతే, చంద్రబాబుకు, హోంమంత్రికి, కూటమిలో దళిత ఎమ్మెల్యేలకు పరామర్శించే తీరిక లేదు. తాను ఈ వ్యక్తి వేధింపుల వల్ల చనిపోతున్నానని సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుంటే, ఏమాత్రం చలనం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. గత రెండేళ్లలో ఇంత మంది దళిత యువకులు చనిపోతే రాష్ట్ర హోంమంత్రి కానీ, ఎస్సీ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా స్పందించారా ? చనిపోయిన వారిలో వీడియో తీసుకుని మరీ సాక్ష్యంగా పెడితే కూడా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదనట్లుగా చేతులు దులుపుకుంటున్నారు. ఈ చావులతో మీరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా సిగ్గూ, శరం, దళితులపై ప్రేమ ఉంటే తక్షణం పేరు పోగు కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈ ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టి అరెస్టు చేయాలి. ఆ కుటుంబాన్ని ముఖ్యమంత్రి వెంటనే పరామర్శించి, ఇతర మరణాల తరహాలోనే ప్రభుత్వ భూమి, కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని వైయ‌స్ఆర్‌సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పేరు పోగు కుటుంబానికి న్యాయం చేయకపోతే జాతీయ ఎస్సీ కమిషన్ ను, జాతీయ మానవహక్కుల కమిషన్ ను కలుస్తాం. ఈ రెండేళ్లలో పొట్టనబెట్టుకున్న వారితో కలిపి క్రాంతి కుమార్ మరణంపైనా న్యాయం చేయాలని ఫిర్యాదు చేస్తాం. 

● గంజాయి అమ్మకపోతే వేధించి చంపేస్తారా ?:
అంబటి రాంబాబు, మాజీ మంత్రి

పేరు పోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు క్రాంతి కుమార్ గత నెల 21న ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో అంతా ఆత్మహత్యే అనుకున్నారు. తర్వాత బయటపడిన సెల్ఫీ వీడియోతో ఎవరో ప్రేరేపిస్తే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. కృష్ణలంక సీఐ నాగరాజు, పోలీసులు గతంలో తనను చాలాసార్లు వేధించారని, మళ్లీ వేధించే ప్రయత్నం చేస్తున్నారని, అక్కడికి వెళ్తే చంపేస్తారని, అందుకే తాను విషపు గుళికలు తీసుకుని చనిపోతున్నట్లు క్రాంతి కుమార్ వీడియోలో చెప్పాడు. పోలీసుల బెదిరింపుల వల్లే క్రాంతి కుమార్ బలవన్మరణానికి పాల్పడినట్లు అర్దమవుతోంది. కానీ కృష్ణలంక పోలీసులు ముందు అనుమానాస్పద మృతిగా కేసు పెట్టారు. ఆ తర్వాత వీడియో బయటికి రావడంతో క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు వేధింపులతో జరిగిన ఆత్మహత్యగా ఫిర్యాదు చేశారు. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు దీన్ని వేధింపుల ఆత్యహత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయాలి. నగరంలో ఇతర రౌడీ షీటర్లను కూడా క్రాంతి కుమార్ ను అడ్డుపెట్టుకుని బెదిరించి గంజాయి అమ్మించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అతని తండ్రి చెప్తున్నారు. సాయికృష్ణ విషయంలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. అంటే గంజాయి అమ్మకాలతో కొందరు డబ్బులు సంపాదించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇవాళ అతికష్టం మీద సీఐ నాగరాజును అరెస్టు  చేశారు. కేసు నమోదైన నాలుగు రోజుల, సీసీ ఫుటేజ్ సహా సాక్ష్యాధారాలన్నీ మాయం చేశాక అతన్ని అరెస్టు చేశారు. ఒకే పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ రెండు కేసులపై సీబీఐకి అప్పగించి దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఏపీ పోలీసులు దర్యాప్తు చేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్టులు ఇస్తారు కాబట్టి, బాధితులకు న్యాయం జరగాలంటే సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే.

Back to Top