పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

 విజయవాడ: కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబాన్ని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, డైమండ్ వజ్రబాబు, కాకుమాను రాజశేఖర్ తదితరులు క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావును కలసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, క్రాంతికుమార్ తన మరణానికి కారణం సీఐ నాగరాజు వేధింపులేనని సెల్ఫీ వీడియోలో పేర్కొన్న నేపథ్యంలో కేసును పునర్విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును తిరిగి ఓపెన్ చేసి సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు.

ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని, ఇప్పటివరకు పలువురు దళితులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. దళితులపై ప్రేమ ఉందని చెప్పుకునే నేతలు ఇప్పటివరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమని విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, క్రాంతికుమార్ మరణం అనుమానాస్పదంగా ఉందని, పోలీస్ స్టేషన్‌లో సీసీ ఫుటేజ్ మాయం కావడం వంటి అంశాలు తీవ్రమైన అనుమానాలకు దారితీస్తున్నాయని అన్నారు. ఈ కేసుతో పాటు గాదె సాయికృష్ణ ఘటనపై కూడా సమగ్ర సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని నేతలు స్పష్టం చేశారు. అవసరమైతే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కూడా ఆశ్రయిస్తామని తెలిపారు.
 

Back to Top