పోలీసుల వేధింపు కార‌ణంగానే ఏడుకొండలు మృతి 

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఆరోప‌ణ‌లు

గూడూరు ఆసుప‌త్రి వ‌ద్ద ఆందోళ‌న 

నెల్లూరు: గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల వేధింపుల కారణంగానే ఏడుకొండలు మృతి చెందాడని ఆరోపిస్తూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆందోళన చేపట్టారు. మనుబోలు పోలీస్ స్టేషన్‌లో విచారణ పేరుతో జరిగిన చిత్రహింసలే ఈ మరణానికి కారణమని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడిన కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ‘లాకప్ డెత్’ అనే అనుమానాలు కలిగిస్తున్న ఘటన అని పేర్కొన్నారు. దొంగతనం కేసు విచారణ పేరుతో మనుబోలు ఎస్ఐ హనీఫ్ ఏడుకొండలను స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టడంతోనే అతడు ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు.

ఐదు రోజుల పాటు విచారణ పేరుతో స్టేషన్‌కు పిలుస్తూ చిత్రహింసలకు గురిచేశారని, తీవ్ర అస్వస్థతకు గురైన ఏడుకొండలను ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో నిజాలు వెలుగులోకి రావాలంటే పోస్టుమార్టాన్ని వీడియో రికార్డింగ్‌తో నిర్వహించడంతో పాటు పారదర్శకంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.  ఏడుకొండల కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని కాకాణి స్పష్టం చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహంతో మనుబోలు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

మృతుడి భార్య, కుటుంబ సభ్యులు కూడా ఎస్ఐ హనీఫ్ వేధింపుల కారణంగానే ఏడుకొండలు మృతి చెందాడని ఆరోపిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
 

Back to Top