బతికున్నప్పుడు అవమానించి.. ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలా? 

వైయ‌స్ఆర్‌సీపీ నేత జక్కంపూడి రాజా 

కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏనాడూ పదవులు, అధికారం కోసం పాకులాడిన వ్యక్తి కాదని వైయ‌స్ఆర్‌సీపీ నేత జక్కంపూడి రాజా అన్నారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులే తిరస్కరించడం ఆ నిర్ణయంపై వారి అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తోందన్నారు.  కాకినాడ జిల్లా కిర్లంపూడిలో బుధవారం మీడియాతో మాట్లాడిన జక్కంపూడి రాజా.. ముద్రగడ పద్మనాభం జీవితమంతా ప్రజా సమస్యల పరిష్కారం, కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం అంకితమైందని పేర్కొన్నారు. ఆయనకు అధికారాలపై, పదవులపై ఎలాంటి మోహం లేదని, ప్రజల కోసమే రాజకీయాలను ఉపయోగించుకున్న నాయకుడని కొనియాడారు.

ముద్రగడ పద్మనాభంను బతికున్న సమయంలో అనేక రకాలుగా వేధించి, అవమానించారని జక్కంపూడి రాజా విమర్శించారు. కుటుంబ సభ్యుల పట్ల కూడా అసభ్యకరంగా వ్యవహరించారని ఆరోపించారు. అలాంటి పరిస్థితులు కల్పించినవారే ఇప్పుడు అధికారిక లాంఛనాల పేరుతో సానుభూతి ప్రదర్శించడం సమంజసం కాదన్నారు. "ముద్రగడ పద్మనాభం అధికారం కోసం పరిగెత్తిన వ్యక్తి కాదు. ప్రజా సమస్యల కోసం జీవితాంతం పోరాడిన నాయకుడు. బతికున్నప్పుడు ఇబ్బందులకు గురిచేసి, మరణించిన తర్వాత మొసలి కన్నీరు కార్చడం వల్ల ప్రయోజనం ఏముంటుంది" అని జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు.

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, తమకు అలాంటి గౌరవాలు అవసరం లేదని కుటుంబ సభ్యులు స్పష్టంగా చెప్పారని ఆయన తెలిపారు. కుటుంబ నిర్ణయం మేరకు కిర్లంపూడిలోని నివాస ఆవరణలోనే హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.  ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడని, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా, మంత్రిగా ప్రజలకు సేవలందించారని జక్కంపూడి రాజా గుర్తు చేశారు. ఆయన ఆశయాలు, ప్రజా పోరాట స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.
 

Back to Top