డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, సూపర్ సిక్స్ హామీల అమల్లో వైఫల్యం

శాంతిభద్రతల క్షీణత, కరువైన మహిళా రక్షణ 

మండలి సాక్షిగా  వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తాం :

స్పష్టీకరించిన వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. 

తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి.

వైఫల్యాలను ప్రశ్నిస్తామనే  మా పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు 

కూటమి నిర్వహించిన మెగా డీఎస్సీ దగా డీఎస్సీ

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలి 

కూటమి పాలనలో గాడి తప్పిన పాలన- శూన్యమైన శాంతిభద్రతలు 

విద్యార్ధులు, మహిళలు, రైతులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాలకీ  ద్రోహం

సూపర్ సిక్స్ హామీలేమైనాయి?- నిరుద్యోగ భృతి ఎక్కడ ?

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు ?

మండలి సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం

ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హెచ్చరిక.

తాడేపల్లి:   డీఎస్సీలో అవకతవకలు, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని మండలి సాక్షిగా నిలదీస్తామని వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హెచ్చరించారు. తాడేపల్లి వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీ పేరుతో నిర్వహించిన పరీక్షల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణ జరిపించే ధైర్యం ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా మహిళలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు మరియు నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, బిఎన్ఎస్ చట్టాల అమలులో ఏపీ దేశంలోనే చివరి స్థానానికి దిగజారిపోవడమే అందుకు నిదర్శనమని ఎత్తిచూపారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గొంతు విప్పేందుకు వీలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వెంటనే ప్రధాన ప్రతిపక్షంగా  గుర్తించాలని డిమాండ్ చేశారు. సభలో మాట్లాడ్డానికి సరిపడా సమయం లభిస్తే ప్రభుత్వ గుట్టు రట్టవుతుందనే భయంతోనే హోదా ఇవ్వడానికి కూటమి నాయకులు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. అయినా ప్రభుత్వ వైఫల్యాలన్నింటిపై రానున్న సమావేశాల్లో కౌన్సిల్ వేదికగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని ఆమె స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... 

మా పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించేందుకు ఎందుకు భయం?

"వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ అధ్యక్షతన జరిగిన శాసన సభా పక్ష సమావేశంలో 17వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పాత్రను ఏ విధంగా సమర్థవంతంగా పోషించాలనే దానిపై వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. హోమ్ మంత్రి అనిత వైయస్.జగన్ దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నారు. ఆమెకు నేను ఒకటే సవాల్ విసురుతున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే వైయస్.జగన్ కి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి. అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే. మరి మా పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు?
మేమేమీ ప్రోటోకాల్ కోసం అడగట్లేదు, ప్రజా సమస్యలపై శాసనసభలో మాట్లాడడానికి సరిపోయినంత సమయం కావాలని అడుగుతున్నాం. సమయం ఇవ్వకపోతే ప్రజా సమస్యలను ఎలా ప్రశ్నిస్తాం? మిగతా సాధారణ ఎమ్మెల్యేలకి ఇచ్చినంత సమయమే వైయస్.జగన్ కి ఇస్తామనడం ఎంతవరకు సమంజసం? ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజా సమస్యలపై నిలదీసే సమయం ఇవ్వడం ఒక హక్కు. వైయస్.జగన్ అసెంబ్లీకి వస్తే తమ వైఫల్యాలను నిలదీస్తారనే భయంతోనే హోదా ఇవ్వకుండా పారిపోతున్నారు. ఢిల్లీలో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఇక్కడ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సాంకేతిక కారణాలు చూపిస్తూ కాలయాపన చేస్తున్నారు.

మెగా డీఎస్సీలో దగా.. అక్రమాలపై సీబీఐ ఎంక్వయిరీకి ఎందుకు వెనకడుగు?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెట్టిన మెగా డీఎస్సీ ఒక దగా డీఎస్సీగా మారింది. స్పోర్ట్స్ కోటాలోని 421 పోస్టుల భర్తీలో తీవ్ర అక్రమాలు జరిగాయి. ఆడియో, వీడియో ఆధారాలు బయటకు వచ్చినా సీబీఐ ఎంక్వయిరీ వేయడానికి ఎందుకు భయపడుతున్నారు? ఎస్సీఈఆర్టీలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. పేపర్ లీక్ అయింది కాబట్టే అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. లీకేజీ వ్యవహారం బయటపడటంతో కౌన్సిలింగ్ సమయంలో ఆ అభ్యర్థిని పక్కన పెట్టారు. అంటే ఇక్కడ అవకతవకలు జరిగాయని ప్రభుత్వానికి ముందే తెలుసు.
నేషనల్స్ లో గోల్డ్ మెడల్స్ వచ్చిన అభ్యర్థులను పక్కన పెట్టి, కేవలం పార్టిసిపేట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల పరిధిలోని వారికి ఉద్యోగాలు ఇచ్చారు. డీఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కి పోరాడుతున్నా, వైయస్.జగన్  ఆధారాలు బయటపెట్టినా చంద్రబాబు,లోకేష్ ఎందుకు స్పందించడం లేదు?.

దిగజారిన శాంతిభద్రతలు.. 36వ స్థానానికి పడిపోయిన ఏపీ.

హోంమంత్రి అనిత శాంతిభద్రతలను గాలికి వదిలేసి, ఎంతసేపూ వైయస్.జగన్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కేంద్ర హోమ్ శాఖ నివేదిక ప్రకారం బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మన రాష్ట్రం 36వ స్థానానికి దిగజారిపోయింది. ఇది మీ అసమర్థతకు నిదర్శనం కాదా? రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి. రాజమండ్రిలో వైద్య విద్యార్థిని ప్రియాంకను మద్యం మత్తులో కారుతో గుద్ది దారుణంగా హత్య చేస్తే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. టీడీపీ నాయకులే మహిళలపై అగాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఒక మహిళా హోమ్ మంత్రిగా ఉండి మహిళలకు కనీస రక్షణ కల్పించలేకపోతున్నారు.

అన్ని వర్గాలకు వెన్నుపోటు.. సూపర్‌ సిక్స్‌ నామరూపాల్లేవు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయిందని... ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మహిళలను, నిరుద్యోగులను, ఉద్యోగులను, విద్యార్థులను, రైతులను దారుణంగా మోసం చేసిందని వరుదు కల్యాణి మండిపడ్డారు. మహిళలకు రూ. 10 లక్షల వరకు సున్నా వడ్డీ ఇస్తామని చెప్పి, పాత రూ. 3 లక్షల సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేయడం లేదని... రైతులకు పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధరల్లేవని తేల్చి చెప్పారు.  ఇంటికో ఉద్యోగం లేదా రూ. 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 25 నెలలైనా రూపాయి ఇవ్వలేదని.. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 21 శాతానికి పెరిగి 191 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు విద్యార్థులకు రూ. 9,500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి తల్లిదండ్రులను అప్పులపాలు చేశారని... ఉద్యోగులకు డిఏ, పిఆర్సి, ఐఆర్ ఇవ్వకుండా దగా చేశారని ఆక్షేపించారు. పీపీపీ మోడ్ పేరుతో రాష్ట్రాన్ని దోపిడీకి స్కెచ్ వేశారని... రానున్న కౌన్సిల్ సమావేశాల్లో వైఎస్సార్సీపీ తరఫున ఈ సమస్యలన్నింటిపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

Back to Top