కర్నూలు: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కర్నూలు పర్యటన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పోలీసు ఆంక్షలు విధించింది. వైయస్ జగన్‌ను చూసేందుకు స్వచ్ఛందంగా తరలివస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎమ్మిగనూరు శివారులో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దేవనకొండ, కోడుమూరు, గోనెగండ్ల, నాగలాపురం, పెద్దపాడు, ఆస్పరి ప్రాంతాల్లోనూ కర్నూలు వైపు వస్తున్న వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తల వాహనాలను నిలిపివేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. హైవేపై కూడా ఆంక్షలు కడప–కర్నూలు జాతీయ రహదారిపై తమరాజుపల్లె వద్ద వైయస్ జగన్ పర్యటనకు అభిమానులు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగగా, తమను అనుమతించకపోతే జాతీయ రహదారిపైనే బైఠాయిస్తామని అభిమానులు తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద వాహనాల నిలిపివేత నందవరం మండలం హాలహర్వి టోల్‌గేట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టి మంత్రాలయం నియోజకవర్గం నుంచి కర్నూలుకు వస్తున్న వాహనాలను నిలిపివేశారు. దీంతో పార్టీ శ్రేణులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కర్నూలుకు చేరుకునే ప్రయత్నం చేశాయి. ఎమ్మిగనూరులో కర్నూలు వైపు వెళ్లే వాహనాలను నిలిపివేయడంతో రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయని స్థానికులు పేర్కొన్నారు. అలాగే నందికొట్కూరు, ఆత్మకూరు నుంచి వచ్చే వాహనాలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. వైయస్ జగన్ పర్యటనపై ముందస్తు ఆంక్షలు వైయస్ జగన్‌కు కర్నూలు జిల్లా జైలులో ములాఖత్‌కు మాత్రమే అనుమతి ఉందని, రోడ్‌షోలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరించినట్లు వైయస్ఆర్‌సీపీ నేతలు తెలిపారు. 30 యాక్ట్ అమల్లో ఉన్నందున వైయస్ జగన్‌ను చూసేందుకు ప్రజలు హాజరుకావద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇదేం ఆంక్షలు? వైయస్ జగన్ పర్యటనకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్న నేపథ్యంలో వారిని అడ్డుకునేందుకు వందలాది మంది పోలీసులను మోహరించడం కూటమి ప్రభుత్వ భయాన్ని బయటపెడుతోందని వైయస్ఆర్‌సీపీ శ్రేణులు మండిపడ్డాయి. ప్రజలు తమ అభిమాన నేతను చూసేందుకు వెళ్లడాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని పేర్కొన్నాయి. నంద్యాల జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ, వైయస్ జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తుంటే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకోవడం ఏ విధమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా చట్టం, రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలని వైయస్ఆర్‌సీపీ నేతలు కోరారు. అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని, ప్రజల హక్కులను అణచివేసే చర్యలకు భవిష్యత్తులో ప్రజలే సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.