తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఆయన ప్రజాసేవ, సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని స్మరించుకుంటూ నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ఆరె శ్యామల, వెన్నపూస రవీంద్రారెడ్డి, అంకంరెడ్డి నారాయణమూర్తి, నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం సామాజిక సమానత్వం, వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన నాయకుడని కొనియాడారు. ప్రజా సమస్యలపై ఆయన చూపిన నిబద్ధత, ఉద్యమ స్ఫూర్తి ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.