న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా మారిందని, రోజురోజుకీ పరిస్థితి మరింత దిగజారుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ఈ అంశంపై లోక్‌సభలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని పార్టీ స్పష్టం చేసింది. ఆ మేరకు వైయస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్ ఎం.గురుమూర్తి లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పోలీసులు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, మహిళలపై అత్యాచారాలు నేరాలు పెరుగుతున్నాయని, ఎస్సీలపై దాడులు కొనసాగుతున్నాయని, రాజకీయ హింసతో పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆ తీర్మానంలో ఎంపీ ఎం.గురుమూర్తి ప్రస్తావించారు. అందుకే ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అత్యంత కీలక అంశంగా ఈ అంశంపై సభలో తక్షణ చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు ఘటనలను అందులో ప్రస్తావించారు. విజయవాడలో సాయికృష్ణ లాకప్‌డెత్, నెల్లూరు జిల్లా మనుబోలులో పోలీస్ కస్టడీలో ఏడుకొండలు అనే వ్యక్తి మృతి, కర్నూలు జిల్లా అదోనిలో మాల గంగమ్మ, విజయవాడలో క్రాంతికుమార్, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎస్‌కే దరియా హుస్సేన్ మరణాలను తన వాయిదా తీర్మానంలో ప్రస్తావించిన ఎంపీ గురుమూర్తి, ఇవన్నీ ఆందోళనకర అంశాలని, రాష్ట్రంలో దారుణంగా మారిన పోలీస్ వ్యవస్థకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, అంటే 2024 జూన్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రాష్ట్రంలో మహిళలపై నమోదైన నేరాలకు సంబంధించిన గణాంకాలను కూడా ఎంపీ గురుమూర్తి తన వాయిదా తీర్మానంలో పొందుపరిచారు. ఈ కాలంలో మొత్తం 209 ఘటనలు నమోదయ్యాయని, అందులో 126 అత్యాచారాలు, లైంగిక దాడుల కేసులు, 12 అత్యాచార యత్నాలు, 35 లైంగిక వేధింపుల కేసులు, 97 భౌతిక దాడులు, 34 హత్యలు లేదా అనుమానాస్పద మరణాలతో పాటు, వేధింపుల కారణంగా 15 ఆత్మహత్యలు లేదా ఆత్మహత్యా యత్నం కేసులు నమోదైనట్లు తెలిపారు. మరోవైపు ఎస్సీలకు సంబంధించి 69 ఘటనలు నమోదయ్యాయని, వాటిలో హత్యలు, కస్టడీ హింస, పోలీసుల వేధింపులు, సామాజిక బహిష్కరణ, భూ ఆక్రమణలు, ఇళ్ల కూల్చివేతలతో పాటు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద నమోదైన కేసులు ఉన్నాయని తెలిపారు. ఇంకా రాజకీయ హింసకు సంబంధించిన 133 ఘటనలను కూడా గురుమూర్తి ప్రస్తావించారు. వాటిలో 49 హత్యలు, 6 హత్యాయత్నాలు, 6 కిడ్నాప్‌లు, 58 భౌతిక దాడులు, 10 ఆస్తుల ధ్వంస ఘటనలు, రాజకీయ వేధింపుల కారణంగా జరిగినట్లు ఆరోపిస్తున్న 4 ఆత్మహత్యలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలో పోలీసుల పనితీరు, వ్యవహారశైలిపై రాష్ట్ర హైకోర్టు 12 సందర్భాల్లో ప్రతికూల వ్యాఖ్యలు చేసిన విషయాన్ని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించి 79 ప్రధాన ఘటనలు నమోదైన విషయాన్ని కూడా ఆయన ఆ తీర్మానంలో ప్రస్తావించారు. ఇవన్నీ రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతి భద్రతలు, యథేచ్ఛగా సాగుతున్న పౌర హక్కుల ఉల్లంఘనకు నిదర్శనంగా నిలుస్తున్నాయని ఎంపీ తెలిపారు. అందుకే దీనిపై సభలో సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇంకా రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలపై కేంద్రం ఒక సమగ్ర నివేదిక కోరాలని, అన్ని ఘటనలపై నిష్పక్షపాతంగా, కాలపరిమితితో కూడిన విచారణ జరిపించాలని, ఎక్కడ ఉల్లంఘనలు నిర్ధారణ అయితే అక్కడ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలా రాజ్యాంగబద్ధ హక్కులను పరిరక్షిస్తూ, రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ ఎం.గురుమూర్తి విజ్ఞప్తి చేశారు.