తాడేపల్లి: చంద్రబాబు నేతృత్వంలో రెండేళ్లుగా రాష్ట్రంలో జంగిల్‌రాజ్ పాలన సాగుతోందని, ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే కేసులు, వైఫల్యాలను ఎత్తిచూపితే దాడులు, అన్యాయాలను ఎదిరిస్తే అరెస్టులతో ప్రభుత్వమే భయాందోళనకు గురిచేస్తోందని గుంటూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండేళ్లుగా వైయస్ఆర్‌సీపీనాయకులపై దాడులు చేయించిన కూటమి ఎమ్మెల్యేలు, ఇప్పుడు సొంత కూటమికి చెందిన జనసేన కార్యకర్తలతోపాటు సొంత టీడీపీ కార్యకర్తలను కూడా వదిలిపెట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అవినీతి, అరాచకాలను ప్రెస్‌మీట్ పెట్టి మీడియాకు వివరించాడనే కోపంతో సొంత పార్టీకే చెందిన అడ్వకేట్ ఈడుపుగంటి శ్రీనివాస్ ఇంటి మీద దాడి చేసి జేసీబీలతో ఇంటిని కూల్చేస్తానని భయభ్రాంతులకు గురిచేసినా ఆయనపై కనీసం కేసు కూడా పెట్టడానికి సీఎం చంద్రబాబు భయపడుతున్నాడని చెప్పారు. ఎమ్మెల్యే దాడి ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తుంటే చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందని, అమరావతి నిర్మాణం ముసుగులో జరుగుతున్న అవినీతి, డీఎస్సీ-2025 నిర్వహణలో అక్రమాలను బయటపెట్టినందుకే వైయస్ఆర్‌సీపీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాను ఇండియాలో బ్లాక్ చేయించారని వివరించారు. విమర్శలకు సమాధానం చెప్పుకోలేక ప్రతిపక్షం గొంతునొక్కాలని చూడటం సిగ్గుచేటన్నారు. వైయస్ఆర్‌సీపీ చేసిన ఆరోపణల్లో నిజం ఉంది కాబట్టే ప్రభుత్వం భయంతో వణికిపోతోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీసులే సంఘ విద్రోహ శక్తులుగా మారిపోయారని, కాపు యువకుడు గాదె సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు మే 9న అరెస్ట్ చేసి లాకప్ లో చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపేశారని అంబటి రాంబాబు సంచలన విషయం బయటపెట్టారు. అంతేకాకుండా మృతదేహాన్ని అప్పగిస్తే లాకప్ డెత్‌కి ఆధారాలు దొరుకుతాయనే భయంతో పోలీసులు పక్కనే ఉన్న శ్మశానంలో దహనం చేశారని వివరించారు. తన కొడుకు ఆచూకీ కోసం మృతుడి తల్లి గాదె విజయలక్ష్మి పోలీసులను అడిగినా సమాధానం చెప్పకపోవడంతో ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిందని చెప్పారు. దీంతో పోలీసులు కోటి రూపాయలు ఇస్తామని రాజీ కోసం ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. జనసేనలో పనిచేసే కాపు యువకుడి కుటుంబానికి ఇంత తీవ్రమైన అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పదించడం లేదని అంబటి రాంబాబు నిలదీశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... నియంతకల కన్నా దారుణంగా చంద్రమాబు పాలన ఆంధ్ర రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన సాగుతోంది. ప్రపంచంలో చాలామంది నియంతకల కన్నా దారుణంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు. కూటమి ఎమ్మెల్యేలు రాజ్యాంగేతర శక్తులుగా మారిపోయారు. ఎక్కడ చూసినా శాండ్, ల్యాండ్, వైన్, మైన్, పేకాట, రేషన్ మాఫియాలదే రాజ్యం. అన్నింటా కూటమి నాయకుల అరాచకాలే. రూపాయి మిగిలే ఏ వ్యాపారం ఉన్నా దానిలో కూటమి ఎమ్మెల్యేలు, వారి బినామీలు చేరిపోతారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులను ఉపయోగించి రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు దేశంలో ఏ రాష్ట్రంలోనూ కనిపించడంలేదు. వారి అరాచకాలను విమర్శిస్తే అక్రమ కేసులు. ఎదురు నిలబెడితే బెదిరింపులు, దాడులు. పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. సొంత పార్టీ నాయకుడి ఇంటిపైనే చింతమనేని దాడి కూటమి రెండేళ్ల పాలన తర్వాత పోలీసులను, టీడీపీ గూండాలను పంపించి దాడులు చేయించే పరిస్థితి నుంచి ఏకంగా ఎమ్మెల్యేలే అర్థరాత్రి నేరుగా దాడుల్లో పాల్గొనే రౌడీరాజ్యం తీసుకొచ్చారు. టీడీపీ లీగల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈడుపుగంటి శ్రీనివాసరావు అనే వ్యక్తి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేస్తున్న లిక్కర్, పేకాట, మట్టి, మైనింగ్ దందాలపై ఆధారాలు సేకరించి ప్రజలకు తెలియజేస్తున్నాడనే కోపంతో ఆయన ఇంటిపైనే అర్థరాత్రి దాడికి తెగబడ్డాడు. మద్యం మత్తులో మందీమార్భలంతో అడ్వకేట్ శ్రీనివాస్ ఇంటి మీద దాడి చేసిందే కాకుండా అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు. పోలీసుల సమక్షంలోనే ఇంటిని జేసీబీతో కూల్చేస్తానని వీరంగం సృష్టించాడు. అయితే ఇక్కడ గమ్మత్తేమిటంటే దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద కేసు పెట్టకుండా బాధితుడైన ఈడుపుగంటి శ్రీనివాస్ మీద కేసు పెట్టిన పోలీసులు ఇంతవరకు కోర్టులో కూడా ప్రవేశపెట్టలేదు. సొంతపార్టీ నాయకుడి మీద దాడి చేసిన ఎమ్మెల్యే మీద తెలుగుదేశం పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరీ దారుణంగా ఈడుపుగంటి శ్రీనివాస్‌ని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీనికి సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారు? చింతమనేనిపై కేసు పెట్టే ధైర్యం లేదా? 94 కేసులున్న చింతమనేని ప్రభాకర్ ఆగడాలకు చంద్రబాబు వంతపాడుతున్నాడు. కూటమి ప్రభుత్వం రాగానే ఈ చింతమనేని జెడ్పీటీసీ ఇంటి మీద దాడికి తెగబడ్డాడు. వైయస్ఆర్‌సీపీ నాయకుడు కామిరెడ్డి నాని ఇంటిని తగలబెట్టించాడు. పెదవేగి సమీపంలో బీసీ నాయకుడి హత్యలో ఎమ్మెల్యే చింతమనేని హస్తం ఉందనేది అందరికీ తెలిసిన సీక్రెట్. ఇవికాకుండా చింతమనేని భూదందాలకు హద్దే లేకుండా పోతోంది. దోపిడీలకు ఎవరు అడ్డొచ్చినా ఎమ్మెల్యేలు ఏమాత్రం ఉపేక్షించడం లేదు. అది సొంత కూటమికి చెందిన జనసేన వారైనా, సొంత టీడీపీ నాయకులైనా సరే. రెండేళ్లకే ఇంత దారుణమైన పరిస్థితులుంటే రాబోయే మూడేళ్ల పాలన గురించి ఆలోచించి సామాన్య ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి సిగ్గుంటే చింతమనేని ప్రభాకర్ మీద కేసు పెట్టాలి. ఇప్పటికే చేసిన అరాచకాలకు కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదు. రెండేళ్లుగా వైయస్ఆర్‌సీపీ శ్రేణులపై దాడులు సామాన్య ప్రజలకు అన్యాయం జరిగితే తాట తీస్తానని చెప్పే చంద్రబాబు.. హద్దూ అదుపూ లేకుండా ఎమ్మెల్యేలు రెచ్చిపోతుంటే చోద్యం చూస్తూ కూర్చున్నాడు. ఒక ఎమ్మెల్యే చికెన్ మీద ట్యాక్సులేసి వసూలు చేస్తుంది. కొంతమంది పోలీసులే సంఘ విద్రోహ శక్తులుగా మారి వారి పొలిటికల్ బాస్‌ల ఆదేశాల ప్రకారం వైయస్ఆర్‌సీపీనాయకుల మీద దాడులు చేస్తున్న సంఘటనలు రెండేళ్లుగా చూస్తున్నాం. ఎమ్మెల్యే తరఫున పోలీసులే అక్రమ వసూళ్లకు పాల్పడుతూ దోచుకుంటున్న ఘటనలు రాష్ట్రంలో జరుగుతుంటే ఈ వ్యవస్థను ఏమనాలి? మా ఇంటి మీద దాడి చేసిన టీడీపీ గూండాలను వదిలేసి నాపైనే కేసు పెట్టిన దుర్మార్గ ప్రభుత్వం ఇంతకన్నా ఏం చేస్తుంది? జోగి రమేశ్ ఇంటి మీద, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇళ్ల మీద దాడులు చేసినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల కారణంగానే ఏపీ పోలీస్ వ్యవస్థ దేశంలో అట్టడుగుస్థానానికి పడిపోయింది. అమరావతి, డీఎస్సీ మీద ప్రశ్నించినందుకే.. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే చంద్రబాబు భయంతో వణికిపోతున్నాడు. తప్పులను సరిదిద్దుకోకుండా మరింత బరితెగించి తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. ప్రశ్నించే గొంతులు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఏకంగా వైయస్ఆర్‌సీపీ అధికారిక ఖాతాలనే స్తంభింప చేస్తున్నాడు. పోలీసుల ద్వారా మెటా (ఫేస్‌బుక్)కి తప్పడు ఫిర్యాదులు చేయించి వైయస్ఆర్‌సీపీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాను దేశంలో బ్లాక్ చేయించాడు. అమరావతి దోపిడీ, డీఎస్సీలో అవకతవకలపై పోస్టులు పెడుతుంటే ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. అవినీతి, తప్పులు చేయకపోతే వారికి అంత భయం దేనికి? కాపు యువకుడు గాదె సాయికృష్ణను పోలీసులు లాకప్ లో చంపేశారు పోలీసులు సంఘ విద్రోహ శక్తులుగా మారిపోతున్న పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి మే 9న గాదె సాయికృష్ణ అనే యువకుడిని తీసుకొచ్చారు. పోలీసులు చిత్రహింసలు పెట్టారు. కానీ ఇంతవరకు ఆయన్ను కోర్టు ముందు హాజరుపర్చలేదు. చిత్రహింసలు పెట్టి లాకప్‌లోనే చంపేశారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులకు ఇంతవరకు అతడి ఆచూకీ కూడా చెప్పడం లేదు. తన కొడుకుని పోలీస్ స్టేషన్‌లో చూశానని, కానీ కోర్టులో ప్రవేశపెట్టలేదని అతడి తల్లి విజయలక్ష్మి చెప్పుకుని కన్నీరుమున్నీరవుతోంది. తన కొడుకు ఉన్నాడో లేడో కూడా చెప్పడం లేదని అతడి తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం జరిగింది. దీంతో ఈనెల 29వ తేదీలోపు సాయికృష్ణను కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. చంపేసి కోటి రూపాయిలిస్తామని రాజీ! సాయికృష్ణ మృతదేహం దొరికితే పోస్టుమార్టం ద్వారానైనా పోలీసులు చేసిన దారుణం వెలుగుచూస్తుందని భయంతో ఎవరికి తెలియకుండా దహనం చేశారు. సీఐ నాగరాజు ఆదేశాలతో బైకుపై పోలీసు కానిస్టేబుళ్లు సాయికృష్ణ మృతదేహాన్ని మధ్యలో పెట్టుకుని తీసుకెళ్లి కృష్ణలంక శ్మశాన వాటికలో దహనం చేశారు. ఆధారాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఏకంగా మృతదేహాన్ని రహస్యంగా దహనం చేయడం ఘోరం కాదా? ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉంటుందా? ఇతనితోపాటు మరో నలుగుర్ని తీసుకెళ్లిన పోలీసులు అందర్నీ కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు సాయికృష్ణను మాత్రం ఇంతవరకు కోర్టుకు తీసుకెళ్లలేదు. ఈ సాయికృష్ణ రాధా-రంగ మిత్రమండలిలో పనిచేస్తాడు. నేను పవన్ కళ్యాన్‌కి వ్యతిరేకంగా మాట్లాడతానని అతని మేనమామ నాగేశ్వరరావు అనేకసార్లు నన్ను తీవ్రంగా దూషించాడు. ఒక యువకుడిని లాకప్‌డెత్ చేసి, ఆచూకీ అడిగితే అతడు సంఘ విద్రోహ శక్తి, క్రిమినల్ అని పోలీసులు చెబుతున్నారు. నేరస్తులైతే కోర్టులు శిక్షించాలేకానీ చంపేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? లాకప్ డెత్‌లో యువకుడిని చంపేసి కోటి రూపాయిలిస్తామని డీజీపీ ద్వారా పోలీసులు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ని అభిమానించే జనేసన అభిమానులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లు కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పి తీరాలి. పవన్ కళ్యాన్ తాను జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నానని చెప్పడం సినిమా రీరిలీజ్ చేయడం లాంటిదే. గతంలో ఆయన బీజేపీతో కలిసి తెలంగాణలో పోటీ చేసిన విషయం ఆయనే మర్చిపోయాడా? లింగమనేని రమేశ్ ఫ్లైట్ టికెట్లు కొనిచ్చాడని ఢిల్లీలో మీటింగ్ పెట్టాడే తప్ప దాని వల్ల ఏం ప్రయోజనం? ఆంధ్రప్రదేశ్‌లో 175 నియోజకవర్గాల్లోనే పోటీ చేయలేని వాడు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ఏం చేస్తాడు? కనీసం ఇక్కడి కార్యకర్తలను టీడీపీ నాయకులు కుళ్లబొడుస్తుంటే వారికి న్యాయం చేయకుండా జాతీయ రాజకీయాలు చేస్తామనడం పబ్లిసిటీ స్టంట్ కోసమే. పవన్ కళ్యాణ్ వైఖరి చూస్తుంటే చంద్రబాబు కోసం జనసేన పార్టీనే త్యాగం చేస్తాడేమో అనిపిస్తుంటుంది.