జగనన్న కాలనీల భూసేకరణపై సీబీఐ విచారణకు సిద్ధమా?

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స‌వాల్‌

ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపణలను ఖండించిన మాజీ ఎమ్మెల్యే

అవినీతి జరిగిందని భావిస్తే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్

ప్రొద్దుటూరు:  జగనన్న కాలనీల భూసేకరణలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి నిజంగానే చిత్తశుద్ధితో ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స‌వాల్ సవాల్ విసిరారు. జగనన్న కాలనీల కోసం భూముల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చేస్తున్న ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జగనన్న కాలనీల కోసం భూముల కొనుగోలు పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు. వైయ‌స్ జగన్ ప్రభుత్వం హయాంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని మూడు ప్రాంతాల్లో 146 మంది రైతుల నుంచి 468 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్ ద్వారా కొనుగోలు చేసి సుమారు 23 వేల మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. భూములు విక్రయించిన వారిలో టీడీపీకి చెందిన రైతులు కూడా ఉన్నారని, తాము ఒక్క రూపాయి కూడా అక్రమంగా తీసుకున్నట్లు నిరూపించగలరా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.

2009 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేదలకు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదని, అయితే వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం అందించాలనే లక్ష్యంతో జగనన్న కాలనీలను అమలు చేసిందన్నారు. పంపిణీ చేసిన పట్టాలు అర్హులైన లబ్ధిదారులకే ఇచ్చామని చెప్పారు.  పట్టాల పంపిణీ లేదా భూసేకరణలో ఏవైనా అవకతవకలు జరిగాయని ప్రభుత్వం భావిస్తే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని సూచించారు. అంతేకాకుండా 23 వేల మంది లబ్ధిదారులు, భూములు విక్రయించిన రైతులు, కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులు అందరినీ ఒకే వేదికపై సమావేశపరచి బహిరంగ విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తికాకూడదనే ఉద్దేశంతోనే కొందరు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాగా పెనమనూరు నియోజకవర్గంలో కూడా 558 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 29 వేల మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజలకు ఇళ్ల స్థలాలు అందించిన కార్యక్రమంపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకుని, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కోరారు.
 

Back to Top